వాయువు వచ్చేదెప్పుడు ఆయువు నిలిచేదెప్పుడు!?

May 8 2021 @ 23:11PM
కోవూరు : ఇనమడుగులోని ఆక్సిజన్‌ ప్లాంటును పరిశీలిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

వెంటాడుతున్న ఆక్సిజన్‌ కొరత

విపరీతంగా పెరుగుతున్న పాజిటివ్‌లు

కొత్తగా ఒక బెడ్డూ పెంచలేని పరిస్థితి

ఆక్సిజన్‌ ఆదా కోసం అధికారుల కసరత్తు 

అదనపు నిల్వల కోసం పంపిణీదారులతో సంప్రదింపులు


నెల్లూరు, మే 8 (ఆంధ్రజ్యోతి):

ఈ నెల 7వ తేదీన కరోనా బారిన పడ్డ బాలకృష్ణమూర్తి  శ్వాస ఆడని స్థితికి చేరుకున్నాడు. 104కు ఫోన్‌ చేస్తే నారాయణ ఆసుపత్రికి వెళ్లమన్నారు. ఆ ఆసుపత్రి హెల్ప్‌ డెస్క్‌కు ఫోన్‌ చేస్తే తీసుకురండి.. అడ్మిట్‌ చేద్దాం అన్నారు. అక్కడికి వెళ్లాక ఆక్సిజన్‌ బెడ్లు ఖాళీ లేవు. కిందా మీదా పడ్డారు. బెడ్డు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంతలో కుటుంబ సభ్యుల చేతుల్లోనే బాలకృష్ణమూర్తి కన్ను మూశాడు.  

నెల్లూరు నగరానికి చెందిన మరో వ్యక్తి కరోనా లక్షణాలతో జీజీహెచ్‌లో అడ్మిట్‌ అయ్యాడు. రెండు రోజుల్లో పరిస్థితి విషమించింది. ఆక్సిజన్‌ బెడ్‌కు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ బెడ్లు ఖాళీ లేవు. మీకు ఆక్సిజన్‌ బెడ్లు కలిగిన మరో ఆసుపత్రికి వెళ్లండని వైద్య సిబ్బంది సలహా ఇచ్చారు. మాకెవరూ తెలియదు, మేము ఇక్కడే ఉంటామని బాధితురాలి తరపు వారు అన్నారు. అయితే ఏం జరిగినా మీదే బాధ్యత అని సెల్ప్‌ డిక్లరేషన్‌ ఇవ్వమన్నారు. దీంతో వీరు 104కు ఫోన్‌ చేసి తమ బాధ వెళ్లగక్కారు. తామేమి చేయలేమంటూ ఫోన్‌ పెట్టేశారు. 

 ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి సంఘటనలు రోజుకు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. ప్రాణవాయువు కోసం పరితపిస్తూ ఆసుపత్రుల ఆవరణలోనే ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య ప్రతిరోజూ పదుల సంఖ్య దాటుతోంది. ఇప్పటి వరకు బెడ్ల మీద ఉన్న వారు అదృష్టవంతులు.. ఆపై వచ్చేవారు దురదృష్టవంతులు అన్న చందంగా వైద్య సిబ్బంది చేతులెత్తేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 


రాష్ట్రంలో ప్రాణ వాయువు లభ్యత విషయంలో ఇతర జిల్లాలతో పోల్చితే నెల్లూరు పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆక్సిజన్‌ బెడ్లు పెంచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడు జిల్లా కేంద్రంలో మరో 500 ఆక్సిజన్‌ బెడ్లు, వందకుపైగా ఐసీయూ బెడ్లు పెంచుకునేందుకు అవసరమైన వనరులు, సిబ్బంది ఉన్నా కేవలం ఆక్సిజన్‌ కొరత కారణంగా అధికారులు బెడ్లు పెంచే సాహసం చేయలేకపోతున్నారు. ప్రాణాలు కాపాడుకోవాలని ఆసుపత్రుల వద్దకు పరుగులు తీస్తున్న ప్రజలు అక్కడ ఆక్సిజన్‌ బెడ్లు లభించక తమ చేతుల్లోనే తమ వారి ప్రాణాలు పోవడం చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు, అవసరానికి సరిపడా ప్రాణవాయువు లభ్యమయ్యేదెప్పుడు!? అప్పటివరకు ప్రాణాలతో నిలబడేది ఎవరు!? విగతజీవులయ్యేది ఎందరు!? సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఏదో ఒకటి చేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.


ఆక్సిజన్‌ కొరత కారణంగా...


జిల్లా కొవిడ్‌ ఆసుపత్రిగా గుర్తించిన నారాయణ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితుల కోసం 770 బెడ్లు కేటాయించారు. సూపర్‌స్పెషాలిటీ విభాగంలోని 40తో కలిపి మొత్తం 100 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశామని అధకారులు అంటున్నారు. అలాగే ఆక్సిజన్‌ బెడ్లు 176, సాధారణ బెడ్లు 500 ఉన్నాయి. వాస్తవానికి ఈ ఆసుపత్రిస్థాయికి ఈ కేటాయింపులు చాలా తక్కువ. జీజీహెచ్‌తో పోల్చితే నారాయణలో వనరులు ఎక్కువ. ఫ్యాకల్టీ కూడా అంతే. బెడ్ల సామర్థ్యం ఎక్కువ. కానీ జీజీహెచ్‌లో 900లకుపైగా ఆక్సిజన్‌ బెడ్లు ఉండగా నారాయణలో కేవలం 172 బెడ్లు మాత్రమే ఉన్నాయి. 150 పడకలతో కొత్త ఐసీయూ ప్రారంభిస్తామని ప్రకటించినా అది చేయలేకపోతున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నట్లు ప్రచారం ఉన్నా ప్రధాన కారణం మాత్రం ఆక్సిజన్‌ కొరతేనని తెలుస్తోంది. ఈ ఆసుపత్రి పరిధిలో కొవిడ్‌కు కేటాయించిన బెడ్లకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించడం, 150 బెడ్లలో కొత్త ఐసీయూ ప్రారంభించాలంటే రోజుకు 20 కిలోలీటర్ల ఆక్సిజన్‌ అవసరం అవుతుంది. కానీ  ప్రస్తుతం ఈ ఆసుపత్రికి కేవలం 7 నుంచి 8 కెఎల్‌ ఆక్సిజన్‌ మాత్రమే అందుతోంది. ఈ కారణంగా బెడ్ల సంఖ్య పెంచలేకపోతున్నట్లు ఆసుపత్రి వర్గాల సమాచారం. ఈ ఆసుపత్రిలో కొత్తగా 13 కెఎల్‌ సామర్థ్యం కలిగిన ట్యాంకర్‌ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదు. షార్‌ నుంచి ఆక్సిజన్‌ సరఫరా కూడా ఒక్కరోజు ముచ్చటగా మిగిలి పోయింది. ఒక్కసారి ఆక్సిజన్‌ బెడ్ల సంఖ్య పెంచి అడ్మిషన్లు చేసుకుంటే మధ్యలో ఆక్సిజన్‌ నిల్వలు లేకపోతే ప్రాణనష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ కారణంగా ఇప్పటికిప్పుడు ఆక్సిజన్‌ బెడ్లు, ఐసీయూ బెడ్లు పెంచగలిగే వనరులున్నా, పెంచలేకపోతున్నామని అధికారులు అంటున్నారు.  ఆక్సిజన్‌ నిల్వలు సాధించగలిగితే నారాయణలో ప్రస్తుతం ఉన్న 500 సాధారణ బెడ్లను ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చగలిగితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనడంలో అనుమానం లేదు. 


జీజీహెచ్‌లో


ఇక జీజీహెచ్‌ విషయానికి వస్తే ఇక్కడ ప్రస్తుతం 900 పైచిలుకు ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయి. ఈ బెడ్ల సంఖ్యను ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఈ ఆసుపత్రి పరిధిలో రోజుకు 15 టన్నుల ఆక్సిజన్‌ వినియోగిస్తున్నామని అధికారులు అంటున్నారు. 11 కేఎల్‌ సామర్థ్యం కలిగిన ట్రాంకరుతోపాటు ఇటీవల 13 కెఎల్‌ సామర్థ్యం కలిగిన ట్యాంకర్‌ ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన  ట్యాంకర్‌కు గ్యాస్‌ సరఫరా చేసే బాధ్యత ఆ ట్యాంకర్‌ విక్రయించిన కంపెనీదే. ఆ మేరకు ఒప్పందంతోనే ట్యాంకర్‌ను కొనుగోలు చేశారు. ఈ రెండు ట్యాంకర్ల సామర్థ్యానికి సరిపడ 24 కె.ఎల్‌ ఆక్సిజన్‌ నిల్వలు ఉంటే జీజీహెచ్‌లో బెడ్ల సంఖ్య ఇంకా పెంచవచ్చు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు పైప్‌లైన్‌ ద్వారా ఆక్సిజన్‌ సప్లయ్‌ చేయడం సాధ్యం కాకపోయినా సిలెండర్ల ద్వారా అయినా రోగులకు అందించవచ్చు కదా! అంటున్నారు. 


ఆదా కోసం కసరత్తు


మూడు నెలల ముందు వరకు వైద్య రంగంలో ప్రాణవాయువు పెద్దగా ఖరీదైనది కాదు. కానీ ఇప్పుడు పేరును సార్థకం చేసుకునేలా అన్నింటికన్నా విలువైనదిగా, నిజంగానే కరోనా బాధితుల పట్ట ప్రాణాధారమైనదిగా మారింది. ఈ క్రమంలో జిల్లా ఉన్నతాధికారులు దీని విలువను గుర్తించి గ్యాస్‌ దిగుమతితోపాటు అందుబాటులో ఉన్న గ్యాస్‌ను ఆదా చేయడానికి నడుం బిగించారు. గ్యాస్‌ వినియోగాన్ని ఆడిట్‌ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లీకేజ్‌ ఎక్కువగా ఉందని గుర్తించారు. ఆ లీకేజీలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అదనపు గ్యాస్‌ సరఫరా కోసం ఐనాక్స్‌ కంపెనీతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ సమస్య కేవలం అధికారుల కష్టం ఒక్కదానితో పరిష్కారం కాదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. జిల్లాకు ఆక్సిజన్‌ సరఫరా పెంచుకునే మార్గం ఆలోచించి యుద్ధ ప్రాతిపదికన ఆచరణలో పెట్టాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.