ఆక్సిజన్‌ అందేదెలా..?!

ABN , First Publish Date - 2021-05-10T05:52:38+05:30 IST

ములుగు ఏరియా వైద్యశాలలో ఆక్సిజన్‌ కొరత ఏ ర్పడే ప్రమాదం నెలకొంది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విపరీత ప్రభావం చూపుతుండగా 15 రోజులుగా నిత్యం 100కుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో చాలా మందికి ఆక్సిజన్‌ అవసరం పడుతుండటంతో ఆస్పత్రిలోని బెడ్లు నిండిపోతున్నాయి. ఫలితంగా ఆక్సిజన్‌ అవసరం పెరిగిపోతోంది. ఇందుకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రాబోయే రోజుల్లో కొరత ఏర్పడే ప్రమాదం నెలకొంది.

ఆక్సిజన్‌ అందేదెలా..?!

ములుగు ఏరియా ఆస్పత్రికి ప్రాణవాయువు కొరత 

సగం బెడ్లకే రోజుకు 30 వేల లీటర్ల వినియోగం

పెరుగుతున్న రోగుల తాకిడి

సెల్ఫ్‌ జనరేట్‌ ప్లాంట్‌పైనే ఆశలు

ములుగు, మే 9 : ములుగు ఏరియా వైద్యశాలలో ఆక్సిజన్‌ కొరత ఏ ర్పడే ప్రమాదం నెలకొంది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విపరీత ప్రభావం చూపుతుండగా  15 రోజులుగా నిత్యం 100కుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో చాలా మందికి ఆక్సిజన్‌ అవసరం పడుతుండటంతో ఆస్పత్రిలోని బెడ్లు నిండిపోతున్నాయి. ఫలితంగా ఆక్సిజన్‌ అవసరం పెరిగిపోతోంది. ఇందుకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రాబోయే రోజుల్లో కొరత ఏర్పడే ప్రమాదం నెలకొంది. 

కరోనా రోగుల కోసం ములుగు ఏరియా ఆస్పత్రిలో 160 బెడ్లను ఏర్పాటు చేశారు. వీటిలో 100 సాధారణ వైద్యం కోసం కాగా 60 బెడ్లకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించారు. సాధారణ రోజుల్లో రోజుకు ఒకరిద్దరు రోగులకు మాత్రమే ఆక్సిజన్‌ అవసరమయ్యేది.  ఇటీవల జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం, ఊపిరితిత్తుల సమస్య ఏర్పడి ఆక్సిజన్‌ అవసర పడటంతో అందరినీ అత్యవసర సేవా విభాగంలో అడ్మిట్‌ చేస్తున్నారు. ఏటూరునాగారం, వెంకటాపురం(నూగూరు) సామాజిక వైద్యశాలల్లో ఎనిమిది చొప్పున ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేసినా అక్కడ అత్యవసర వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి రోగులను ములుగుకే పంపిస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ, గణపురం మండలాలకు చెందిన కరోనా రోగులు కూడా ములుగుకే వస్తున్నారు. ప్రస్తుతం 40 ఆక్సిజన్‌ బెడ్లపై చికిత్స అందుబాటులో ఉంది. ములుగు, ఏటూరునాగారంలోని ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లలో చేరిన పలువురికి ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెంటనే వారిని అంబులెన్స్‌లలో ములుగుకు తీసుకొచ్చి ఆక్సిజన్‌ పెడుతున్నారు.

రోజుకు 30 వేల లీటర్ల ఆక్సిజన్‌ వినియోగం

ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు 30వేల లీటర్ల ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నారు. ఒక్కో సిలిండర్‌ సామర్థ్యం వెయ్యి లీటర్లు ఉండగా ప్రతిసారి 30 సిలిండర్లను వరంగల్‌, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఇటీవల వరంగల్‌లో సిలిండర్ల కొరత ఏర్పడటంతో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య చొరవ తీసుకొని హైదరాబాద్‌ నుంచి తెప్పిస్తున్నారు. ఇందు కోసం రోజుకు రూ.లక్ష ఖర్చవుతోందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైతే తాత్కాలికంగా ఉపశమనం కలిగింది గానీ.. ఒక్కోరోజు సిలిండర్లు రాకపోవడంతో ప్రభావం రోగులపై పడుతోంది. వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆక్సిజన్‌ అందించలేని దుస్థితి ఏర్పడింది. ఇదేక్రమంలో ఒకేరోజు మొత్తం బెడ్లు నిండిపోతే అందరికీ ఆక్సిజన్‌ అందించడం కష్టంగా మారనుంది.

సొంత ప్లాంట్‌పైనే ఆశలు..

ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 51 సెల్ఫ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను కేటాయించింది. ఇందులో భాగంగా గాలి ద్వారా ప్రాణవాయువును ఉత్పత్తి చేసే యంత్రాన్ని ములుగు ఏరియా వైద్యశాలలో ఏర్పాటు చేయనున్నారు. మూడు రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చిన ఇంజనీర్లు మార్చురీకి సమీపంలో  స్థల పరిశీలన కూడా చేశారు. త్వరలోనే యంత్రాలను బిగిస్తామని చెప్పారు. దీంతో ఆక్సిజన్‌ కొరతను అధిగమిస్తామనే ఆశలు ఆస్పత్రి వర్గాల్లో కలిగాయి. ఈ నేలాఖరుకు ఆక్సిజన్‌ జనరేట్‌ యంత్రాలు వస్తాయని సమాచారం.

Updated Date - 2021-05-10T05:52:38+05:30 IST