షాకింగ్.. ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. ఐదు నిమిషాలు ఆక్సిజన్ బంద్.. 22 మంది రోగుల మృతి?

ABN , First Publish Date - 2021-06-08T21:18:19+05:30 IST

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఎలా ఉందో కళ్లముందు కనపడుతూనే ఉంది. రోజూ లక్షల సంఖ్యలో కరోనా కేసులు వస్తుండటంతో ఆక్సిజన్ కొరత కూడా తీవ్రరూపం దాల్చింది.

షాకింగ్.. ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. ఐదు నిమిషాలు ఆక్సిజన్ బంద్.. 22 మంది రోగుల మృతి?

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఎలా ఉందో కళ్లముందు కనపడుతూనే ఉంది. రోజూ లక్షల సంఖ్యలో కరోనా కేసులు వస్తుండటంతో ఆక్సిజన్ కొరత కూడా తీవ్రరూపం దాల్చింది. దీంతో రోగుల బంధువులు ఆక్సిజన్ సిలిండర్ల కోసం తీవ్ర ప్రయాస పడాల్సి వస్తోంది. ప్రపంచ దేశాల సాయం, కేంద్రం ప్రయత్నాల ఫలితంగా ప్రస్తుతం ఆక్సిజన్ కొరత కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు. అయితే ఆక్సిజన్ కొరత వల్ల ఆసుపత్రుల్లో ఎలాంటి భయానక పరిస్థితులు ఏర్పడ్డాయో కళ్లకు కట్టినట్టు చెప్పే ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మాక్ ఆక్సిజన్ డ్రిల్ పేరుతో అయిదు నిమిషాల పాటు కరోనా రోగులకు ఆక్సిజన్‌ను నిలిపివేసిందో ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం. ఫలితంగా 22 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 26వ తారీఖున ఆగ్రాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటపడింది. దీంతో అత్యంత క్రూరమైన ఈ చర్య పట్ల విచారణకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఏప్రిల్ 26న 96 మంది కరోనా రోగులు ఆక్సిజన్ బెడ్స్‌పై ఉన్నారు. ఆక్సిజన్ కొరత ఉంటే ఏదో విధంగా ప్రయత్నాలు చేసి రోగులకు అందించాల్సింది పోయి ఆ ఆసుపత్రి యజమాని అరింజయ్ జైన్ ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాడు. ఏప్రిల్ 26వ తారీఖున ఉదయం 7 గంటల సమయంలో ఓ ఐదు నిమిషాల పాటు రోగులందరికీ ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయించాడు. ఫలితంగా 22 మంది రోగుల పరిస్థితి ఐదు నిమిషాల్లోనే విషమించింది. వాళ్ల శరీరం నీలం రంగులోకి మారిపోయింది. దీంతో వెంటనే ఆక్సిజన్ సరఫరాను ఆ 22 మందికి పునరుద్ధరించారు. మిగిలిన 74 మందికి ఆక్సిజన్ లేకపోయినా కూడా తీవ్ర ప్రమాదం లేదని చెప్పుకొచ్చారు. నిజంగా ఆక్సిజన్ అవసరం ఎవరికి ఉందో తెలుసుకునేందుకు ఈ మాక్ డ్రిల్ చేసినట్టుగా ఆ యజమాని సమర్ధించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటపడింది. దీంతో ఈ చర్య కాస్తా తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, మీడియాలో ప్రముఖంగా కథనాలు ప్రసారం కావడంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలెర్టయింది. ఈ ఘటనపై ఆగ్రా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ‘ఆ వీడియోను మేము కూడా చూశాము. దీనిపై విచారణ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశాము’ అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్సీ పాండే స్పష్టం చేశారు. 


కాగా, ఆ ఘటన జరిగిన రోజు ఆసుపత్రిలో 22 మంది మరణించారంటూ బాధితులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కానీ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం వాటిని కొట్టి పారేస్తోంది. ఏప్రిల్ 26న తమ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల నలుగురు మాత్రమే చనిపోయారని స్పష్టం చేస్తోంది. ‘మీ ఆసుపత్రిలో రోజువారీగా కరోనా రోగులు మృతి చెందిన వివరాలు ఉన్నాయా?’ అన్న ప్రశ్నకు మాత్రం ఆసుపత్రి యాజమాన్యం సమాధానం చెప్పడం లేదు. అలాంటి కచ్చితమైన వివరాలేమీ తమ వద్ద లేవని నిర్లక్ష్యంగా బదులివ్వడం గమనార్హం. ‘మా తాతయ్య కూడా ఏప్రిల్ 26వ తారీఖున చనిపోయారు. అదే రోజు మరికొంత మంది రోగులు కూడా ఆక్సిజన్ లేక చనిపోయారు. ఆసుపత్రి యాజమాన్యమే ఆక్సిజన్‌ను ఐదు నిమిషాలు ఆపేయండని ఆదేశాలు ఇవ్వడం చూసి నేను షాకయ్యాను. ఆ ఐదు నిమిషాలు ఆక్సిజన్ లేకపోవడం వల్ల 22 మంది కరోనా పేషెంట్ల పరిస్థితి విషమించింది. అది ఓ రకంగా హత్యే. వారిపై చర్యను తీసుకోవాలి’ అంటూ ఏప్రిల్ 26వ తారీఖున మరణించిన ఓ వ్యక్తి మనవరాలు మయాంక్ చావ్లా ఆవేదన వ్యక్తం చేసింది. 

Updated Date - 2021-06-08T21:18:19+05:30 IST