ఇంట్లోనే ఆక్సిజన్ తయారీ

ABN , First Publish Date - 2021-05-11T16:44:08+05:30 IST

ఆక్సిజన్ కొరతతో రోజు రోజుకు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇవన్నీ చూసి చలించిపోయిన..

ఇంట్లోనే ఆక్సిజన్ తయారీ

హైదరాబాద్: ఆక్సిజన్ కొరతతో రోజు రోజుకు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇవన్నీ చూసి చలించిపోయిన కొందరు కృత్రిమ మేథస్సుతో ఆక్సిజన్ తయారీకి శ్రీకారం చుట్టారు. విభిన్న పద్ధతుల ద్వారా ఆక్సిజన్ తయారు చేసి హోంఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు అత్యవసర సమయాల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ నుంచి ఆక్సిజన్ వేరుచేసి అందించే పరికరాన్ని రూపొందించారు.


ఇంట్లోనే ఆక్సిజన్ తయారీ... వాయుపుత్ర అనే పరికరాన్ని హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ రూపొందించింది. కరోనా నేపథ్యంలో తీవ్ర ఆక్సిజన్ కొరత ఉండడంతో తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఆక్సిజన్ తయారు చేసుకునేలా స్టార్టప్‌ కంపెనీ ది పై ఫ్యాక్టరీ వాయుపుత్ర అనే వినూత్న పరికరాన్ని ఆవిష్కరించింది. సైన్స్‌ సూత్రాల ఆధారంగా ఆక్సిజన్‌ తయారీకి రియాక్టర్‌ను రూపొందించింది. శానిటైజర్లలో విస్తృతంగా వినియోగించే ద్రావణం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌. దీనిని రసాయన విశ్లేషణ చేసి విడగొట్టినప్పుడు ఆక్సిజన్‌తోపాటు హైడ్రోజన్‌ ద్రావణం ఏర్పడుతుంది. ఇదే ఫార్ములాతో  మెటల్ ఆక్సైడ్స్ ఉపయోగించి హైడ్రోజన్ పెరాక్సైడ్‌ నుంచి ఆక్సిజన్ వేరుచేసే రియాక్టర్‌ను ది పై ఫ్యాక్టరీ నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ గోరకవి తయారు చేశారు.


ప్లాస్టిక్‌తో చేసిన సిలిండర్ ఆకారంలో ఉండే డబ్బాలో  రియాక్టర్‌ను ఏర్పాటు చేశారు. దానికి పై భాగంలో రెండు హోల్స్ ఉండే విధంగా తయారు చేయించారు. ఒక పైపు  గుండా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ ...మరో  పైపు నుంచి ఆక్సిజన్ బయటకు వచ్చేలా రూపొందించారు.  బాటిల్ నుంచి వచ్చే హైడ్రోజన్ పెరాక్సైడ్‌ డబ్బాలో ఉండే రియాక్టర్‌పై పడినప్పుడు ఆక్సిజన్ వేరవుతుంది. వేరయిన ఆక్సిజన్ మరో పైపు నుంచి బయటికి వస్తుంది. 


మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క చనిపోయిన కేసులు కొన్నైతే...ఆక్సిజన్ లేక చనిపోయిన కేసులు ఇంకెన్నో..సకాలంలో ఊపిరి అందక  ప్రాణాలు కోల్పోతున్న రోగులు ఎందరో ఉన్నారు. ఆ కొన్ని నిమిషాలు ఆక్సిజన్ అంది ఉంటే వారందరూ ప్రాణాలతో బ్రతికేవారు.. అలాంటి ఎమర్జన్సీ ఉన్నవారికి ఏకకాలంలో ఇద్దరికి.. సుమారు 6 గంటలపాటు ఆక్సిజన్‌ను అందించే వెసులుబాటు ఉంది. దీని ధర రూ.2500 మాత్రమే ఉంటుందని, అనుమతులు రాగానే మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఫ్యాక్టరీ నిర్వాహుడు ప్రవీణ్ తెలిపారు. 

Updated Date - 2021-05-11T16:44:08+05:30 IST