ఆక్సిజన్‌ కొరత రాకుండా చర్యలు

ABN , First Publish Date - 2021-05-07T05:24:55+05:30 IST

మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత సమస్యలు ఉత్పన్నం కాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందని, ఈమేరకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ చెప్పారు.

ఆక్సిజన్‌ కొరత రాకుండా చర్యలు
ప్రభుత్వాసుపత్రి వద్ద వైద్యాధికారులతో మాట్లాడుతున్న జేసీ, సబ్‌ కలెక్టర్‌

  • ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రుల యాజమాన్యాలతో జేసీ లక్ష్మీశ
  • రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రి సందర్శన
  • ఆక్సిజన్‌ వినియోగం, నిల్వలపై ఆరా

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 6: మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత సమస్యలు ఉత్పన్నం కాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందని, ఈమేరకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ చెప్పారు. గురువారం రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కొవిడ్‌ వైద్యసేవలకు అనుమతించిన ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ రోజురోజుకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతున్న వారిని ఆక్సిజన్‌వార్డు, మెడికల్‌ వార్డుల నుంచి ఖాళీ చేయించి కొవిడ్‌ కేర్‌ సెంటర్లు లేదా హోం ఐసోలేషన్‌లకు తరలించాలన్నారు. కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్నవారికి ఆయా పడకలను కేటాయించాలని సూచించారు. ప్రతీ ఆరు గంటలకు ఆక్సిజన్‌ నిల్వలు పర్యవేక్షించుకోవాలని, 24 గంటల కంటే తక్కువ సమయానికి మాత్రమే సరిపోయే ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నప్పుడు ప్రైవేట్‌ ఆసుపత్రుల వారు ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించిన రిక్వయిర్‌మెంట్‌ను జిల్లా కేంద్రంలోని కాల్‌ సెంటరులో నమోదు చేసుకోవాలన్నారు. ఆక్సిజన్‌ ఒడిశా, హరియాణా, విశాఖపట్నం నుంచి సరఫరా అవుతోందని, ప్రస్తుతం కర్నాటక నుంచి ఆక్సిజన్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని జేసీ వెల్లడించారు. కాగా, జేసీ లక్ష్మీశ, రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి, కొవిడ్‌ ప్రత్యేకాధికారి ఓ.ఆనంద్‌ ముందుగా రాజానగరం మండలం సంపత్‌నగరంలోని అమరావతి ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ ఏజెన్సీ పనితీరును, సరఫరా స్థితిగతులను పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రిని సందర్శించి ఆక్సిజన్‌ వినియోగం, నిల్వలపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఆక్సిజన్‌ మరింత పొదుపుగా వాడాలని, క్రిటికల్‌గా ఉన్నవారికి ఆక్సిజన్‌ వినియోగించి వారి ప్రాణాలు కాపాడాలని వైద్యాధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌ పి.ప్రియాంక, అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ కోమల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T05:24:55+05:30 IST