నేటి నుంచి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

ABN , First Publish Date - 2021-04-19T07:31:53+05:30 IST

కొవిడ్‌ ఉధృతి రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఆ మేరకు ప్రాణవాయువును సరఫరా చేసేందుకు రైల్వేశాఖ ముందుకు వచ్చింది...

నేటి నుంచి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

  • రైళ్ల ద్వారా ప్రాణ వాయువు సరఫరా
  • 2 స్టేషన్ల నుంచి ప్రయోగాత్మకంగా..
  • వ్యాగన్లపైకి ఆక్సిజన్‌ లారీలు
  • మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ అవసరాలకు
  • విశాఖ సహా 4 ప్రాంతాలకు కనెక్టివిటీ
  • గ్రీన్‌ చానల్‌ ద్వారా సిగ్నలింగ్‌.. 
  • ఎక్కడా ఆగకుండా వెళ్లనున్న రైళ్లు 
  • రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18: కొవిడ్‌ ఉధృతి రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఆ మేరకు ప్రాణవాయువును సరఫరా చేసేందుకు రైల్వేశాఖ ముందుకు వచ్చింది. సోమవారం నుంచి ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ముంబైకి సమీపంలోని కలంబోలి, బోయ్సర్‌ రైల్వే స్టేషన్ల నుంచి సోమవారం ఉదయం ఖాళీ ఆక్సిజన్‌ ట్యాంకర్లతో కూడిన రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు బయలుదేరుతాయి. ఇవి మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యత అధికంగా ఉండే విశాఖపట్నం, జంషేడ్‌పూర్‌, రౌకేలా, బోకరో ప్రాంతాల నుంచి ప్రాణవాయువును తీసుకువస్తాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పూర్తిగా ‘గ్రీన్‌చానల్‌’ మార్గంలో పయనిస్తాయి. అంటే.. ఈ రైళ్లు వస్తున్నప్పుడు ఆ పట్టాల మీదుగా వచ్చే షెడ్యూల్‌ రైళ్లను కూడా నిలిపివేస్తారు. ఆయా మార్గాల్లో ఉండే రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిల ఎత్తును దృష్టిలో పెట్టుకుని, 1.29 మీటర్ల ఎత్తుండే వ్యాగన్లపైన.. 3.32 మీటర్లలోపు ఎత్తు ఉన్న ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ట్రక్కులను తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు భారతీయ రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు ఈ సేవలను అందిస్తున్నారు.  


Updated Date - 2021-04-19T07:31:53+05:30 IST