వృద్ధి విచిత్రాలలో జీవన వాస్తవాలు

Jan 15 2022 @ 01:14AM

ప్రజలను సతమతం చేస్తున్న అసలు సమస్యలను పరిష్కరించడంపై పాలకులు శ్రద్ధ చూపడం లేదు. వారి దృష్టి అంతా ఎన్నికల పోరాటాల పైనే ఉంది. శంకుస్థాపనలు జోరుగా చేస్తున్నారు. వైద్య వసతులు లేని ఆస్పత్రులు, నిర్మాణం పూర్తికాని వంతెనలను ప్రారంభిస్తున్నారు. రోజు కొక నినాదాన్ని ప్రజల్లోకి వదులుతున్నారు. పరిస్థితులు అన్నీ వింతగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని గొప్పలు చెప్పుకోవడం మరీ వింతగా ఉంది.


ఉజ్వల తారగా ప్రకాశించగలదని ఆశిస్తే ఉల్కలా రాలిపోయింది! 2021–22 ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఆదాయానికి సంబంధించి ఈ నెల 7వ తేదీన ఎన్‌ఎస్‌ఓ (నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్) విడుదల చేసిన ‘మొదటి ముందస్తు అంచనాల’ (ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఎఫ్‌ఏఇ) నివేదిక గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా మణిపూర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆ అంచనాలకు విశేష ప్రచారం కల్పించారు. ఆ ప్రచార మహత్యం ఎంతో సేపు (రోజులు కూడా కాదు) నిలవలేదు. వాస్తవాలను కప్పిపుచ్చడం సాధ్యమా? సరే, అసలు విషయానికి వద్దాం. ఆ అంచనాలలో ఒక ముఖ్య అంకె 9.2 శాతం. ఏమిటీ గణాంకం? స్థిరమైన ధరల ప్రాతిపదికన 2021– 22లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పెరుగుదల 9.2 శాతంగా ఉండగలదని ఎన్‌ఎస్‌ఓ అంచనా వేసింది.


2020– 21లో జీడీపీ - 7.3 శాతం మేరకు సంకోచించిందన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుంటే 9.2 శాతం పెరుగుదల అసాధారణ వృద్ధి రేటులా కన్పించదూ? 2020–21లో ఆర్థికాభివృద్ధి క్షీణతను పూర్తిగా పూరించుకోవడంతో పాటు 2019–20 ఆర్థిక సంవత్సరంలో పెరుగుదలపై ఇంచుమించు 1.9 శాతం అధిక వృద్ధిని సాధించగలమని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మహోత్సాహంతో వెల్లడించారు. ‘అది సత్యమే అయిన ఆనందకరము’ అన్న కవి వాక్కు గుర్తు చేసుకుంటూ ప్రభుత్వ అంచనా నిజమయితే నేను చాలా సంతోషిస్తానని ముందుగానే చెబుతున్నాను (మరి ప్రపంచబ్యాంకు అంచనా 8.3 శాతంగా మాత్రమే ఉందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేయడం నా బాధ్యత).


ఎన్‌ఎస్‌ఓ అంచనాపై ప్రభుత్వం ఎందుకు అంతగా ఆనందపడిపోయిందో నాకు అర్థం కావడం లేదు. 2019–20లో స్థిరమైన ధరల ప్రాతిపదికన జీడీపీ రూ.1,45,69,268 కోట్లు. 2020–21లో మహమ్మారి కారణంగా జీడీపీ రూ.1,35,12,740 కోట్లకు తగ్గిపోయింది. 2019–20లోని జీడీపీ పరిమాణాన్ని అధిగమించినప్పుడు మాత్రమే 2020–21లో జీడీపీ నష్టాన్ని భర్తీ చేసుకోగలిగి, అంతకు ముందటి ఆర్థిక సంవత్సర స్థూలదేశీయోత్పత్తి స్థాయికి చేరగలుగుతాము. ఎన్‌ఎస్‌ఓ అంచనాల ప్రకారం ఆ పురోగతి 2021–22లోనే సాధ్యమవుతుంది. అయితే చాలా మంది ఆర్థికవేత్తలు ఆ అంచనాను సందేహిస్తున్నారు. కొవిడ్–19, దాని కొత్త వేరియంట్ మళ్ళీ విజృంభిస్తుండడంతో ఆ సంశయం మరింత తీవ్రమయింది. ఎన్‌ఎస్‌ఓ ముందస్తు అంచనాలను మరింత నిశితంగా పరిశీలిద్దాం. 2021–22లో జీడీపీ వృద్ధి, 2019–20 జీడీపీ కంటే రూ.1,84,267 కోట్ల మేరకు పెరుగుతుందనేది అంచనా.


వృద్ధిరేటు పెరుగుదల కేవలం 1.26 శాతం. నిజానికి ఇది చాలా స్వల్ప మొత్తం పెరుగుదల. ఇది చెప్పుకోదగిన పెరుగుదల ఎంత మాత్రం కాదు. ఆర్థిక వ్యవస్థ ఎక్కడైనా వక్రగతి పడితే ప్రతిపాదిత వృద్ధి తుడిచిపెట్టుకుపోతుంది. ఉదాహరణకు ప్రైవేట్ వినియోగం స్వల్పంగా తగ్గినా, ఎగుమతులకు ఆటంకాలు ఏర్పడినా, పెట్టుబడులు లక్ష్యం మేరకు రాకపోయినా ప్రతిపాదిత ‘అదనపు’ వృద్ధి అసాధ్యమైపోతుంది. 2021–22లో జీడీపీ, 2019–20 నాటి జీడీపీతో సమానంగా ఉంటే అదే చాలా గొప్ప పురోగతి అవుతుంది. ఇది వాస్తవిక అంచనా.


ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతే అగ్రగామి అని ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. అయితే నిజమేమిటి? మన జీడీపీ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో సంకోచించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆశాజనకంగా ఉంది. చైనా ఆర్థిక వ్యవస్థ గత రెండు ఆర్థిక సంవత్సరాలలో +2.3, +8.5 వృద్ధిరేట్లను నమోదు చేసింది. మన అధికార వర్గాలు ఈ వాస్తవాన్ని ఎలా విస్మరిస్తున్నాయి? సగటు భారతీయుడు 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21లో పేదరికంలోకి జారిపోయాడని, 2021–22లో సైతం పేదరికంలోనే కొనసాగుతాడని ఎన్‌ఎస్‌ఓ గణాంకాలు స్పష్టం చేశాయి. 2019–20లో కంటే ఆ తరువాత రెండు ఆర్థిక సంవత్సరాలలో అతడి వినియోగ వ్యయాలు తక్కువగా ఉన్నట్టు ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది.


వినియోగేతర సూచికలు కూడా కలవరం కలిగించేవిగానే ఉన్నాయి. ప్రభుత్వ వ్యయాలను గణనీయంగా పెంపొందించాలని ఆర్థికవేత్తలు ఎంతగా మొత్తుకున్నా 2020–21లో ‘ప్రభుత్వ అంతిమ మూలధన వ్యయం’ (జిఎఫ్ సిఇ) అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో కంటే కేవలం రూ.45,003 కోట్లు మాత్రమే అధికంగా ఉంది. అదేవిధంగా 2021– 22లో ఈ వ్యయం గత ఆర్థిక సంవత్సరంలో కంటే కేవలం రూ.1,20,562 కోట్లు మాత్రమే అధికంగా ఉంది. పెట్టుబడులు కుంటినడక నడుస్తున్నాయి. మహమ్మారితో కుదేలయిపోయిన దేశ ఆర్థికవ్యవస్థను పూర్తి స్థాయిలో శీఘ్రగతిన పునరుద్ధరించేందుకు దోహదం చేసే విధంగా పెట్టుబడుల పురోగతి లేదనేది ఒక కఠోర వాస్తవం. 


జీడీపీ పెరుగుదల గురించి పాలకులు ఘనంగా చెబుతున్నారు. అయితే ప్రజల పిచ్చాపాటీ దేని గురించి? జీడీపీ పెరుగుదల అంచనాల గురించా? కానే కాదు. వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల గురించే కాదూ? నిరుద్యోగం విషయం మరి చెప్పాలా? సిఎమ్‌ఐఇ అధ్యయనం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 8.51 శాతం కాగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 6.74 శాతం. వాస్తవ పరిస్థితులు మరింత విషమంగా ఉన్నాయి. చాలా మంది చేస్తున్న ‘ఉద్యోగాలు’ వారి నిరుద్యోగితను మరుగుపరిచేవి మాత్రమే. పప్పు ధాన్యాలు, పాలు మొదలైన నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలను కలవరపరుస్తున్నాయి పిల్లల చదువుల విషయమై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు అసంఖ్యాకంగా ఉన్నారు.


గ్రామీణ బాలలకు, నగరాలలో పేద కుటుంబాల పిల్లలకు గత రెండు సంవత్సరాలుగా పాఠ్యాంశాల బోధన సమకూరడం లేదు. ఇక అభద్రతా భావం అంతకంతకూ పెరిగిపోతోంది. విభిన్న మతాల జనాభా కలగలుపుగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు, మధ్య భారతంలోనూ పరిస్థితులు నిపురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎక్కడైనా సరే పరిస్థితి ఏ మాత్రం అదుపు తప్పినా సర్వత్రా శాంతిభద్రతలు భగ్నమయిపోయే ప్రమాదముంది. విద్వేష ప్రసంగాలు పెరిగిపోతున్నాయి. సామాజిక మాధ్యమాలు దుర్వినియోగమవుతున్నాయి. మహిళలు, బాలలకు వ్యతిరేకంగా నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. కొవిడ్, కొత్త వేరియంట్లపై ఆందోళన గురించి మరి ప్రత్యేకంగా ప్రస్తావించాలా? 


ప్రజలను సతమతం చేస్తున్న అసలు సమస్యలను పరిష్కరించడంపై పాలకులు శ్రద్ధ చూపడం లేదు. వారి దృష్టి అంతా ఎన్నికల పోరాటాలపైనే ఉంది. శంకుస్థాపనలు జోరుగా చేస్తున్నారు. వైద్యవసతులు లేని ఆస్పత్రులు, నిర్మాణం పూర్తికాని వంతెనలను ప్రారంభిస్తున్నారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ‘80 శాతం’ మంది ‘20 శాతం’ మందితో పోరాడనున్నారని ప్రకటిస్తున్నారు. రోజుకొక నినాదాన్ని ప్రజల్లోకి వదులుతున్నారు. పరిస్థితులు అన్నీ వింతగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ అని గొప్పలు చెప్పుకోవడం మరీ వింతగా ఉంది.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.