అభివృద్ధిరహిత సంక్షేమం!

Published: Sat, 19 Mar 2022 00:54:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అభివృద్ధిరహిత సంక్షేమం!

ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు పేదల కష్టాలను తగ్గిస్తున్నప్పటికీ అవి ఎటువంటి ‘అభివృద్ధి’ని తీసుకురావడం లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక ఓటర్లు ‘అభివృద్ధి’ని ఆకాంక్షించినప్పటికీ యథాపూర్వస్థితికే ఓటువేశారు. సంక్షేమవాదం ఉపయోగకరమైనదే అయినా అది యథార్థ, కలకాలం నిలిచే అభివృద్ధికి ప్రత్యామ్నాయం కాదు. అసలైన అభివృద్ధి అనేది మౌలిక సంస్కరణలు, కనిష్ఠ ప్రభుత్వ నియంత్రణ, గరిష్ఠ పోటీ, నిజమైన సమాఖ్య విధానంతో మాత్రమే సుసాధ్యమవుతుంది.


‘కరోనా వైరస్ ముప్పు నెదుర్కొనేందుకు భారత్ సర్వసన్నధంగా ఉంది’- ఇవి, 2020 మార్చి 2న నాటి ఆరోగ్యశాఖ మంత్రి హర్ష్‌వర్ధన్ పార్లమెంటుకు చెప్పిన మాటలు. ఆయన ఇంకా ఇలా చెప్పారు: ‘ప్రజలు ఆందోళనపడవలసిన అవసరముందని, భయంతో రేయింబవళ్లు తప్పనిసరిగా మాస్క్ ధరించవలసి వుందని నేను భావించడం లేదు. మాస్క్ ధరించాలా లేదా అన్నది వారిష్టం’. మంత్రి మహాశయుని నుంచి స్ఫూర్తి పొందిన ఒక డాక్టర్ నితిన్ ఇలా ట్వీట్ చేశాడు: ‘ఒక ఫిజీషియన్‌గా మీ మాటలు విశ్వసిస్తున్నాను. మీ పాలనా దక్షతలోనూ, నేను శిక్షణ పొందిన వైద్య వ్యవస్థలోనూ నాకు పరిపూర్ణ నమ్మకం ఉంది. మనం కలిసికట్టుగా కరోనా మహమ్మారిని జయించగలం’ 2020 మార్చి 24 రాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. 2021 జూలై 7న, కొవిడ్ రెండో విజృంభణ ఉధృతమవుతున్న దశలో, మంత్రిమండలికి రాజీనామా చేయమని డాక్టర్ హర్ష్‌వర్ధన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు! 


2022 ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ , భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నివేదికలను చదివినప్పుడు నాకు డాక్టర్ వర్ధన్, డాక్టర్ నితిన్ మాటలు జ్ఞాపకమొచ్చాయి. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది కదా. కనుక తన నివేదికలో తనను తాను ప్రశంసించుకోవడం, అభినందించుకోవడం అర్థం చేసుకోదగిన విషయాలే. దేశ ద్రవ్య వ్యవహారాల నియంత్రణ కర్త అయిన ఆర్బీఐ, దేశ ఆర్థిక వ్యవస్ధ నిర్వహణ తీరుతెన్నుల గురించి నిశితంగా, నిష్పక్షపాతంగా మాట్లాడగలదని ఎవరైనా ఆశిస్తారు.. అయితే రెండు నివేదికలు చదివిన తరువాత రెండిటిలోనూ సమాచారం ఒకే విధంగా ఉన్నదనే భావనన కలిగింది. అసలు ఆ రెండు నివేదికలను ఒకే వ్యక్తి రాయలేదు కదా అనే ఆశ్చర్యం నన్ను ముంచెత్తివేసింది!


దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ నివేదిక చాలా నిరుత్సాహకరంగా ప్రారంభమయింది: ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా సమస్యలతో సతమతమవుతూ ఉంది ఒమైక్రాన్ బెడద ఇంకా కొనసాగుతూనే ఉంది... ద్రవ్యోల్బణం పెరిగిపోవడం పట్ల కేంద్ర బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. అభివృద్ధి చెందిన, ఆవిర్భవిస్తున్న మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలు తమ ద్రవ్య విధానాన్ని మార్చుకుంటున్నాయి’. ఈ నివేదిక ముగింపు కూడా అంతే విచారగ్రస్తంగా ఉంది: ‘అన్ని ఆర్థిక వ్యవస్థలనూ ద్రవ్యోల్బణం పీడిస్తోంది. సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా ఉంది. మదుపుదారులు ఉత్సాహంగా లేరు. ఫలితంగా పెట్టుబడుల ప్రవాహం మందగించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ శీఘ్రగతిన కోలుకునేందుకు ఇవేవీ దోహదం చేసేవి కావు’. ఆరంభంలోనూ, ముగింపులోనూ ఆర్బీఐ నివేదిక ప్రభుత్వ నివేదికకు భిన్నంగా లేదు. ‘అంతర్జాతీయ వ్యవహారాలలో ఇటీవలి పరిణామాలు ఆర్థికాభివృద్ధి వ్యవహారాలలో అనిశ్చితిని నెలకొల్పాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణంపై నిశ్చిత దృక్పథానికి ఆస్కారం లేకుండా చేశాయి’. 


కొత్త ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ నిరాటంకంగా పురోగమించాలని కోరుకుంటున్నాను. అయితే కొన్ని వాస్తవాలపై మనం దృష్టి పెట్టవలసి ఉంది. అవి: (1) 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఆర్థిక వ్యవస్థ స్థూల దేశియోత్పత్తి వృద్ధిరేటు పెరుగుదల సగటున 1.5 శాతం మేరకు తగ్గిపోగలదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. అమెరికా వృద్ధిరేటు 2 శాతం, చైనా వృద్ధి రేటు 3.2 శాతం మేరకు తగ్గిపోయే అవకాశముంది. మరి భారత్ వృద్ధి రేటు కేవలం 0.5 శాతం మాత్రమే తగ్గిపోగలదనే విషయాన్ని విశ్వసించడం ఎలా? 9 శాతం వృద్ధిరేటుతో మన ఆర్థిక వ్యవస్థ పురోగమించడం సాధ్యమవుతుందా? (2) పలు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలోనూ, ఆవిర్భవిస్తున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలోనూ ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. బంగారం, ఆహారం, సరుకుల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 


ఫిబ్రవరిలో టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 13.1 శాతం కాగా వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 6.1 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 5.9 శాతానికి, తయారీ రంగ ద్రవ్యోల్బణం 9.8 శాతానికి, ఇంధన ద్రవ్యోల్బణం 8.7 శాతానికి పెరిగింది. (3) మదుపుదారులను నిరుత్సాహం ఆవహించింది. స్టాక్ మార్కెట్ల పరిస్థితి సజావుగా లేదు. బ్యాంకు వడ్డీరేట్లు ఇప్పటికే పెరిగాయి. ఇంకా పెంచనున్నట్టు కేంద్ర బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. (4) ఉద్యోగితా రంగంలో ముఖ్యంగా మన దేశంలో కార్మిక భాగస్వామ్య రేటు పడిపోయింది. ఉద్యోగాలలో ఉన్న కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. (5) వ్యయాల విషయానికి వస్తే మూలధన వ్యయాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. అయితే ప్రభుత్వ మూలధన వ్యయాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. మార్కెట్ నుంచి రుణాలు తీసుకోవడం ద్వారా మూలధన వ్యయాలకు నిధులు సమకూరుస్తున్నారు.


కచ్చితంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి శుభస్కరంగా లేదు. భవిష్యత్తు ఆశావహంగా కనిపించడం లేదు. నిపుణ నిర్వహణతో మాత్రమే ఆర్థిక వ్యవస్థను సమస్యల నుంచి గట్టెక్కించడం సాధ్యమవుతుంది. హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ చాల వరకు మధ్యతరగతి, సంపన్న వర్గాల ఆర్థిక స్థితిగతులను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పేదలు సతమతమవుతున్నారు. 


కొత్త ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం ఘనంగా వెల్లడిస్తున్న గణాంకాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. నిరుపేదలు, అవిద్యావంతులు, అనిపుణ కార్మికులకు అవసరమైన ఉద్యోగాల సృష్టి జరగడమే లేదు. వ్యవసాయ రంగంలోనూ, సేవల రంగంలోనూ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలలో కొత్త ఉద్యోగాల సృష్టిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో కూడిన శ్రద్ధ చూపడం లేదు. ఈ పరిస్థితులలో వారు సంక్షేమవాదంతో సంతృప్తి చెందుతున్నారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు పేదల కష్టాలను తగ్గిస్తున్నప్పటికీ అవి ఎటువంటి ‘అభివృద్ధి’ని తీసుకురావడం లేదు. ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక ఓటర్లు ‘అభివృద్ధి’ని ఆకాంక్షించినప్పటికీ యథా పూర్వస్థితికే ఓటువేశారు.


సంక్షేమవాదం ఉపయోగకరమైనదే అయినా అది యథార్థ, కలకాలం నిలిచే అభివృద్ధికి ప్రత్యామ్నాయం కాదు. అసలైన అభివృద్ధి అనేది మౌలిక సంస్కరణలు, కనిష్ఠ ప్రభుత్వ నియంత్రణ, గరిష్ఠ పోటీ, భయాలు, బెదిరింపులకు తావులేని వాతావరణం, వైవిధ్యాల పట్ల సహన భావం, నిజమైన సమాఖ్య విధానంతో మాత్రమే సుసాధ్యమవుతుంది. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగగా నాలుగు రాష్ట్రాలు మార్పుకు కాకుండా యథాపూర్వస్థితికే ఓటువేశారు. వారు నిజంగా శాశ్వత, సుస్థిర అభివృద్ధికి వ్యతిరేకంగా ఓటు వేశారా అన్నది కాలమే చెప్పుతుంది.

అభివృద్ధిరహిత సంక్షేమం!

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.