Gujarat riots: అహ్మద్ పటేల్‌పై ఆరోపణలు... చిదంబరం ఆగ్రహం...

ABN , First Publish Date - 2022-07-17T18:51:18+05:30 IST

కాంగ్రెస్ (Congress) దివంగత నేత అహ్మద్ పటేల్‌

Gujarat riots: అహ్మద్ పటేల్‌పై ఆరోపణలు... చిదంబరం ఆగ్రహం...

న్యూఢిల్లీ : కాంగ్రెస్ (Congress) దివంగత నేత అహ్మద్ పటేల్‌ (Ahmed Patel)పై గుజరాత్ పోలీసులు చేసిన ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం (P Chidambaram) తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ రాజకీయ కక్షసాధింపు చర్యలేనని ఆరోపించారు. పటేల్ 2020 నవంబరులో కోవిడ్-19 సోకడంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 


గుజరాత్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను ఇటీవల అరెస్టు చేసింది. ఆమె బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆమెకు బెయిలు మంజూరు చేయవద్దని అహ్మదాబాద్‌లోని ఓ కోర్టులో సిట్ శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. 2002లో గోద్రాలో ఓ రైలు దహనం సంఘటన తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర జరిగిందని, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు తీస్తా సెతల్వాద్, మరికొందరు ఈ కుట్రలో భాగస్వాములయ్యారని తెలిపింది. ఆమె అహ్మద్ పటేల్ నుంచి ఆర్థిక సాయం కూడా పొందారని తెలిపింది. ఆమె విడుదలైతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. 


ఈ నేపథ్యంలో పి చిదంబరం ఇచ్చిన ట్వీట్‌లో, అహ్మద్ పటేల్ కుట్రకు పాల్పడ్డారని ఆయన మరణించిన 20 నెలల తర్వాత ఆరోపణలు చేయడం ఓ రాజకీయ ప్రత్యర్థిపై కక్ష సాధించడంలో భాగమేనని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు పటేల్ పని చేశారని ఆరోపించడం నీచం,  ప్రతీకారం తీర్చుకోవడమేనన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రత్యేకంగా ఆదేశాలు పొందిన బృందంలా కనిపిస్తోందన్నారు. 


ఇదిలావుండగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. అహ్మద్ పటేల్‌ను ఉపయోగించుకుని గుజరాత్ కీర్తి, ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు ఆమె ప్రయత్నించారని ఆరోపించింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రకు సోనియా గాంధీ చోదక శక్తి అని పేర్కొంది. 


Updated Date - 2022-07-17T18:51:18+05:30 IST