అపరిశుభ్రత.. అనారోగ్యాలు

ABN , First Publish Date - 2022-08-08T05:54:45+05:30 IST

అపరిశుభ్రత.. అంటువ్యాధులు.. ఇదీ జిల్లాలోని పల్లె నుంచి పట్టణం వరకు నెలకొన్న పరిస్థితి. పారిశుధ్యం పూర్తిగా క్షీణించింది. ఇందుకు వర్షాలు కూడా తోడయ్యాయి.

అపరిశుభ్రత.. అనారోగ్యాలు
కర్లపాలెం: ఎం.వి.రాజుపాలెం హైస్కూల్‌కు వెళ్ళే రోడ్డుపై నిలిచిన మురుగు

పారిశుధ్యంపై పాలకుల నిర్లక్ష్యం

వర్షాలతో అడుగంటిన పారిశుధ్యం

దోమల ఉత్పత్తి కేంద్రాలుగా డ్రెయిన్లు

విస్తరిస్తున్న దోమలు.. వ్యాపిస్తున్న వ్యాధులు 

జ్వరాలు ప్రబలుతున్నా పట్టించుకోని అధికారులు

   

వీధుల్లో చెత్తాచెదారాలు.. డ్రెయిన్లలో మురుగు..  పగలు రాత్రి తేడా లేకుండా ముసురుకుంటున్న దోమలు.. అపరిశుభ్ర వాతావరణం.. అడుగంటిన పారిశుధ్యం.. జ్వరాలతో మంచంపట్టిన ప్రజలు.. ఇదీ జిల్లాలోని పట్టణాల నుంచి పల్లెల వరకు ఉన్న పరిస్థితి. గత కొన్ని రోజులుగా విడవకుండా కురుస్తున్న వర్షాలతో పారిశుధ్యం మరింత అధ్వానంగా మారింది. పట్టణాల్లో పారిశుధ్యంపై మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండగా.. పల్లెల్లో నిధుల లేమితో పాలకులు పట్టించుకోవడంలేదు. దోమలు ఇబ్బడిమబ్బడిగా పెరిగిపోయి రాత్రుళ్లే కాదు పగలు కూడా ప్రజలపై దాడి చేస్తున్నాయి. అపరిశుభ్రత.. దుర్వాసన.. దోమలతో ప్రజలు వ్యాధులు అల్లాడిపోతున్నారు. వర్షాకాలం ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులు కాని, పాలకులుకాని పట్టించుకోకపోవడం వల్లే ప్రజలకు ఈ దురవస్త అని పలువురు అభిప్రాయపడుతున్నారు. దోమల నివారణకు చేపట్టాల్సిన కనీస చర్యలపై కూడా అధికారుల్లో స్పందన లేకపోవడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 



  (ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌)

అపరిశుభ్రత.. అంటువ్యాధులు.. ఇదీ జిల్లాలోని పల్లె నుంచి పట్టణం వరకు నెలకొన్న పరిస్థితి. పారిశుధ్యం పూర్తిగా క్షీణించింది. ఇందుకు వర్షాలు కూడా తోడయ్యాయి. దీంతో ప్రధాన వీధుల నుంచి శివారు ప్రాంతాల వరకు అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అపరిశుభ్రత తాండవిస్తోంది. పట్టణాలతో పాటు పల్లెల్లోనూ పారిశుధ్యం పూర్తిగా అడుగంటి దోమలు ప్రబలి ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారు. పాలకులు, అధికారులు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారనే విమర్శలున్నాయి. కాల్వల పూడికతీత నిర్వహణ, నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా మారింది. ఓ మోస్తరు వర్షాలకే డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తూ పరిసర ప్రాంతాలు ముంచెత్తుతున్నాయి. ఈ మురుగు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఆ ప్రాంతాలు మురికికూపాలుగా మారి.. అవి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. గ్రామాల్లో చెత్త సేకరణ, రవాణా సక్రమంగా లేకపోవడంతో పారిశుధ్యం అధ్వానంగా మారింది. గ్రామాల్లోని మురుగు కాల్వలపై పంచాయతీ అధికారులు దృష్టిసారించిన దాఖలాలులేవు. కొన్ని గ్రామాల్లో చెత్తా చెదారం ఎత్తి ఊరిబయట పోయడంతో విపరీతమైన దుర్వాసన రావటంతోపాటు దోమలు వృద్ధి చెందుతున్నాయి. పంచాయతీల్లో పారిశుధ్యం, దోమల నివారణకు ప్రత్యేక నిధులు కేటాయింపు జరగలేదు. దీంతో ప్రత్యేకంగా ఆయా పనులు చేయలేకపోతున్నారు. ఇక పంచాయతీల్లో పారిశుధ్యానికి ప్రత్యేకంగా సిబ్బంది లేరు. కొన్ని చోట్ల సిబ్బంది ఉన్నా వారు కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు కూలీలతో కాలువల్లో పూడిక తీయిస్తున్నారు. 


మలేరియా విభాగం.. మమ

గుంటూరు నగరంలో టైఫాయిడ్‌, మలేరియా, విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. నగరంలోని అనేక పల్లపు ప్రాంతాల్లో డ్రెయిన్లు, కల్వర్టులలో వర్షపు నీరు నిల్వ ఉండి దోమల ఆవాస కేంద్రాలుగా మారాయి. ఫలితంగా ప్రజలు మంచం పడుతున్నారు. గుంటూరు అర్బన్‌ మలేరియా వ్యవస్థ నిద్రావస్థలో ఉంది. జీఎంసీకి చెందిన మలేరియా సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దోమల నియంత్రణకు బైటెక్స్‌, ఎబేట్‌, మలాథియాన్‌ వంటి ద్రావణాలు కలిపి ఫాగింగ్‌ చేయాల్సి ఉండగా నగరంలో ఆ జాడలే లేవు. తాడేపల్లి మండల పరిధిలోని కొలనుకొండ, గుండిమెడ గ్రామాల్లో ఒక్కో డెంగీ కేసులు నమోదయ్యాయి. అస్తవ్యస్త పారిశుధ్యం, దోమల నియంత్రణపై అధికారులు నిర్లక్ష్యం కారణంగా గతంలో డెంగీ కేసులు నమోదయ్యాయి. మంగళగిరి కార్పొరేషన్‌గా అవతరించినా ఒక్క  శానిటరీ ఇన్‌స్పెక్టరు కూడా లేరు. 


పారిశుధ్యం.. రికార్డుల్లోనే.. 

పిడుగురాళ్ల పరిధిలోని కోనంకి గ్రామంలో పంచాయతీ నిధుల్లో ఎక్కువ శాతం పారిశుధ్యానికే ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపుతున్నా క్షేత్రస్థాయిలో చూస్తే అక్కడంత పని జరగలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మాచవరం మండలం మోర్జంపాడు, పిల్లుట్ల, పిన్నెల్లి, దాచేపల్లి తదితర గ్రామాల్లో కూడా  పారిశుఽధ్యానికి నిధుల వ్యయం రికార్డులకే పరిమితమయ్యాయన్న ఆరోపణలున్నాయి. గురజాల మండలంలోనూ దైదా, తేలుకుట్లలోని జంట గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. దోమలు బెడద వెంటాడుతుందని గ్రామస్తులు వాపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఈ కారణంగానే విషజ్వరంతో గత నెలలో ఈశ్వరమ్మ అనే మహిళ డెంగీతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. పెదకూరపాడు మండలంలోని పొడపాడు అంగన్‌ వాడీ పాఠశాల చుట్టూ వర్షం, మురుగు నీరు నిలిచి దోమలకు నిలయాలుగా మారాయి. పెదకూరపాడు ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ హాల్‌ వద్ద మురుగు నీరు సక్రమంగా ముందుకు పోయే పరిస్థితి కన్పించటం లేదు.  


పనులు చేయాలన్నా.. పైసలు లేవు

వర్షాకాలంలో పారిశుధ్యం అడుగంటి అంటువ్యాధులతో పల్లెలు మంచం పడుతున్నాయి. దోమలు, చెత్తాచెదారాలు, మురుగు కారణంగానే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఆయా పనులు చేసి ప్రజలను రోగాల బారి నుంచి తప్పించాలన్నా పంచాయతీల్లో నిధులు లేవు. పారిశుధ్య నిర్వాహణకు ఆరు నెలల నుంచి నిధులు రాలేదు. పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్‌ కూడా చల్లే పరిస్థితి కూడా లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాల్లో పడీపడకముందే రాష్ట్ర ప్రభుత్వం జమ చేసుకుంది. దీంతో సర్పంచ్‌లు చేసేదేమీ లేక నోళ్లువెళ్లబెడుతున్నారు. దోమలు ఉదృతంగా పెరుగుతున్న ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతున్నారు. దోమల నివారణకు వినియోగించే మలాథియాన్‌, బైటెక్స్‌, ఎబేట్‌ వంటి మందులను పంచాయతీలు ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు.  



పట్టించుకునేవారే లేరు..

బాపట్ల నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో మురుగు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయడమే మానేశారు. బ్లీచింగ్‌ బదులు సమావేశాలు జరిగేటప్పుడు రోడ్ల పక్కనే సున్నం చల్లి సరిపెట్టుకుంటున్నారు. వేమూరు నియోజకవర్గంలోని పారిశుధ్యం అడుగంటడంతో ప్రజలు వైరల్‌ ఫీవర్‌లతో పాటు టైఫాయిడ్‌, మలేరియా, జ్వరాలతో అల్లాడుతున్నారు. భట్టిప్రోలు మండలంలో డెంగీ జ్వరాలు ప్రభలినట్లు సమాచారం. రేపల్లె నియోజకవర్గ పరిధిలోని 85 పంచాయతీల్లోని కొన్ని గ్రామాల్లో సైడ్‌ డ్రెయిన్ల నిర్మాణం జరిగినా మురుగు పారుదల జరగడంలేదు. 


వర్షాకాలంలో చేయాల్సిన పనులు

మున్సిపాలిటీలు, పంచాయతీలు వర్షాకాలం ముందుస్తుగా అనేక చర్యలు తీసుకోవాలి. పారిశుధ్యం, వరద నీటి పారుదలపై ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలి. అయితే అటు అధికారులు కాని, ఇటు పాలకవర్గాలుకాని ఈ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. ఈ కారణంగా ప్రజలు విషజ్వరాలు, ఇతర అంటువ్యాధులతో అల్లాడిపోతున్నారు. 

- దోమల నివారణకు ఫాగింగ్‌ యంత్రాల ద్వారా పొగ కొట్టాలి. 

- వర్షాకాలం వస్తుందనగానే ఫాగింగ్‌ యంత్రాలకు మరమ్మతులు చేసి సిద్ధం చేసుకోవాలి. 

- వీధుల్లో, డ్రెయిన్లలో చెత్తాచెదారాలను ఎప్పటికప్పుడు తొలగించాలి.

- చెత్త, మురుగు నిల్వ ఉండే ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చల్లాలి.

- మురుగునీటి కాల్వలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో బైటెక్స్‌, ఎబేట్‌, మలాఽథియాన్‌ ద్రావణాలు చల్లాలి. తద్వారా దోమలను అడ్డుకోవచ్చు.

- నీరు నిల్వఉన్న ప్రదేశాల్లో గంబూషియా చేపలను వదిలాలి. 

- మురుగు కాల్వల్లో తరచూ ఆయిల్‌ బాల్స్‌ వదలాలి. మడ్డి ఆయిల్‌ చల్లుతూ ఉండాలి.

- డ్రెయిన్లలో పూడికలు తొలగించి మురుగునీటి పారుదల వ్యవస్థను తీర్చిదిద్దాలి.

 

 

Updated Date - 2022-08-08T05:54:45+05:30 IST