పచ్చదనం పరిచేలా...

ABN , First Publish Date - 2022-07-04T05:08:53+05:30 IST

పచ్చదనం పరిచేలా...

పచ్చదనం పరిచేలా...
ఎలుకుర్తి హవేలి నర్సరీలో మొక్కలు

హరిత హారానికి సర్వం సిద్ధం...

జిల్లాలో 41.03 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం...

323 నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలు 

మొక్కల సంరక్షణకు కొత్తగా హరిత నిధి ఏర్పాటు...

వర్షాలు పడగానే మొక్కలు నాటేందుకు సన్నాహాలు...


వరంగల్‌ సిటీ, జూలై 3: జిల్లా పచ్చబడేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 8వ విడత హరిత హారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది 13 మండలాలతోపాటు జిల్లాలో విస్తరించిన  గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపాలిటీ, నర్సంపేట, వర్ధన్నపేట మునిసిపాలిటీల్లో 41 లక్షల 3 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఇందుకు కావాల్సిన మొక్కలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీశాఖ ఆధ్వర్యంలో 323 నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. 


పచ్చదనం ఉట్టిపడేలా...

హరితహారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గుర్తించిన స్థలాల్లో మొక్కలు నాటేందుకు శాఖల వారీగా మొక్కల కేటాయింపులు చేశారు. వర్షాలు పడగానే పూర్తిస్థాయిలో మొక్కలు నాటేందుకు రెడీ అయ్యారు. రహదారుల వెంబడి, ఖాళీ స్థలాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలను నాటేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 


సంరక్షణకు హరిత నిధి ఏర్పాటు...

నాటిన మొక్కల సంరక్షణకు హరిత నిధిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ ప్రతీ ఒక్కరిని భాగస్వాయం చేయనున్నారు. గ్రామ స్థాయిలో సర్పంచి నుంచి ఎంపీ వరకు, ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగి నుంచి కలెక్టర్‌ వరకు ప్రతీ ఒక్కరి వేతనం నుంచి హరిత నిధికి నిధులను సమకూర్చనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్‌ల వేతనాల నుంచి రూ. 6వేల చొప్పున సేకరించనున్నారు. అఖిల భారత సర్వీసు అధికారుల నుంచి రూ.1200, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థల ఉద్యోగుల నుంచి రూ. 300, కార్పొరేషన్‌ చైర్మన్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్ల నుంచి రూ. 1200, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్మన్‌ల నుంచి రూ.600 వసూలు చేసి హరిత నిధిలో జమచేస్తారు. ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, సర్పంచులు రూ. 120తో పాటు రిజిస్ట్రేషన్‌ చేసే ప్రతీ డాక్యుమెంట్‌కు రూ. 50, వ్యాపార లైసెన్సులు రెన్యువల్‌ చేసే సమయంలో రూ. 1000 హరిత నిధి కోసం సేకరించనున్నారు. 


మొక్కలు సిద్ధం...: మట్టపల్లి సంపత్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

హరిత హారం 8వ విడతలో జిల్లాలో 41.03 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నాం. శాఖల వారీగా టార్గెట్‌ను నిర్ణయించుకున్నాం. హరితహారానికి అవసరమైన మొక్కలను 323 నర్సరీల్లో సిద్ధంగా ఉన్నా యి. వర్షాలు కురవగానే నిర్ధేశిత ప్రాంతాల్లో గుంతలు తీయించి మొక్కలు నాటిస్తాం. 



Updated Date - 2022-07-04T05:08:53+05:30 IST