కళ తప్పిన పీఏసీఎస్‌లు

ABN , First Publish Date - 2020-08-08T09:59:20+05:30 IST

రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)రాకతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) మనుగడ ప్రశ్నార్థకంగా ..

కళ తప్పిన పీఏసీఎస్‌లు

 ఆర్‌బీకేల రాకతో వెలవెల

వీటి ద్వారానే విత్తనాలు, ఎరువుల విక్రయం

పంట దిగుబడులు సేకరణ కూడా..

పంట రుణాలకే సొసైటీలు పరిమితం


సంగం, ఆగస్టు 7 : రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)రాకతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో ఏళ్లుగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతోపాటు ఉత్పత్తులను మార్కెటింగ్‌ సేవలను డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారా సొసైటీలు నిర్వహిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సొసైటీలు సంక్షోభంలో పడ్డాయి.


ఆర్‌బీకేల ద్వారా ఎరువులు, విత్తనాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపోమాపో పంట దిగుబడుల సేకరణ కూడా వాటి ద్వారానే చేపట్టానున్నారని సమాచారం. గతంలో సొసైటీల ద్వారా  ఎరువులు, విత్తనాల పంపిణీ జరిగేది. దీనికి సొసైటీలకు నామమాత్రం కమీషన్‌ అందేది. ఇది సొసైటీల్లో పని చేసే తాత్కాలిక సిబ్బంది జీతభత్యాలకు  సరిపోయేది. కానీ ఇప్పుడు ఆ పనంతా ఆర్‌బీకేలకు అప్పగించడంతో సొసైటీల ఆర్థిక వనరులకు గండి పడింది.


జిల్లాలో 99 పీఏసీఎస్‌లు

జిల్లాలోని 47 మండలాల్లో 99 పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఇటీవల వరకు ఈ సంఘాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులను ఎమ్మార్పీకే అందించేవారు. మద్దతు ధరకు రైతుల నుంచి పంట దిగుబడులు సేకరించే కార్యక్రమాన్ని   కూడా చేపట్టేవి.  ఆర్‌బీకేల ఏర్పాటుతో సొసైటీల కార్యకలాపాలు స్తంభించాయి. కేవలం క్రాప్‌ రుణాలకే పరిమితమయ్యాయి.


తాత్కాలిక ఉద్యోగుల్లో గుబులు

ప్రతి సొసైటీలో ఇద్దరు లేక ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు.  ఇకపై కమీషన్‌ రూపేణా సొసైటీలకు ప్రభుత్వం నుంచి నిధులు అందే అవకాశం లేనందున ఇబ్బందులు తప్పవని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక పంట దిగుబడుల కూడా ఆర్‌బీకేల ద్వారానే జరిగితే  మా పరస్థితి  ఏమిటని వారు ఆందోళనకు గురవుతున్నారు.


ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి..బాలకృష్ణ, తాత్కాలిక ఉద్యోగి, సంగం

ఆర్‌బీకేల ఏర్పాటు వల్ల సొసైటీల్లో అమ్మకాలు లేవు. రైతులకు విత్తనాలు, ఎరువులను అమ్మడం వల్ల వచ్చే కమీషన్‌తో మాకు జీతాలు చెల్లిస్తున్నారు. ఈ వ్యాపారం లేకపోతే మాకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం మా గురించి ఆలోచించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. 

Updated Date - 2020-08-08T09:59:20+05:30 IST