సహకార సంఘాలు.. సరికొత్త బాటలో

ABN , First Publish Date - 2021-02-23T05:20:52+05:30 IST

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌) అంటే సభ్యులకు రుణాలివ్వడం, వాటిని రాబట్టడం, కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం వరకే ప్రాధాన్యం ఉండేది. తద్వారా అనేక సంఘాలు ఆర్థికంగా నష్టాలను, కష్టాలను చవిచూశాయి. కానీ ఇదంతా ఇక గతం.. ప్రస్తుతం పీఏసీఎ్‌సలు సరికొత్త బాటలో పయనించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా కల్పిస్తోంది. ఇతర వ్యాపారాలను చేసేందుకు నాబార్డు సహాయంతో రుణాలను సమకూర్చి సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తోంది. నాబార్డు నేరుగా నిధులివ్వకుండా బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తోంది. వ్యవసాయ, రైతు శిక్షణ కేంద్రాల ఏర్పాటు, విత్తనశుద్ధి కర్మాగారాలు, వ్యవసాయాధారిత గోదాంలకు 3 శాతం వడ్డీ, మిగతా వ్యాపారాలకు 4 శాతం వడ్డీ చొప్పున రుణాన్ని అందజేయనుంది. ఇలా 15 రకాల వ్యాపారాలకు నాబార్డు నిధులను సమకూర్చనుంది.

సహకార సంఘాలు.. సరికొత్త బాటలో

మల్టీ సర్వీస్‌ సెంటర్ల ఏర్పాటుకు పీఏసీఎ్‌సలకు అనుమతి 

‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారం

నాబార్డ్‌ ద్వారా నిధుల మంజూరు


మెదక్‌, ఫిబ్రవరి 22 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌) అంటే సభ్యులకు రుణాలివ్వడం, వాటిని రాబట్టడం, కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం వరకే  ప్రాధాన్యం ఉండేది. తద్వారా అనేక సంఘాలు ఆర్థికంగా నష్టాలను, కష్టాలను చవిచూశాయి. కానీ ఇదంతా ఇక గతం.. ప్రస్తుతం పీఏసీఎ్‌సలు సరికొత్త బాటలో పయనించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా కల్పిస్తోంది. ఇతర వ్యాపారాలను చేసేందుకు నాబార్డు సహాయంతో రుణాలను సమకూర్చి సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తోంది. నాబార్డు నేరుగా నిధులివ్వకుండా బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తోంది. వ్యవసాయ, రైతు శిక్షణ కేంద్రాల ఏర్పాటు, విత్తనశుద్ధి కర్మాగారాలు, వ్యవసాయాధారిత గోదాంలకు 3 శాతం వడ్డీ, మిగతా వ్యాపారాలకు 4 శాతం వడ్డీ చొప్పున రుణాన్ని అందజేయనుంది. ఇలా 15 రకాల వ్యాపారాలకు నాబార్డు నిధులను సమకూర్చనుంది.

మెదక్‌ జిల్లాలో 37 పీఏసీఎ్‌సలు ఉన్నాయి. ఈ సంఘాల ఆధ్వర్యంలో 15 రకాల వ్యాపార సేవా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా రుణాన్ని మంజూరు చేస్తోంది. అయుతే పీఏసీఎ్‌సలు బహుళార్థసేవా కేంద్రాలు(మల్టీసర్వీస్‌ సెంటర్లు) ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా సొంత భవనం, సొంత స్థలం ఉండి తీరాలి. ఇక సంఘాలు లాభాల బాటలోనే కొనసాగాలన్న నియమాన్ని విధించింది. ఇక వరుసగా మూడేళ్లపాటు సంఘం అప్పుల్లో కూరుకుపోకుండా ఉండాలి. నాబార్డ్‌ బ్యాంకుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా సంఘం పనితీరును పరిశీలించి రుణాన్ని మంజూరు చేస్తున్నారు. 


జిల్లాలో పలు సంఘాలకు మంజూరు 

జిల్లాలోని సహకార సంఘాల బలోపేతానికి సహకారశాఖ, డీసీసీబీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్బర్‌ అభియాన్‌ కింద నాబార్డు ద్వారా నిధులు అందుతున్నాయి. వెల్దుర్తి ప్రాథమిక సహకార పరపతి సంఘానికి రూ.2 కోట్ల నాబార్డు నిధులు మంజూరయ్యాయి. దీంతో వెల్దుర్తి సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ పరికరాల విక్రయ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందు కోసం స్థలాన్ని కూడా సేకరించారు. 1500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం, 200 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన 2 గోదాంలు, వేయింగ్‌ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. నర్సాపూర్‌ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం, ఫార్మర్స్‌ అగ్రీ ఔట్‌లెట్స్‌ నిర్మాణానికి రూ.24 లక్షలు మంజూరయ్యాయి. టేక్మాల్‌లో 27 లక్షలతో ఫార్మర్స్‌ అగ్రీ ఔట్‌లెట్స్‌, రూ.77 లక్షలతో వేయింగ్‌బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు సమకూరాయి. పాపన్నపేట మండలం కొత్తపల్లి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో 2,500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం నిర్మాణానికి రూ.1.55 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నార్సింగి సొసైటీ ఆధ్వర్యంలో 500 మెట్రిక్‌ టన్నుల గోదాం నిర్మాణానికి రూ.40లక్షలు నాబార్డు ద్వారా మంజూరయ్యాయి. 90 శాతం బ్యాంకు రుణాన్ని సహకార సంఘానికి ఇస్తుండగా, మిగతా పదిశాతం నిధులను సంఘం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే గ్రామాల్లో పీఏసీఎ్‌సల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వాటిని క్రోడీకరించి నాబార్డు అనుమతికి పంపారు. 


సంఘాల స్వయం సమృద్ధికి కృషి 

పీఏసీఎస్‌లు పాతవిధానంతో పనిచేస్తే ఇంకా అప్పులోకి కూరుకుపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ద్వారా నిధులు సమకూరుస్తుండడంతో పీఏసీఎ్‌సలు వ్యాపార దృక్పథంతో ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించుకోవాలి. గ్యాస్‌ ఏజెన్సీ, పెట్రోల్‌బంక్‌లు, విత్తన విక్రయ కేంద్రాలు, వ్యవసాయాధారిత పరిశ్రమలు, గోదాంలు 15 రకాల వ్యాపార సేవా కేంద్రాల ఏర్పాటుకు నాబార్డు రుణాలు మంజూరు చేస్తోంది. ప్రతీ సంఘం బహుళార్థ సేవా కేంద్రంగా బలోపేతం కావాలనేదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం.

 - పద్మ, జిల్లా సహకారశాఖ అధికారిణి


Updated Date - 2021-02-23T05:20:52+05:30 IST