అలుపెరుగని యోధురాలు

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

గుంటూరు జనరల్‌ ఆసుపత్రి ముందు ఒక రోజు ఖాళీ మందుల సీసాలతో ఒక రోగి బండి దిగింది. పక్కనే ఉన్న ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీలోకి ప్రవేశించింది. ‘‘నాయనలారా! ఇది సుఖంగా చదువు కొనసాగించే సమయం కాదు. ఈ ఇంగ్లీషు చదువులు మాని,

అలుపెరుగని యోధురాలు

పాదర్తి సుందరమ్మ


గుంటూరు జనరల్‌ ఆసుపత్రి ముందు ఒక రోజు ఖాళీ మందుల సీసాలతో ఒక  రోగి బండి దిగింది. పక్కనే ఉన్న ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీలోకి ప్రవేశించింది. ‘‘నాయనలారా! ఇది సుఖంగా చదువు కొనసాగించే సమయం కాదు. ఈ ఇంగ్లీషు చదువులు మాని, బయటకు వచ్చేయండి. దేశ నాయకులందరూ చెరసాలల్లో మగ్గుతున్నారు. మీరంతా బయటకు వచ్చి, వాళ్ళ అడుగు జాడల్లో నడవండి’’ అని ప్రచారం సాగించింది. బిలబిలమంటూ విద్యార్థులు బయటకు వచ్చారు. మరో పది నిమిషాల్లో పోలీసు వ్యాన్‌ వచ్చింది. పోలీసులు ఆమెను వ్యాన్‌ ఎక్కించి, మంగళగిరి సమీపాన దించేశారు. ఆమె ఎటువైపు వెళ్ళడానికైనా టిక్కెట్లు అమ్మవద్దని రైల్వే స్టేషన్లో కట్టడి చేశారు. రోగి వేషంలో పోలీసుల కళ్ళు కప్పి, ప్రచారం సాగించడానికి వచ్చిన ఆమె... పాదర్తి సుందరమ్మ.


సుందరమ్మ 1902 డిసెంబరు 22న... గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులో జన్మించారు. ఆమె తల్లితండ్రులు మద్ది నరసింహం, అన్నపూర్ణ. వారితో పాటు ఆమె పినతండ్రులు, కుటుంబ సభ్యులు పేరెన్నికగన్న దేశాభిమానులు, గాంధీజీ శిష్యులు. 1920లో గాంధీజీని దర్శించి, ఆయన ఉపన్యాసాలు విని సుందరమ్మ ప్రభావితురాలయ్యారు. ఆనాటి నుంచి ఖాదీ ఉద్యమ ప్రచారం, విదేశీ వస్తు బహిష్కరణ జరిపేవారు. సుందరమ్మ భర్త వెంకట సుబ్బయ్య కూడా స్వాతంత్య్ర సమరంలో పాల్గొని, జైలుకు వెళ్ళారు. 1921 నాటికి సుందరమ్మ ఇద్దరు పసిపిల్లల తల్లి. వారిని పెద్దల సంరక్షణలో ఉంచి, పినతండ్రి వెంకటరంగయ్య, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వెంట చీరాల పరిసరాలలో ప్రచారానికి వెళ్ళేవారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ తదితర అగ్రశ్రేణి నాయకురాళ్ళతో కలిసి... మహిళల బహిరంగ సభల్లో ఉపన్యసించేవారు. వెలిదండ్ల హనుమంతరావు నాయకత్వాన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1930లో సుందరమ్మ బందరు సమీపంలోని సముద్రతీరంలో ఉప్పు తయారు చేశారు. విజయవాడలో అప్పటికే 144 సెక్షన్‌ అమలులో ఉంది. సుందరమ్మ ఒక్కరే జాతీయ జెండా భుజాన పెట్టుకొని, జాతీయ గీతాలు పాడుతూ వీధులన్నీ తిరిగారు. ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేసి, ఆరు నెలలు సాధారణ శిక్ష వేసి, రాయవేలూరు జైలుకు పంపించారు. విడుదలయ్యాక ఆమె విజయవాడ చేరుకున్నారు.


1931లో కరాచీ కాంగ్రె్‌సకు సుందరమ్మ కూడా వెళ్ళారు. తెల్లారేసరికి భగత్‌సింగ్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఉరి తీసినట్టు తెలిసింది. ఆ సాయంత్రం జరిగిన సభకు భగత్‌సింగ్‌ తండ్రి వచ్చి, గాంధీజీ పాదాలపై పడి శోకించారు. ఈ దృశ్యం సుందరమ్మతోపాటు అందరి హృదయాలనూ ద్రవింపజేసింది. 


దరిమిలా సుందరమ్మ అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీకి సభ్యురాలుగా, టౌన్‌ కాంగ్రెస్‌ కమిటీకి ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఇంతలో బొంబాయిలో ‘అఖిల భారత స్త్రీ సేవాదళ శిబిరం’ ఏర్పాటయింది. ఇతర మహిళా నేతలతో పాటు సుందరమ్మ కూడా బొంబాయి వెళ్ళి, వాలంటీర్‌ శిక్షణలో చేరారు. కర్రసాము, గస్తీ తిరగడం లాంటివి నెల రోజుల పాటు అభ్యసించారు. నాయకుల ప్రబోధాలు విన్నారు. సుందరమ్మ విజయవాడ చేరుకోగానే... పట్టణంలో 144 సెక్షన్‌ ఉందంటూ పోలీసులు ఆమెకు నోటీసు ఇచ్చారు. గాంధీజీ అరెస్ట్‌ కావడంతో... సుందరమ్మ బజార్లలో దుకాణాలు మూయించి, హర్తాళ్‌ జరిపించారు. ఫలితంగా ఆమెను, ఆమె చెల్లెలు కనకవల్లి తాయారమ్మను తెనాలిలో అరెస్ట్‌ చేశారు. మూడు రోజుల పాటు వారిని తాలూకా పోలీస్‌ స్టేషన్లో ఉంచారు. క్షమాపణ రాసి ఇస్తే విడుదల చేస్తామని ప్రభుత్వం రాయబారం పంపింది.


ఆ పని మాత్రం చెయ్యబోమని వారు కచ్చితంగా చెప్పారు. ఏడున్నర నెలలపాటు రాయవేలూరులో శిక్ష అనుభవించారు.  జైలు నుంచి వచ్చాక... గాంధీజీ సూచన మేరకు స్వదేశీ వస్తు విక్రయ శాలను సుందరమ్మ స్థాపించారు. వివిధ ప్రాంతాల నుంచి స్వదేశీ వస్తువులు, ఖాదీ వస్త్రాలు తెప్పించి విక్రయించేవారు. మహిళలే దాన్ని నిర్వహించారు. ఎనిమిదేళ్ళపాటు అది విజయవంతంగా నడిచింది. 1934లో విజయవాడ పురపాలక సంఘ సభ్యురాలిగా పోటీ లేకుండా ఎన్నికయ్యారు. పద్ధెనిమిదేళ్ళు ఆ స్థానంలో కొనసాగారు. ఆమె కృషి ఫలితంగా బాలికల కోసం ఒక హైస్కూల్‌ ఏర్పాటయింది. పాదర్తి సుందరమ్మ గరల్స్‌ హైస్కూల్‌ పేరిట ఈనాటికీ నడుస్తోంది. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమం సందర్భంగా సత్యాగ్రహులకు ఆమె ఆశ్రయం ఇచ్చారు. అలాగే 1948లో తెలంగాణ ప్రాంతంలో రజాకర్ల గొడవల కారణంగా వలస వచ్చిన వారికి విజయవాడ పురపాలక సంఘం తరఫున అన్ని విధాలా ఆమె సహాయం చేశారు.


కేంద్ర సంఘ సంక్షేమ సమితి సహకారంతో విజయవాడలో అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి, దాదాపు మూడువేల మంది మహిళలకు ఆదాయం లభించడానికి దోహదపడ్డారు. అంతకుముందే... 1940లో ఋషీకేశ్‌లో ‘దక్షిణ భారత క్షేత్రం’ పేరిట ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి, యాత్రికులకు ఉచితంగా వసతి అందించారు. మరణించేవరకూ... ఆరు నెలలపాటు విజయవాడలో, ఆరు నెలలపాటు ఋషీకేశ్‌లో ఆమె గడిపారు. స్వతంత్ర పోరాటంలోనే కాదు, సామాజిక, ఆధ్యాత్మిక రంగాల్లో అకుంఠిత సేవా దీక్షకు, అలుపు, వెరపు ఎరుగని యోధురాలుగా సుందరమ్మ నిలిచిపోయారు.


ఇతర మహిళా నేతలతో పాటు సుందరమ్మ కూడా బొంబాయి వెళ్ళి, వాలంటీర్‌ శిక్షణలో చేరారు. కర్రసాము, గస్తీ తిరగడం లాంటివి నెల రోజుల పాటు అభ్యసించారు.


(‘స్వతంత్ర సమరంలో ఆంధ్రమహిళలు’ సంకలనం నుంచి)


Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST