అమరావతి రక్షకా.. గోవిందా..!

ABN , First Publish Date - 2022-10-02T09:53:56+05:30 IST

‘‘ఆపద మొక్కులవాడా.. అమరావతి రక్షకా.. గోవిందా గోవింద..’’ అంటూ అమరావతి పాదయాత్ర రైతులు చిన వెంకన్న సన్నిధికి మోకాళ్లపై నడిచి వెళ్లారు. 19రోజులుగా సాగుతున్న పాదయాత్రకు శనివారం ద్వారకా తిరుమలలో విరామం ఇచ్చారు.

అమరావతి రక్షకా.. గోవిందా..!

చిన వెంకన్న సన్నిధికి మోకాళ్లపై చేరుకున్న రైతులు 

నేడు తూర్పుగోదావరి జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశం 


ద్వారకా తిరుమల, అక్టోబరు 1: ‘‘ఆపద మొక్కులవాడా.. అమరావతి రక్షకా.. గోవిందా గోవింద..’’ అంటూ అమరావతి పాదయాత్ర రైతులు చిన వెంకన్న సన్నిధికి మోకాళ్లపై నడిచి వెళ్లారు. 19రోజులుగా సాగుతున్న పాదయాత్రకు శనివారం ద్వారకా తిరుమలలో విరామం ఇచ్చారు. ఉదయం అతిథి గృహం సమీపంలో ఉంచిన రథంలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీనివాసుని దర్శించి తీర్ధ, ప్రసాదాలు తీసుకున్నారు. ఆ తరువాత రైతులు విడతల వారీగా శ్రీవారి దర్శనం నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ఆలయ తొలిమెట్టు వద్దనున్న పాదుకా మండపం వద్దకు చేరుకుని ‘‘అమరావతిని రక్షించేవాడు చినవెంకన్న మాత్రమే’’ అంటూ నినాదాలు చేశారు. కొందరు రైతులు ప్రధాన రాజగోపురం మెట్లదారి వెంబడి మోకాళ్లపై నడుస్తూ ఆలయంలోకి ప్రవేశించారు. ఏకైక రాజధానిగా అమరావతి ఉండేలా అనుగ్రహించాలని స్వామిని ప్రార్ధించారు. ఆలయానికి వెళ్లినవారిలో జేఏసీ నేతలు శివారెడ్డి, తిరుపతిరావు, రాయపాటి శైలజ తదితరులు ఉన్నారు.


మధ్యాహ్నం భోజనాల అనంతరం కొందరు విశ్రమించగా, మరికొందరు నడక వల్ల వచ్చిన మోకాళ్ల నొప్పులు. కాలి బొబ్బలకు సొంత చికిత్స చేసుకున్నారు. కొందరు మసాజ్‌లు చేయించుకుంటూ సేద తీరారు. శనివారం విశ్రాంతి తీసుకున్న అమరావతి రైతులు ఆదివారం ఉదయం పాదయాత్రను కొనసాగించనున్నారు. ద్వారకా తిరుమల ఆలయం నుంచి మండలంలోని రాళ్లకుంట మీదుగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. నల్లజర్ల మండలం అయ్యవరంలో భోజన విరామం తరువాత బయలుదేరి దూబచర్లలో రాత్రికి బస చేస్తారు. 

Updated Date - 2022-10-02T09:53:56+05:30 IST