తిరుపతి నుంచి విజయవాడ వరకు దివ్యాంగుడి పాదయాత్ర
గుంటూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో జ్ఞాననేత్రులకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో దివ్యాంగుడు పొన్నలూరి శ్రీనివాసఫణి చేపట్టిన పాదయాత్ర గుంటూరు చేరింది. జ్ఙాననేత్రులకు విద్యా, ఉద్యోగాల్లో ఉన్న ఒక శాతం రిజర్వేషన్‌ను అన్ని చట్టసభల్లో కల్పించి ప్రోత్సహించాలంటూ ఆయన పాదయాత్ర చేపట్టారు. డిసెంబరు 12న చిరుచానూరులో మొదలైన యాత్ర శనివారం గుంటూరుకు చేరింది. ఈ నెల 26న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చేరే విధంగా ఆయన తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస ఫణి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. తాము దృష్టిని అధిగమించి, అవమానాలు భరిస్తూ, వివక్షను సహిస్తూ, అణచివేత, మోసాలను ఎదిరిస్తూ మనోధైౖర్యంతో రాజ్యాంగంలో భాగం కల్పించాలని కోరుతున్నామన్నారు. మొదటి దశగా ఈ యాత్ర చేపట్టానని, అందరిని కలుపుకొని భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని శ్రీనివాస ఫణి తెలిపారు.