డబ్బులివ్వరా!

ABN , First Publish Date - 2022-08-08T06:07:24+05:30 IST

అరువు రేపు.. ఏ వ్యాపార దుకాణం వద్దకు వెళ్లినా కనిపించే బోర్డు ఇది.. రైతు విషయంలో మాత్రం ఈ సూత్రం వర్తించడం లేదు..

డబ్బులివ్వరా!

అన్నదాతకు అందని ధాన్యం బకాయిలు

ఖరీఫ్‌ ముగుస్తున్నా అందని వైనం

నిలిచిన 1760 మంది సొమ్ము

జిల్లాలో రూ. 86.99 కోట్లు బకాయి

అప్పుల పాలైన రైతాంగం

కష్టం అందక రైతుల కన్నీళ్లు

పట్టించుకోని అధికార యంత్రాంగం


( రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)

అరువు రేపు.. ఏ వ్యాపార దుకాణం వద్దకు వెళ్లినా కనిపించే బోర్డు ఇది.. రైతు విషయంలో మాత్రం ఈ సూత్రం వర్తించడం లేదు.. కష్టపడి పండించిన పంటను ప్రభుత్వానికి అరువుకు ఇవ్వాల్సిందే.. అష్టకష్టాలు పడాల్సిందే.. సొమ్ము ఇష్టం వచ్చినప్పుడు చెల్లిస్తారు. జిల్లాలో సంఘటనే దీనికి ఉదాహరణ.. ఎందుకంటే ఖరీఫ్‌ సాగు ముగింపు దశకు వచ్చినా 1960 మంది రైతులకు రిలీఫ్‌ లేదు. ప్రభుత్వం నుంచి ధాన్యం సొమ్ములు రాక ఎప్పుడిస్తారో తెలియక..  ఖరీఫ్‌ సాగుకు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక ఆందోళనకు గురవుతున్నారు. వచ్చిన అధికారిని ప్రశ్నించినా రేపు అంటూ దాటవేసి వెళ్లిపోతున్నారే తప్ప.. రైతుల కష్టాలు మాత్రం తీర్చడం లేదు. ఖరీఫ్‌ నాట్లు ముగింపు దశకు వచ్చినా... రబీ రైతు పండించిన ధాన్యం డబ్బులు పూర్తిగా రైతుకు చేరలేదు.  సమయంలేకపోవడంతో అప్పోసప్పో చేసి రైతు ఖరీఫ్‌ సాగుకు సిద్ధమయ్యాడు. ఆరంభంలోనే వరదలు, భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాల్లో వరినాట్లు మునకలోనే ఉన్నాయి. ఈ కష్టాలు ఇలా ఉంటే.. రబీ ధాన్యం డబ్బు లు పూర్తిగా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. 


నెలలు గడుస్తున్నా.. వాయిదాలే..


కేవలం 21 రోజుల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. నెలలు గడచిపోతున్నా రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తూనే ఉంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పూర్తి పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెప్పినా, ఎక్కడ తప్పు జరిగిందో మరి 86 మంది రైతుల సొమ్మును బ్యాంకులు తిరస్కరించాయి. 1960 మంది రైతులకు రూ.86.99 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి. ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా  రబీ ధాన్యం కొనుగోలు చేయించినట్టు చెప్పినా, కమీషన్‌ ఏజెంట్ల ద్వారా మిల్లర్లే కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోపు రైతు బ్యాంక్‌ ఖాతాలోకి ధాన్యం సొమ్ము జమకావాలి. కానీ ఆగస్టు గడచిపోతోంది. అయినా ఇంకా ఎటూ తేలలేదు. 


అన్నదాతల ఎదురుచూపులు..


 జిల్లాలో 1, 59,716 ఎకరాల్లో వరి పంట పండించారు. దాని ద్వారా  5,80,875 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. అధికారుల అం చనా ప్రకారం అందులో 87,131 టన్నుల ధాన్యం స్థానికంగా వినియోగమవుతుంది.58,604 టన్నులు మిల్లర్లు కొనుగోలు చేస్తారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా 4,35,140 టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తారని అంచనా వేశారు.ధాన్యం 4.60 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందులో 303  రైతు భరోసా కేంద్రాల ద్వారా 38,471 మంది రైతుల నుంచి మొత్తం 3,77,543 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.  వీటి విలువ రూ.732.44 కోట్లు. అందులో ఈ నెల 6వ తేదీ నాటికి 36,597 మంది రైతులకు రూ.647.28 కోట్లు చెల్లించారు. మిల్లులు, ఆర్‌బీకేల వద్ద 348 మంది రైతులకు సంబంధించిన రూ.7.18 కోట్లకు చెందిన ఎఫ్‌టీ వోలు పెండింగ్‌లో ఉన్నాయి. బ్యాంక్‌ ఖాతాలకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడం వల్ల 86 మంది రైతులకు సంబంధించిన రూ.1.83 కోట్లను బ్యాంకులు తిరస్కరించాయి.ఈ ఖాతాదార్లకు భూములు ఉన్నా యా,  తప్పులేమైనా సరిగాయా అనే కోణం నుంచి అధి కారులు ఆరా తీస్తున్నారు. ఈ ఆరా పూర్తయిన తర్వాతే ఆ రైతుల ఖాతాలలో డబ్బులు జమవుతాయి. ఇంకా 1960 మంది రైతులకు రూ.86.99 కోట్లు చెల్లించాలి.

Updated Date - 2022-08-08T06:07:24+05:30 IST