కోతకొచ్చిన పంట నీటి పాలు

ABN , First Publish Date - 2020-11-27T05:57:06+05:30 IST

అతి తీవ్ర తుఫాన్‌ ‘నివర్‌’ ప్రభావంతో కురిసిన వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. బుధవారం రాత్రి నుంచే చాలాచోట్ల వర్షం మొదలైంది. గురువారం పగలంతా పడుతూనే ఉంది.

కోతకొచ్చిన పంట నీటి పాలు
ఎలమంచిలి మండలం సోమలింగపాలెంలో నేల కొరిగిన వరి దుబ్బులను నిలగడుతున్న రైతు

అన్నదాతను మరోమారు ముంచేసిన వాన

అతి తీవ్ర తుఫాన్‌ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు

వరి పంటకు తీవ్ర నష్టం

తడిసిపోయి నీటిలో తేలుతున్న పనలు

ఈదురు గాలులకు వేల ఎకరాల్లో నేల కొరిగిన పైరు

పొల్లు గింజ ఏర్పడుతుందని రైతుల ఆవేదన

7,300 హెక్టార్లలో వరి పైరు నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా

నేడు భారీ వర్ష సూచన...  అన్నదాతల ఆందోళన


విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): అతి తీవ్ర తుఫాన్‌ ‘నివర్‌’ ప్రభావంతో కురిసిన వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. బుధవారం రాత్రి నుంచే చాలాచోట్ల వర్షం మొదలైంది. గురువారం పగలంతా పడుతూనే ఉంది. వర్షాలకు తోడు ఈదురుగాలులు వీయడంతో కోతకు వచ్చిన వరి పైరు నేలకొరిగింది. పల్లపు ప్రాంతాల్లో నేలవాలిన వరి పైరు నీట మునిగింది. తుఫాన్‌కు సంబంధించి వాతావరణ శాఖ నాలుగు రోజుల క్రితమే హెచ్చరికలు జారీచేయడంతో సోమవారం నుంచి రైతులెవరూ వరి కోతలు కోయలేదు. అయితే అప్పటికే కోత కోసి, కుప్ప వేయని పొలాల్లో వున్న వరి పనలు తడిసిపోయి నీట మునిగాయి. పొట్ట, గింజ పాలుపోసుకునే దశల్లో వున్న వరి పైరు నేలవాలితే పొల్లు గింజ ఏర్పడుతుందని, ధాన్యం దిగుబడి తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు. అందుకే చిరుజల్లులు పడుతున్నప్పటికీ పలువురు పొలాలకు వెళ్లి, నేలవాలిన వరి పైరును నిలబెట్టడానికి యత్నించారు.


కాగా గురువారం ఉదయం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది వరి పొలాలను సందర్శించి పంట నష్టంపై ప్రాథమిక అంచనా వేశారు. సాయంత్రం వరకు జిల్లాలో 7,300 హెక్టార్లలో వరి పంట తడిసిపోవడం లేదా మునిగిపోవడం జరిగినట్టు గుర్తించారు. వర్షాలు తగ్గిన తరువాత వాస్తవ పంట నష్టాన్ని అంచనా వేస్తామని వ్యవసాయ శాఖ జేడీ లీలావతి తెలిపారు. పొలాల్లో నిలిచిన వర్షపు నీరు బయటకు వెళ్లేలా పాయలు తీసుకోవాలని, వర్షం తగ్గిన తరువాత తడిసిన వరి పనలపై ఉప్పు ద్రావకం చల్లితే ధాన్యం రంగు మారదన్నారు. ఇదిలావుండగా శుక్రవారం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో అన్నదాతలు మరింత ఆందోళన చెందుతున్నారు.


పాయకరావుపేట మండలం మాసాహెబ్‌పేట, సత్యవరం, గోపాలపట్నం, తదితర గ్రామాల్లో సుమారు 300 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేసి, ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్టు వ్యవసాయ శాఖ అధికారి సౌజన్య తెలిపారు. ఆమెతోపాటు తహసీల్దార్‌ అంబేడ్కర్‌ గురువారం అరట్లకోట, మంగవరం తదితర గ్రామాల్లో పర్యటించి నేలకొరిగి నీట మునిగిన వరి పంటను పరిశీలించారు. 


అచ్యుతాపురం మండలం ఎర్రవరం, ఉప్పవరం, ఎంజేపురం, అందలాపల్లి గ్రామాల్లో ముంపునకు గురైన వరి పొలాలను వ్యవసాయాధికారి పి.రంగాచారి పరిశీలించారు. 236 హెక్టారుల్లో వరి పంట ముంపునకు గురైనట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 250 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. 


ఎస్‌.రాయవరం మండలంలో నాలుగు రోజుల క్రితం నీట మునిగిన 1,600 ఎకరాలతోపాటు తాజాగా మరో 450 ఎకరాల్లో వరి పైరు నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. బుచ్చెయ్యపేట మండలంలో నాలుగు రోజుల క్రితం భారీవర్షం పడడంతో 16 గ్రామాల పరిధిలో 865 ఎకరాల్లో కోత కోసిన వరి పనలు నీట మునిగాయి. మరో 500 ఎకరాల్లో వరి పైరు నేల కొరిగింది. దిబ్బిడి ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకు నీట మునిగిన వరి పనలను పొలాల గట్లపైన, ఖాళీ స్థలాల్లో, రహదారులపైనా ఆరబెట్టుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పనలపై ఉప్పు నీటి ద్రావణాన్ని పిచికారీ చేశారు. అయినప్పటికీ గింజలకు మొలకలు రావడంతో పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అతి తీవ్ర తుఫాన్‌ ‘నివర్‌’ ప్రభావంతో నగరంలో ముసురుపట్టింది. బుధవారం రాత్రి మొదలైన వర్షం గురువారం అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. తీర ప్రాంతం కావడంతో ఈదురుగాలులు బలంగా వీచాయి. దీంతో చలి పెరిగింది.   ...కాగా మైదాన ప్రాంతంలో గురువారం సాయంత్రం నుంచి వర్షం పెరిగింది. ఏజెన్సీలో చిరుజల్లులు పడుతున్నాయి. వర్షానికి తోడు శీతలగాలులు వీస్తుండడంతో జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. రహదారులపై జనసంచారం బాగా తగ్గిపోయింది. కొనుగోలుదారులు రాకపోవడంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు బోసిపోయాయి. తోపుడుబండ్లు, రోడ్డు పక్క చిరువ్యాపారులు ఇబ్బంది పడ్డారు.


వర్షపాతం

గురువారం ఉదయం 8.30 నుంచి రాత్రి 6.30 గంటల వరకు రికార్డయిన వివరాల ప్రకారం...పెదగంట్యాడ మండలంలో అత్యధికంగా 36 మి.మీ. వర్షపాతం నమోదైంది. పరవాడ మండలంలో 34.2, మునగపాకలో 32.4, కశింకోటలో 30.8, సబ్బవరంలో 29.6, రాంబిల్లిలో 28.6, గాజువాకలో 28, నక్కపల్లిలో 26.6, విశాఖపట్నం రూరల్‌లో 25.2, అనకాపల్లిలో 25.2, చోడవరంలో 24.8, ఎలమంచిలిలో 22.8, ఆనందపురంలో 21, బుచ్చెయ్యపేటలో 19.8, పెందుర్తిలో 14.2, పాయకరావుపేటలో 14.2, పద్మనాభంలో 12.8, నర్సీపట్నంలో 10.4, చింతపల్లిలో 8.2, భీమిలిలో 7.6, పాడేరు 4.8, అరకులోయ 4.6, డుంబ్రిగుడలో 2 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Updated Date - 2020-11-27T05:57:06+05:30 IST