పాడిరైతుల గగ్గోలు..!

ABN , First Publish Date - 2021-12-08T05:08:46+05:30 IST

పల్లెల్లో వ్యవసాయం తరువాత ప్రధాన ఆదాయ వనరు పాడి. అటువంటి పాడి రైతులు వరదతో సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు.

పాడిరైతుల గగ్గోలు..!
మందపల్లెలో రైతు నాగేశ్వర పశువుల పాకలో చనిపోయిన పశువులు

ఒక్క పశువు మరణించినా.. 20 మరణించినా ఒకే దామాషాలో నష్ట నష్టపరిహారం

పరిహారం పశువుల దాణాకు సరిపోదంటున్న పాడి రైతులు


రాజంపేట, డిసెంబరు 7 : పల్లెల్లో వ్యవసాయం తరువాత ప్రధాన ఆదాయ వనరు పాడి. అటువంటి పాడి రైతులు వరదతో సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. వీరికి ప్రభుత్వం నష్టపరిహారం అరకొర ఇవ్వడంతో ఇది పశువుల దాణాకూ సరిపోదంటూ గగ్గోలు పెడుతున్నారు. 

పాడి రైతులకు చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతం పెట్టింది పేరు. ఈ నది ఒడ్డున నందలూరు, రాజంపేట, పెనగలూరు మండలాలకు చెందిన సుమారు 40 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో పంటలతో పాటు మొత్తం పాడి పరిశ్రమ అంతా వరద పాలైంది. ప్రధానంగా పులపత్తూరు, మందపల్లె, తొగూరుపేట, రామచంద్రాపురం, గుండ్లూరు, పాటూరు తదితర గ్రామాల్లోనే ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన వినతిపత్రాల ప్రకారం 13,602 మూగజీవాలు మరణించినట్లు సమాచారం. అందులో గేదెలు, ఆవులు 1,382,  గొర్రెలు 2532, కోళ్లు 9638 మృత్యువాత పడ్డాయి. ఈ గ్రామాల వరకే ఒక్కో ఆవుకు రూ.70 వేలు, గొర్రెకు రూ.6వేలు, కోడికి రూ.600 అనుకుంటే జరిగిన నష్టం సుమారు రూ.11.5 కోట్లు. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా పాడిని నమ్ముకుని జీవిస్తున్న సుమారు 500 మంది పాడి రైతులు భారీ ఎత్తున నష్టపోయారు. ప్రస్తుతం పాడిపశువులన్నీ నీటి పాలవ్వడంతో ఇక్కడ తీవ్ర పాల సమస్య ఏర్పడింది. వేల సంఖ్యలో ఉన్న పశువులు వందలకు చేరాయి. మామూలుగా ఒక ఆవు కొనాలన్నా రూ.75 వేల నుంచి లక్ష అవుతుంది. ఒక గేదె కొనాలంటే రూ.50 వేల నుంచి రూ.70 వేలు ఖర్చు అవుతుంది. ఒక ఆవు లేదా గేదెతో జీవనం సాగించే కుటుంబాలు చాలా ఉన్నాయి. కొంతమంది రైతులు 5 నుంచి 10 పశువులు, మరికొంత మంది రైతులు 20 పశువులను పెట్టుకుని పాడిపరిశ్రమతో ఆదాయం ఆర్జించేవారు. 


20 పశువులు చనిపోయినా..

ప్రస్తుతం ఇక్కడ నష్టపరిహారం అందరికీ ఒకే విధంగా ఇచ్చారు. ఒక పశువు చనిపోతే ఎలా రూ.30 వేలు ఇచ్చారో.. 20 పశువులు చనిపోయినా అంతే నష్టపరిహారం ఇచ్చారు. కాదంటే ఆవుకు బదులు పడ్డ ఆవు, బర్రెకు బదులు యదకొచ్చిన పడ్డ రూపంలో ఆవుకు రూ.30 వేలు, గేదెకు రూ.18 వేల చొప్పున అందజేశారు. ఇది తీవ్ర విమర్శలకు గురి చేస్తోంది. అందరినీ ఒకే గాటన కట్టి ఒక పశువున్న వారికి, 20 పశువులున్న వారికి ఒకే దామాషా ప్రకారం నష్టపరిహారం ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.


మూడెద్దులకు పరిహారం ఇస్తారట..!

వాస్తవం ఏంటంటే ఎద్దులతో దుక్కులు దున్నేవారు లేరు. అందరూ ఇప్పుడు ట్రాక్టర్లతో సేద్యం చేస్తున్నారు. అయితే ఒక్కొక్క ఎద్దుకు రూ.25 వేల చొప్పున మూడెద్దులకు రూ.75 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉంది. లేని మూడు ఎద్దులకు నష్టపరిహారం ఇస్తామనడం, ఉన్న ఆవులన్నింటికీ ఇవ్వకపోవడం ప్రభుత్వ డొల్లతనం బయటపడుతోంది.


కోడికి రూ.50.. గొర్రెకు రూ.3వేలు

ఇక కనీసం అతి చిన్న కోడి అయినా రూ.600 చేస్తుంది. రూ.5 వేలు పైబడి అమ్మే కోళ్లు కూడా ఉన్నాయి. అటువంటిది ఒక్కో కోడికి రూ.50 మాత్రమే అందజేస్తున్నారు. ఇక మేకలు, గొర్రెలు చనిపోతే ఒక్కో రైతుకు 30 గొర్రెలకు ఒక్కొక్క దానికి రూ.3 వేల చొప్పున ఇస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రభుత్వం పాడి రైతులకు ఈ ప్రాంతంలో రూ.1,25,62,600 తొలివిడత నష్టపరిహారం అందజేసింది. రెండవ విడత కింద రూ.25,43,000 నష్టపరిహారాన్ని ఇవ్వనున్నారు. అంటే మొత్తం రూ.1,51,56,000 నష్టపరిహారం పంపిణీ జరుగుతోంది. పాడి రైతుల సమాచారం ప్రకారం ఈ ప్రాంతంలో రూ.50 కోట్లకు పైబడి నష్టం జరిగితే ప్రభుత్వం అందజేసే ఈ అరకొర సాయం ఏ మేరకు సరిపోతుందో అర్థం కాని పరిస్థితి. ఇకనైనా ప్రభుత్వం ఉదారంగా స్పందించి చనిపోయిన ప్రతిపశువుకు నష్టపరిహారాన్ని అందించాలని పాడి రైతులు కోరుతున్నారు. లేదూ ప్రభుత్వమే తమకు పాడిపశువులను కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.


20 చనిపోతే రెండింటికే పరిహారం

ఈ పశువుల పాక గుండ్లూరు పంచాయతీ చాపవారిపల్లెకు చెందిన జనార్ధన్‌రెడ్డిది. పాడితో జీవించేవాడు. భారీ వరద వచ్చి ఇతని పశువుల పాకలో ఉన్న మొత్తం 20 పైబడి గేదెలు చనిపోయాయి. సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. ఒక్కో గేదె రోజుకు 20 లీటర్లు పైబడి పాలిచ్చేది. పాల ద్వారా రోజూవారి రూ.10 వేలకు తగ్గకుండా ఆదాయం వచ్చేది. అయితే అతనికి ఒక బర్రెకు రూ.30 వేలు, మరో పడ్డకు రూ.18 వేలు మొత్తం రూ.48 వేల నష్టపరిహారం వచ్చింది. వరద సమయంలో ఇతని వద్ద రూ.2 లక్షల రూపాయల విలువైన దాణా ఉంది. అంటే ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం ఈ దాణాకు కూడా సరిపోదు. 


8 చనిపోతే... ఒక్క పశువుకే పరిహారం 

మా ఇంటిలో 8 పశువులు చనిపోతే ఒక్క పశువుకే నష్టపరిహారం ఇచ్చారు. వారిచ్చిన సొమ్ము 30 వేలు ఎందుకూ సరిపోలేదు. చనిపోయిన పశువులన్నింటికీ ప్రభుత్వం పరిహారం ఇస్తే  మాకు కాస్త ఆసరాగా ఉంటుంది.

- పసుపులేటి సుబ్బమ్మ, పాడి మహిళా రైతు, మందపల్లె  


నష్టపరిహారం దాణాకు కూడా సరిపోదు

మా పశువుల పాకలో 20 పశువులు చనిపోయాయి. మూడు పశువులు మాత్రమే బతికాయి. ఒక్కో ఆవుకు రమారమి రూ.70 వేలు వేసుకున్నా 20 ఆవులకు రూ.14 లక్షల వరకు నష్టం జరిగింది. అటువంటిది ఒక ఆవుకు రూ.30 వేలు, ఒక యదకొచ్చిన పడ్డకు రూ.18 వేలు ఇచ్చారు. మా ఇంటిలో వరద వచ్చే నాటికి లక్ష రూపాయల పశుదాణానే ఉండింది. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం పశువుల దాణాకు కూడా సరిపోదు.

- నాగేశ్వర, పాడి రైతు, మందపల్లె  


పాడి రైతులందరినీ ఆదుకోవాలి

పాడి రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి. రాజంపేట ప్రాంతంలో వరదలతో పాడి రైతులు బాగా నష్టపోయారు. వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలంటే చనిపోయిన అన్ని పశువులన్నింటికీ నష్టపరిహారం ఇవ్వాలి. లేదూ కొత్తవి కొనివ్వాలి.

- కృష్ణారెడ్డి, రామచంద్రాపురం 


నిబంధనల మేరకు నష్టపరిహారం అందజేశాం

ప్రభుత్వ నిబంధనల మేరకు పాడి రైతులందరికీ నష్టపరిహారం అందజేశాం. ఇప్పటికే తొలి విడతగా రూ.1,25,62,600 నష్టపరిహారాన్ని పాడి రైతులకు అందజేశాం. రెండో విడత కింద రూ.25,43,000 పరిహారాన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం.

- ఎన్‌.సురే్‌షరాజు, సహాయ సంచాలకులు, రాజంపేట పశుసంవర్థక శాఖ  



Updated Date - 2021-12-08T05:08:46+05:30 IST