సార్వా మాసూళ్లు.. దాళ్వా సాగు..

ABN , First Publish Date - 2020-12-03T04:40:56+05:30 IST

సార్వా ఆది నుంచి మునుగుతూ తేలుతూ సాగు ఈడ్చుకొచ్చిన రైతులు పంట చేతికందే దశలో తుఫాన్‌తో మొత్తానికి మునిగిపోయారు

సార్వా మాసూళ్లు.. దాళ్వా సాగు..
వీరవాసరం మండలంలో నీటి ముంపులో కుళ్లుతున్న వరి

తుఫాన్‌ కష్టం నుంచి తేరుకోని రైతులు 

సార్వా నష్టమే

దాళ్వా సాగుకు సమాయత్తం


సార్వా ఆది నుంచి మునుగుతూ తేలుతూ సాగు ఈడ్చుకొచ్చిన రైతులు పంట చేతికందే దశలో తుఫాన్‌తో మొత్తానికి మునిగిపోయారు. సార్వా కష్టం కళ్లాల్లో ఆరుతుంటే రబీ తరుముకువస్తోంది. సార్వాలో రెండు, మూడు పర్యాయాలు నారు, నాట్లతో పెట్టుబడి భారం కావడంతో తుఫాన్‌ దెబ్బకు నష్టం మిగిలింది. తుఫాన్‌ దెబ్బతీసి వారం రోజులైనా అక్కడక్కడ మిగిలిన నాలుగు దుబ్బులు మాసూలు చేయడానికి తంటాలు పడుతున్నారు. అదే సమయంలో రబీకి సాగునీటి సరఫరా రైతులను అయోమయంలో పడేసింది. మార్చిలోనే కాల్వలు కట్టివేత ప్రకటనతో ముందస్తు సాగుకు అధికారులు రైతులను తరుముతున్నారు. నెలాఖరుకు నాట్లు పూర్తిచేయాలని అధికారులు తొందరపెట్టడంతో రైతులు పెట్టుబడి కోసం తడుముకుంటున్నారు.


వీరవాసరం / ఆచంట / పాలకొల్లు రూరల్‌, డిసెంబరు 2 : నివర్‌ తుఫాను గాయం ఇంకా మానలేదు. వారం రోజులైనా చేలల్లో ముంపు తీయలేదు. వీరవాసరం మండలంలో కొన్ని చోట్ల మురుగుకోడు వెంబడే నీరు వెళ్లే పరిస్థితి లేదు. రెండేళ్లుగా మురుగుకోడులో నీరు పారుదలకు తూడు అడ్డంకిగా మారింది. వీరవాసరం, బొబ్బనపల్లి, మత్స్యపురి ఆయకట్టుకు చెందిన మురుగునీరు రాణీకోడు, అడ్డకోడు తల్లిపరకోడు ద్వారా గొంతేరులో కలిసేవి. ఈ కోడుల్లో గుర్రపుడెక్క తూడు పెరిగిపోవడం వీటిని తీయకపోవటం వలన నీరు ముందుకు సాగే పరిస్థితి కనిపించటం లేదు. ఈకోడును చేర్చి ఉన్న వరి నీటి ముంపులో కుళ్ళుతూనే ఉన్నాయి. 


32 పంట కోత ప్రయోగాల్లో సున్నా

ఆకివీడు రూరల్‌: ఆకివీడు మండలంలో 32 పంటకోత ప్రయోగాలు సున్నా దిగుబడి చూపుతున్నాయని ఏడీఏ అనిల్‌కుమారి తెలిపారు. ఆకివీడు మండలంలోని అయిభీమవరం గ్రామంలో పంటకోత ప్రయోగం ప్రాంతాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. మండలంలో 48 పంటకోత ప్రయోగాలు చెయ్యాల్సి ఉండగా చేలు నీట మునగడంతో వాటిలో 32 ప్రయోగాలు సున్నా దిగుబడి చూపుతున్నాయని ఆమె తెలిపారు. పెదకాపవరం, చెరుకు మిల్లి, అయిభీమవరంలలో పరిశీలించినట్లు తెలిపారు.


పంట కోత ప్రయోగం ఇలా..

ఒక రెవెన్యూ గ్రామంలో నాలుగు చోట్ల పంట కోత ప్రయోగం చేస్తారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో 5 చదరపు మీటర్ల పరిధిలోని భూమిలో వరి పంట కోసి ధాన్యాన్ని సేకరిస్తారు. ఆ ధాన్యం తూకం వేసి ఎకరాకు దిగుబడి లెక్కగడతారు. నాలుగు చోట్ల దిగుబడి పరిశీలించి గ్రామ సరాసరి దిగుబడి అంచనా వేస్తారు.


మునుగుతూ.. తేలుతూ..

పాలకొల్లు మండలంలో 4,665 హెక్టార్లలో వరి సాగు చేస్తుండగా నారు మడి దశలోనే వర్షాలకు రెండు సార్లు దెబ్బతినడంతో సుమారు 500 ఎకరాల్లో సాగుచేయలేదు. మిగిలిన రైతులు మూడో దఫా నారుమడులు వేశారు. తుఫాన్‌, ఈదురు గాలులకు వరి చేలు నేలమట్టం అయ్యాయి. రైతులు వర్షపు నీటిని చేలల్లోంచి బయటకు పంపేందుకు ఇంజన్లను వాడారు. యంత్రాలతో కోతకు అవకాశం లేకపోవడంతో కూలీలతో మాసూలు చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. కోత పనికి మహిళలకు రూ.400, పురుషులకు రూ.600 ఇవ్వాల్సి రావడంతో డీజిల్‌, కూలీల ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. ఎకరాకు రూ.15 నుంచి 20వేలు నష్టపరిహారం చెల్లించకుంటే వ్యవసాయం చేసే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.


రబీకి సన్నద్ధం

తుఫాన్‌తో నష్టపోయిన రైతులు ఇంకా తేరుకోలేదు. మాసూలు పూర్తి కాలేదు. అదే సమయంలో రబీ సాగుకు సన్నద్ధమవుతున్నారు. మార్చిలో కాల్వల కట్టివేత కారణంగా ముందస్తు సాగుకు అధికారులు రైతులకు సూచ నలు ఇస్తున్నారు. నెలాఖరుకు నాట్లు పూర్తి చేయాలని రైతులను తొందర పెడుతున్నారు. రబీ సాగులో కూడా ఇబ్బందులు తప్పవనే భయంతో పలు వురు రైతులు అప్పు చేసి మరీ నారుమడులు వేయడానికి సమాయత్త మయ్యారు. రబీలో ఎంటీయూ 1121 రకం విత్తనాలు వేయాలని అధికారులు ప్రచారం చేయడంతో పాటు రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రైతులు సార్వా మాసుళ్లతో పాటే దాళ్వా నారుమడులు వేస్తున్నారు.


రెండు మార్లు నారుమడి దెబ్బతింది

కూలి పనులు చేసుకుంటాను. వ్యవసాయంపై మక్కువతో రెండు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాను. నారుమడి దశలో రెండు సార్లు దెబ్బతిన్నాం. మూడో సారి నారుమడి వేసి నాట్లు వేశాను. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్‌ ముంచేసింది. కనీసం పశువులకు కూడా దాణాగా పనికి రాని స్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆదుకోకుంటే భవిష్యత్‌లో వ్యవసాయం వైపు చూసే పరిస్థితి లేదు.

కౌరు వెంకట్రావు, కౌలు రైతు, పెదమామిడిపల్లి


డీజిల్‌, కూలి ఖర్చు అదనపు భారం

ఎకరం సొంత భూమి, కౌలుకు 3 ఎకరాలు సాగు చేస్తున్నాను. నారుమడి దశలో దెబ్బతిన్నప్పటికీ మరలా ఊడ్చాను, ప్రస్తుతం కోతకు యంత్రాలకు వీలులేదు. కూలీలతో కోత కోయించి, నూర్పిడి, ఎగరబోత, ఆరబోత వంటి పనులు చేస్తున్నాం. కూలీల ఖర్చు అధికమైంది, ఎకరాకు 15 బస్తాల దిగుబడి వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ప్రభుత్వం ఎంత వరకూ ఆదుకుంటుందో..

తాడి ముసలయ్య, రైతు, గొల్లవాని చెరువు

Updated Date - 2020-12-03T04:40:56+05:30 IST