ధాన్యం కొనరు.. డబ్బులివ్వరు

ABN , First Publish Date - 2022-05-16T06:42:23+05:30 IST

అన్నదాతకు అంతా కష్టమే.. పంట పండించడం ఒక ఎత్తయితే.. అమ్ముకోవడం మరింత కష్టంగా మారింది..

ధాన్యం కొనరు.. డబ్బులివ్వరు

పూర్తయిన 80 శాతం కోతలు.. వేగవంతం కాని కొనుగోళ్లు

1.5 లక్షల టన్నులే కొనుగోలు..రైతుకు పైసా ఇవ్వలేదు

లక్ష్యం 4.6 లక్షల టన్నులు.. రబీ డబ్బులొస్తేనే ఖరీఫ్‌కు 

దళారుల వైపు చూస్తున్న అన్నదాతలు


అన్నదాతకు అంతా కష్టమే.. పంట పండించడం ఒక ఎత్తయితే..  అమ్ముకోవడం మరింత కష్టంగా మారింది.. అది పూర్తయిందా అంటే సొమ్ముల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిందే..  పంట ఆరంభం నుంచి చివరి వరకూ అన్నదాతకు కష్టాలు తప్పడంలేదు. గతంలో అయితే పంట పండించడమే కష్టంగా ఉండేది.. దిగుబడి వస్తే దళారులు   వచ్చేవారు.. ధాన్యం తీసుకెళ్లిపోయేవారు.. ప్రస్తుతం పండించాలి.. ఆరబెట్టాలి.. తరువాత అమ్మాలి.. వాతావరణంలో మార్పు వస్తే నష్టపోవాలి.. ఇదంతా పడలేక.. ఆర్‌బీకేల చుట్టూ తిరగలేక నేటికీ రైతులు దళారుల బాటే పడుతున్నారు.. 


 (రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

 ఎప్పుడూ ఇంతే. హడావిడీ తప్ప. నిజంగా రైతును ఆదుకునే నాధుడేడి? ఇప్పటికే 80 శాతానికి పైగా వరికోతలు పూర్తయ్యాయి. ఆర్‌బీకేల ద్వారా ప్రతి ధాన్యపు గింజా కొంటామని ప్రభుత్వం ప్రకటించింది. దళారులను రానీయమని చెప్పింది. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజులకే రైతు బ్యాంక్‌ ఖాతాలో ధాన్యం సొమ్ము వేస్తామని చెప్పింది. ఏదీ! ఇంకా ధాన్యమే వేగంగా కొనడం లేదు.  కొన్న ధాన్యానికి ఇంత వరకూ పైసా కూడా ఇవ్వలేదు. రైతులు ధాన్యాన్ని కళ్లాల్లోనే ఉంచారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇంకా ధాన్యం రోడ్లపైనే ఆరబోసుకుంటున్నారు. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా ధాన్యం ఆరబోస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కానీ వాతావరణంలో మార్పులు వచ్చి, ఆకస్మికంగా వాన వస్తే ఏం చేయాలనే ఆందోళన రైతులు పీడిస్తుంది. ఇటీవల తుఫాన్‌ ప్రభావంతో కొంత దెబ్బతిన్న సంగతి తెలిసిందే. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.


ఇప్పటి వరకూ 1.5 లక్షల మెట్రిక్‌ టన్నులే కొనుగోలు


జిల్లాలో ఇప్పటి వరకూ కేవలం 1.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 5.32 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉంది. అందుకే ప్రభుత్వం  4.6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు  లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకూ  ఒక వంతు కూడా కొనుగోలు చేయలేదు. ఈ వారంలోనే మొత్తం రబీ మాసూళ్లు పూర్తవుతాయి. వెంటనే ధాన్యం కొనుగోలు చేస్తే అన్నదాతకు ఇబ్బందులు తీరతాయి. వాస్తవానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు జరుగుతున్నట్టు చెబుతున్నా దళారులే ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు. రైతులతో వాళ్లకే ఎక్కువ సంబంధాలు ఉం టున్నాయి. ఎందుకంటే ఆర్‌బీకేలకు వెళ్లినా మూడు నాలుగు సార్లు తిరగాల్సి వస్తోంది. అక్కడ తేమచూసే యంత్రాలు తప్ప ఇంకేమీ లేవు. ఇటీవల  కొంత వరకూ గన్నీబ్యాగులు ఏర్పాటు చేశారు. దీంతో దళారులనే ఆశ్రయిస్తున్నారు. 


ఇంకా రైతుకు పైసా కూడా ఇవ్వలేదు.


ఇప్పటి వరకూ జిల్లాలో  1.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం రైతు వద్ద నుంచి కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతు ఖాతాలో డబ్బు జమ చేయాలి. కానీ ఏదీ ఇంత వరకూ ఒక్క పైసా పడలేదు. ఇప్పటి వరకూ రూ.2.91 కోట్ల ధాన్యం బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. రైతు సాధారణంగా అప్పు చేసే వ్యవసాయం చేస్తాడు.ఎరువులు, పురుగుమందుల షాపుల వద్ద అప్పు ఉంటుంది. ధాన్యం దళారులు కూడా కొంత పెట్టుబడి కింద అప్పు ఇస్తారు.ఈ బాకీలన్నీ తీర్చా క మిగిలిందే రైతుకు... కొన్న ధాన్యానికి వెంటనే డబ్బులు ఇవ్వని విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. గతంలో మిల్లర్లు, కమీషన్‌దారులు కొనుగోలు చేసి,  కళ్లాల్లోనే డబ్బు ఇచ్చేవారు. కొంతకాలంగా ఈ విధానంలో మార్పు వచ్చి, రైతు కు వెంటనే డబ్బు అందని పరిస్థితి ఏర్పడింది.


15 రోజుల్లో కాల్వలకు నీరు


ఈసారి జూన్‌ 1నుంచి కాలువలకు నీరు వదలడానికి నిర్ణయించారు. అంటే  అప్పటి నుంచి ఖరీఫ్‌కు సిద్ధం కావాల్సి ఉంది. వ్యవసాయ అధికారులు జూన్‌ 15వ తేదీ నుంచి నారుమళ్లు వేసి, జూలై 15వ తేదీ నుంచి నాట్లు ప్రారంభిస్తామని చెబుతున్నారు. దీనికి సిద్ధం కావాలంటే రబీ ధాన్యానికి  డబ్బు వెం టనే ఇవ్వాలి కదా? ఖరీఫ్‌ పెట్టుబడితో పాటు రైతు కుటుంబ అవసరాలకు డబ్బు ఎలా వస్తుంది మరి. ఈ పరిస్థితుల్లో ధాన్యం మొత్తం కొనుగోలు చేసి, డబ్బు వెంటనే ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2022-05-16T06:42:23+05:30 IST