వరి జోరు

ABN , First Publish Date - 2021-07-28T06:05:16+05:30 IST

జిల్లాలో వరి నాట్లు జోరందుకున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, సాధారణ కంటే అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.

వరి జోరు
జిల్లాలో సాగవుతున్న వరి పంట

- జిల్లాలో ఊపందుకున్న వరి నాట్లు
- ఇప్పటి వరకు సాగైన వరి 1.56 లక్షల ఎకరాలు
- మరో లక్ష ఎకరాలకు పైగా సాగయ్యే అవకాశం
- విస్తారంగా ఆరుతడి పంటల సాగు
- జిల్లా వ్యాప్తంగా 3.59 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు
- సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదు
- నిండుకున్న ప్రాజెక్టులు.. అలుగు దూకుతున్న చెరువులు


కామారెడ్డి, జూలై 27(ఆంద్రజ్యోతి): జిల్లాలో వరి నాట్లు జోరందుకున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, సాధారణ కంటే అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఆయా ప్రాజెక్టులు చెరువుల కింద రైతులు విస్తారంగా పంటలను సాగు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో వరి పంట ప్రతీ ఏటా రైతులు లక్షల ఎకరాల్లోనే సాగు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే 1.56 లక్షల ఎకరాలలో వరి పంటను సాగు చేశారు. మరో లక్ష ఎకరాలకు పైగా వరి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి నాట్లు సైతం జోరందుకున్నాయి. వరితో పాటు ఆరుతడి పంటలను సైతం రైతులు ఇప్పటికే విస్తారంగా సాగు చేశారు. మొక్కజొన్న, సోయా, పత్తి, పప్పుదినుసు పంటలు సాగవుతున్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3.59 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి.
జిల్లాలో 3.59 లక్షల ఎకరాల్లో పంటల సాగు
కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గ పరిధిలో వానా కాలంలో 4.90లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో ఇప్పటి వరకు 3,59,635 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 2.42 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 1,56,558 ఎకరాల్లో సాగవుతోంది. పత్తి 70 వేల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 67,767 ఎకరాల్లో సాగయింది. సోయాబిన్‌ 55వేల ఎకరాలకు గాను 67,767, మొక్కజొన్న 50వేల ఎకరాలకు గాను 62,450 ఎకరాల్లో, కంది 35వేల ఎకరాలకు గాను 17,857 ఎకరాల్లో, పెసర్లు 18వేల ఎకరాలకు గాను 8,170 ఎకరాల్లో, మినుములు 11వేల ఎకరాలకు గాను 7,404 ఎకరాల్లో, చెరుకు 9వేల ఎకరాలకు గాను 4,641 ఎకరాల్లో సాగయ్యాయి.
సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదు
జిల్లాలో జూలై నెలలోనే సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. సెప్టెంబరు, అక్టోబరు నెలలో సాధారణ వర్షపాతానికి చేరుకునేది. కానీ ఈ సీజన్‌లో జూలైలోనే అత్యధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. ఇప్పటి వరకు జిల్లా సాధారణ వర్షపాతం 381.3 మి.మీ. వర్షపాతం కాగా ఇప్పటి వరకు 714.2 మి.మీ. వర్షపాతం కురిసింది. అనగా 87 శాతం అధికంగా వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు అత్యధిక వర్షపాతం నమోదైన మండలం గాంధారిలో 878 మి.మీ. వర్షం కురిసింది. బాన్సువాడలో 620 మి.మీ., లింగంపేటలో 606, తాడ్వాయిలో 599, పిట్లంలో 596, ఎల్లారెడ్డిలో 701, నాగిరెడ్డిపేటలో 701, బిచ్కుందలో 650, సదాశివనగర్‌లో 690, జుక్కల్‌లో 645, నిజాంసాగర్‌లో 737, భిక్కనూరులో 756, మద్నూర్‌లో 701, బీర్కూర్‌లో 809, దోమకొండలో 796, కామారెడ్డిలో 828, మాచారెడ్డిలో 821 మి.మీ.ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ రికార్డులు చెబుతున్నాయి.
జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులు, చెరువులు
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పలు ప్రాజెక్టులు పూర్తిగా నిండుకోవడంతో గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేశారు. సుమారు 1000కి పైగా చెరువులు నిండుకున్నాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువుల కింద వరి నాట్లను రైతులు జోరుగా వేస్తున్నారు. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌ నీటి పారుదలశాఖ డివిజన్‌ల పరిధిలో మొత్తం 2,167 చెరువులు ఉన్నాయి. ఇందులో 685 చెరువులు ఇప్పటికే పూర్తిగా నిండుకుని అలుగు దూకుతున్నాయి. 411 చెరువులు వందశాతం నిండాయి. 275 చెరువులు 75 శాతం, 593 చెరువులు 50 శాతం, 203 చెరువులు 25 శాతం నిండాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 2,716 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో 10.209 టీఎంసీలకు నీటి నిల్వలు చేరాయి. కౌలాస్‌నాలా ప్రాజెక్టు 1.199 టీఎంసీలలో నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు ఒక గేటు ఎత్తి 282 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోచారం ప్రాజెక్టులోకి 1,920 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో ప్రధాన కాలువ ద్వారా 80 క్యూసెక్కుల నీటిని ఆయకట్టు పంటలకు విడుదల చేస్తున్నారు. కళ్యాణి, సింగీతం రిజర్వాయర్‌లు సైతం నిండాయి.
వరి వైపే మొగ్గు
జిల్లా రైతులు ఈ సీజన్‌లోనూ వరి పంట సాగువైపే మొగ్గు చూపుతున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, ప్రాజెక్ట్‌లలో, చెరువుల్లోనూ నీటి నిల్వలు సమృద్ధిగా ఉండడం, భూ గర్భజలాలు సైతం ఆశాజనకంగా ఉండడంతో ఆరుతడి పంటల కంటే వరి సాగుపైనే రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ వర్షాకాలం సీజన్‌లో రెండు లక్షల ఎకరాలకు పైగా వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 1.56 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇప్పుడిప్పుడే వరినాట్లు జోరందుకోవడంతో వ్యవసాయశాఖ అంచనాలు మించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరి మరో లక్ష ఎకరాలకు పైగా సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో పత్తి పంట ఎక్కువగా సాగవుతుందని అంచనా వేసినప్పటికీ ఆ పంటపై రైతులు అంతగా ఆసక్తి చూపలేదు. సోయాబిన్‌ 40 వేల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా 67వేల ఎకరాల్లో సాగైంది. ఈ పంటలతో పాటు పప్పు దినుసు పంటలను సైతం రైతులు విస్తారంగానే సాగు చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో రైతులు వరి నాట్లు వేయడంలో బిజీ అయ్యారు.

Updated Date - 2021-07-28T06:05:16+05:30 IST