ధాన్యం.. దైన్యం..!

ABN , First Publish Date - 2021-05-10T04:32:04+05:30 IST

ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలను విక్రయించుకునేందుకు అన్నదాతలు ముప్పుతిప్పలు పడుతున్నారు. చేతికొచ్చిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లలేక.. కల్లాల్లో ఉంచుకోలేక యాతన అనుభవిస్తున్నారు.

ధాన్యం.. దైన్యం..!
వైరాలో రోడ్లపై ఉన్న ధాన్యం బస్తాలు,

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న నిల్వలు

మిల్లర్లకు రవాణా కాని పంట

మిల్లుల కేటాయింపులో నిర్లక్ష్యం 

అవస్థలు పడుతున్న అన్నదాతలు

ఖమ్మం కలెక్టరేట్‌, మే 9 : ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలను విక్రయించుకునేందుకు అన్నదాతలు ముప్పుతిప్పలు పడుతున్నారు. చేతికొచ్చిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లలేక.. కల్లాల్లో ఉంచుకోలేక యాతన అనుభవిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రైతులకు విక్రయ కష్టాలు తప్పడం లేదు. రైతుల ఇన్ని అగచాట్లు పడుతున్నా యంత్రాంగం  ఏమాత్రం పట్టించుకోవడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో యాసంగిలో 4లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. దీనికి తగిన విధంగా జిల్లాలో 445కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే జిల్లాలో 5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో మరి ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అవస్థలు పడుతున్నారు. అంతే కాదు ధాన్యం నిల్వలు వస్తున్నా ... కొనే వారు లేక రైతులు దైన్య స్థితిలో ఉన్నారు.

ఖమ్మం జిల్లాలో 260 కొనుగోలు కేంద్రాలు..

ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 260 కొనుగోలు కేంద్రాలే ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఏ గ్రేడ్‌ రకం 1,20,570.120 మెట్రిక్‌ టన్నులు, సాధారణ రకం 6,425.480 మెట్రిక్‌ టన్నులు.. మొత్తంగా 1,26,895.600 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే వీటిలో ఇప్పటి వరకు సీఎంఆర్‌ కోసం1,08,600.680 మెట్రిక్‌ టన్నుల పంటను మిల్లులకు తరలించగా.. ఇంకా 18,294.92 మెట్రిక్‌ టన్నుల నిల్వలు కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతున్నాయి. ఇలా కొనుగోలు చేసిన ధాన్యం రవాణా కాకపోతుండటంతో కొనుగోలు కేంద్రాల సిబ్బంది రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకోవడంలేదు. ధాన్యం దిగుబడులు వచ్చిన చోట్ల కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. దీంతో మిగిలిన రైతులు.. తమ ధాన్యాన్ని ఎక్కడ విక్రయించుకోవాలన్న సందిగ్ధంతో పాటు కనిపించిన అధికారులను ఆరా తీస్తున్నారు. తమ దగ్గర కొనుగోలు కేంద్రం లేక.. సమీప కేంద్రంలో విక్రయించుకోలేక ఆందోళనచెందుతున్నారు. 

రవాణా లేక అవస్థలు..

జిల్లాలో ధాన్యం దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లర్లకు తరలించడంలో అధికారుల విఫలమయ్యారన్నది స్పష్టమవుతోంది. జిల్లాలో 46 రారైస్‌ మిల్లులు, 8 పార్‌బాయిల్డ్‌ మిల్లులు ఉన్నాయి. వీటికి జిల్లాలో పండిన ధాన్యాన్ని కేవలం 8 పార్‌బాయిల్డ్‌ మిల్లులకు 60 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. వీటిలో ఇంకో మిల్లు యాజమాన్యం మిల్లింగ్‌కు ధాన్యాన్ని తీసుకోవడంలేదు. రా రైస్‌ మిల్లులకు 75 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు కేవలం 15వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే తీసుకున్నట్టు సమాచారం. ఇతర జిల్లాలైన నల్లగొండకు లక్ష మెట్రిక్‌ టన్నులు, కరీంనగర్‌కు 50వేల మెట్రిక్‌ టన్నులు, పెద్దపల్లికి మరో 50 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని కేటాయించారు. వీటిలో పెద్దపల్లిలో మాత్రమే మన జిల్లా ధాన్యాన్ని 15వేల మెట్రిక్‌ టన్నులు తీసుకున్నట్లు తెలిసింది. వారి జిల్లాకు చెందిన ధాన్యాన్ని తీసుకున్నాక మన జిల్లా ధాన్యాన్ని తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో మన ధాన్యంలోడ్లు ఇతర జిల్లాలో దిగుమతి కావడంలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. ఆ ప్రభావం జిల్లాలోని ధాన్యం సేకరణ ప్రక్రియపై పడుతోంది. ఫలితంగా రైతులు అవస్థలు పడుతున్నారు.  ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం సత్వర చర్యలు తీసుకుని ధాన్యం మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని సేకరించాలని కోరుతున్నారు.

రెండు, మూడు రోజుల్లో ఓ కొలిక్కి

సోములు, సివిల్‌సప్లయీస్‌ డీఎం 

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇతర జిల్లాలకు కేటాయించిన ధాన్యం  పంపించండంలో జాప్యం అవుతోంది. అక్కడి జిల్లా మిల్లర్లు మన ధాన్యాన్ని ఆలస్యంగా దిగుమతి చేసుకుంటున్నారు. దీని వల్లే సేకరణ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. త్వరలో ఇతర జిల్లాలకు మన ధాన్యాన్ని కేటాయించేలా కలెక్టర్‌, ఇతర అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. 

Updated Date - 2021-05-10T04:32:04+05:30 IST