పథకాలపై నిలదీత!

ABN , First Publish Date - 2022-05-22T06:45:17+05:30 IST

అమ్మఒడి రెండోవిడత రాలేదని జోగులపుట్టుకు చెందిన శెట్టి లక్ష్మి, కేడిల షర్మిల తల్లిదండ్రులు, జాబ్‌ కార్డులేక ఉపాధి దక్కలేదని కోడ పార్వతమ్మ, గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించలేదని మరికొందరు... గడప గడపకు మన ప్రభుత్వం పేరిట వచ్చిన ఎమ్మెల్యే కొట్టిగొళ్లి భాగ్యలక్ష్మిని నిలదీశారు.

పథకాలపై నిలదీత!
జోగులపుట్టు గ్రామంలో ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి చుక్కెదురు 

తూతూమంత్రంగా గడప గడపకు

జి.మాడుగుల, మే 21: అమ్మఒడి  రెండోవిడత రాలేదని జోగులపుట్టుకు చెందిన శెట్టి లక్ష్మి, కేడిల షర్మిల తల్లిదండ్రులు, జాబ్‌ కార్డులేక ఉపాధి దక్కలేదని కోడ పార్వతమ్మ, గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించలేదని మరికొందరు... గడప గడపకు మన ప్రభుత్వం పేరిట వచ్చిన ఎమ్మెల్యే కొట్టిగొళ్లి భాగ్యలక్ష్మిని నిలదీశారు. శనివారం ఆమె జి.మాడుగుల మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. బూసుపల్లిలో అమ్మఒడి రాలేదని బొనంగి పోతురాజు పడాల్‌, ఎన్‌టీఆర్‌ గృహానికి  మిగిలిన బిల్లులు అందలేదని కవడం కొత్తన్నదొర ప్రశ్నించారు.  రహదారి పనులు సగంలో నిలుపుదల చేశారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. వైబీ.గొందురులో ఎన్‌టీఆర్‌ గృహాలకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ప్రభుత్వం మారిన తరువాత బిల్లులు నిలుపుదల చేశారని ఎమ్మెల్యే ముందు వాపోయారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంతమందికి కొన్ని పథకాలు చేరలేదని, వాటిని అందించేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో మిగిలిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తూతూ మంత్రంగా ముగించారు. ఆరు గ్రామాల్లో పర్యటిస్తానని ప్రకటించినప్పటికీ కొన్ని గ్రామాల్లో పర్యటన అనంతరం, మిగిలిన వారిని ఒక చోటకు పిలిచి ప్రభుత్వ పథకాలపై వివరించారు. జి.మాడుగుల పంచాయతీ జోగులపుట్టు, బూసుపల్లి, వైబీ.గొందురు, జీఎం.కొత్తూరు గ్రామాల్లో గడపగడపకు కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే గాంధీనగర్‌, చుట్టుమెట్ట గ్రామాలకు వెళ్లలేదు. జోగులపుట్టు గ్రామంలో 40 కుటుంబాలకు, బూసుపల్లిలో 54, వైబీ.గొందూరులో 62 కుటుంబాలను సందర్శించిన ఆమె జీఎం.కొత్తూరు గ్రామంలో 155 కుటుంబాలుండగా 45 ఇళ్లను సందర్శించారు. బూసుపల్లిలో ఒక వీధికి వెళ్లకపోవడంతో అక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె.వెంకన్నబాబు, తహసీల్దార్‌ చిరంజీవిపడాల్‌, జీసీసీ మేనేజర్‌ బి.కొండన్న, ఈవోపీఆర్‌డీ రమేశ్‌, ఎపీఎం సుందరమ్మ, ఎస్‌ఐ శ్రీనివాస్‌, వైసీపీ నాయకులు జడ్పీటీసీ సభ్యురాలు ఎం.వెంకటలక్ష్మి, ఎం.గాయత్రిదేవి, కె.సత్యనారాయణ, గబ్బాడి సన్యాసిదొర, ఎన్‌ మత్స్యకొండంనాయుడు, ఎస్‌.రామక్రిష్ణ, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T06:45:17+05:30 IST