రైతు భరోసా కేంద్రాల్లోనే రబీ ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2021-04-18T06:01:22+05:30 IST

జిల్లాలో 21 మండలాల్లోని రైతుభరోసా కేంద్రాల్లోనే రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు జేసీ మాధవీలత తెలిపారు.

రైతు భరోసా కేంద్రాల్లోనే రబీ ధాన్యం కొనుగోలు

 విజయవాడ సిటీ, ఏప్రిల్‌ 17 : జిల్లాలో 21 మండలాల్లోని రైతుభరోసా కేంద్రాల్లోనే రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు జేసీ మాధవీలత తెలిపారు. రైతులు తమ సమీపంలోని కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యం విక్రయించుకుని మద్దతు ధర పొందాలన్నారు. తన క్యాంపు కార్యాలయం నుంచి శనివారం నిర్వహించిన డయల్‌ యువర్‌ జేసీ కార్యక్రమంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులతో ఆమె మాట్లాడారు. విజయవాడ డివిజన్‌లో చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, వత్సవాయి, వీరులపాడు, కంకిపాడు, విజయవాడ రూరల్‌ మండలాల్లోనూ, నూజివీడు డివిజన్‌లో ఏ.కొండూరు, చాట్రాయి, గంపలగూడెం, ముసునూరు, నూజివీడు, రెడ్డిగూడెం, తిరువూరు, గన్నవరం, విసన్నపేట మండలాల్లోని రైతుభరోసా కేంద్రాల్లోనూ రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఖరీఫ్‌ 2020-21 సంబంధించి రైతులు తమ పొలాల్లో ధాన్యాన్ని ఈ నెల 30లోగా కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలన్నారు. జిల్లాలో ఇంతవరకు 8.02 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించగా దీనిలో 9,341 మెట్రిక్‌ టన్నుల తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ఆన్‌లైన్‌ ద్వారా సేకరించినట్టు ఆమె చెప్పారు. ఇంతవరకు రూ.1475.64 కోట్లను రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశామన్నారు. జగ్గయ్యపేట మండలం పరిధిలోని భాస్కర రైస్‌మిల్‌, అనుమంచిపల్లిలో లక్ష్మీ గణేష్‌ రైస్‌మిల్లులపై కేసులు ఉన్నందున ధాన్యం కొనుగోలు చేసేందుకు సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ నుంచి వారికి అనుమతి లేదన్నారు. ఆ మిల్లులకు ధాన్యం ఇస్తే సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ ఎటువంటి బాధ్యత తీసుకోదని ఈ విషయాన్ని రైతులు గమనించించాలని ఆమె అన్నారు. సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ రాజ్యలక్ష్మీ పాల్గొన్నారు.



Updated Date - 2021-04-18T06:01:22+05:30 IST