రైతు ఘోష!

ABN , First Publish Date - 2022-07-02T05:53:49+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెలరోజులు గడిచినా గతేడాది ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తికాలేదు.

రైతు ఘోష!

కొన్న ధాన్యం బిల్లులు రూ.48 కోట్లు పెండింగు

ఆన్‌లైన్‌కాక కొనని ధాన్యం 80,270 టన్నులు

  ధర తగ్గించి కొనేందుకు రైతులతో మిల్లర్ల బేరాలు

 మళ్లీ సాగుకు పెట్టుబడిలేక రైతుల ఇక్కట్లు

 సాగు చేసినా ప్రభుత్వం కొంటుందో లేదోనని ఆందోళన

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెలరోజులు గడిచినా గతేడాది ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తికాలేదు. 80వేల టన్నుల ధాన్యం కొనకుండానే గత నెల 30వ తేదీన ప్రభుత్వం కొనుగోళ్లు ఆపేసి చేతులు దులుపుకుంది. ఆన్‌లైన్‌ కాకపోడంతో ఈ ధాన్యం మొత్తం మిల్లుల్లోనే మగ్గుతోంది. దీన్ని ‘క్యాష్‌’ చేసుకునేందుకు మిల్లర్లు రైతులతో బేరాలకు దిగుతున్నారు. నిల్వ ఉన్న ధాన్యం బస్తాకు రూ.200 తగ్గిస్తే కొంటామని షరతు పెడుతున్నారు. మరోపక్క కొన్న ధాన్యం బకాయి కూడా ప్రభుత్వం పెండింగులో పెట్టి రైతులకు చుక్కలు చూపిస్తోంది.  రూ.48కోట్ల దాకా చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. పండిన ధాన్యం అమ్ముడుపోక ... అమ్మిన ధాన్యానికి డబ్బులు రాక.. మళ్లీ సాగుచేస్తే ప్రభుత్వం కొంటుందోలేదోనని  రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

 గత ఖరీఫ్‌ సీజన్‌లో ఈ-క్రాప్‌ నమోదు సక్రమంగా నమోదుకాకపోవడంతో రైతులు ధాన్యాన్ని సకాలంలో విక్రయించుకో లేకపోయారు. ఈ-క్రాప్‌లో వివరాలు సక్రమంగా నమోదు కాలేదని, సరిచేయాలని రైతులు వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ నెలల తరబడి తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు పలు మండలాలకు చెందిన రైతులు కలెక్టర్‌ ను కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. దీంతో గత కలెక్టర్‌ ఈ-క్రాప్‌లో వివరాలు సక్రమంగా నమోదుకాని ధాన్యాన్ని మిగులు ధాన్యంగా చూపి రబీ సీజన్‌లో కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఘంటసాల, బందరు, అవనిగడ్డ, కోడూరు గుడ్లవల్లేరు, పామర్రు తదితర మండలాల్లోని 8వేల మంది రైతులకు ఈ-క్రాప్‌ వివరాలు నమోదు కాలేదని, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ్యవసాయశాఖ అధికారులు పౌరసరఫరాలశాఖకు నివేదిక పంపారు. జిల్లాలో ఆయా మండలాలకు చెందిన రైతుల నుంచి 1.64 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని లెక్కలు తేల్చారు. దీంతో పాటు ఈ ఏడాది రబీ సీజన్‌లో పండించిన 19వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ మొత్తంలో  గతనెల 30వ తేదీ వరకు ఖరీఫ్‌, రబీ సీజన్‌లకు చెందిన 80,270 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. సుమారుగా ఇంకో 80 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ ధాన్యం కొనుగోలు చేస్తారా, లేక లెక్క సరిపెడతారా అనేది వేచిచూడాలి. 

 ధర తగ్గించేందుకు మిల్లర్ల యత్నం

గత ఖరీఫ్‌ సీజన్‌లో సాగుచేసిన బీపీటీ 2231 రకం, ఈ ఏడాది రబీ సీజన్‌లో సాగు చేసిన 1010 రకం ధాన్యం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ తరహా ధాన్యం మిల్లర్ల వద్ద అనధికారికంగా ఉంది. రైతులు తాము ధాన్యం విక్రయించేశామనే భ్రమలో ఉన్నారు. ఈ-క్రాప్‌లో వివరాలు నమోదు చేయడానికి వీలులేని ఈ తరహా ధాన్యాన్ని బస్తాకు రూ.200 చొప్పున ధర తగ్గించి చెల్లిస్తామని మిల్లర్లు బేరాలకు దిగుతున్నారు. 

ధాన్యం బకాయి రూ.48 కోట్లు 

 ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఖరీఫ్‌, రబీ ధాన్యం 80,270 టన్నులు కొనుగోలు చేశారు. జూన్‌ 11వ తేదీ వరకు ధాన్యం బిల్లులను రైతుల ఖాతాల్లో జమచేశారు. ఈ బిల్లులు కూడా రూ.2.50 లక్షలలోపు ఉంటేనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. రూ.3లక్షలు, అంతకు మించి ధాన్యం బిల్లులు ఉంటే నగదు రైతుల ఖాతాల్లో జమకావడం లేదు. ఈ విషయాన్ని పౌరసరఫరాలశాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. ఇంకా రైతులకు రూ.48 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నగదు ఎప్పటికి రైతుల ఖాతాల్లో జమ అవుతుందో తెలియని స్థితి నెలకొంది. ధాన్యం విక్రయించినట్లుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసిన 51 రోజులకుగానీ రైతుల ఖాతాల్లో నగదు జమ కావడంలేదు. ఈలోగా ఖరీఫ్‌ సీజన్‌లో వరినాట్లు పూర్తయి పైరు కలుపు తీసే దశకు చేరుకుంటుందని రైతులు చెబుతున్నారు. 

 మూడ్రోజుల్లో బకాయిలు చెల్లిస్తాం

  జిల్లాలో ఈ సీజన్‌లో 80,270 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. జూన్‌ 11వ తేదీ వరకు బిల్లులు చెల్లించాం. ఇంకా  రూ.48 కోట్లు ఇవ్వాల్సి ఉంది. పెద్ద మొత్తంలో బిల్లులున్న రైతులకు నగదు జమచేయడంలో కొంత జాప్యం జరిగింది.  రెండు, మూడు రోజుల్లో బిల్లుల చెల్లిస్తాం. 

- శ్రీధర్‌, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజరు


Updated Date - 2022-07-02T05:53:49+05:30 IST