పద్మావతి నిలయం కాంట్రాక్టరు, ఆర్బిట్రేటర్‌ అరెస్టు

Jun 17 2021 @ 01:44AM

-రిమాండ్‌ తిరస్కరించి విడుదలకు ఆదేశించిన కోర్టు

-భవన నిర్మాణ బిల్లులు చెల్లించని టీటీడీ

-47 నెలల జాప్యంతో రూ. 75 కోట్ల నుంచీ 

రూ. 120 కోట్లకు పెరిగిన వ్యయం

-ఆర్బిట్రేటర్‌ను ఆశ్రయించిన కాంట్రాక్టర్‌

-వడ్డీలు కలిపి రూ. 227 కోట్లు చెల్లించాల్సి 

వస్తుందని టీటీడీకి ఆర్బిట్రేటర్‌ లేఖ

-బిల్లులు చెల్లించకపోగా ఎదురు కేసు పెట్టిన టీటీడీ

 

తిరుపతి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): తిరుచానూరు సమీపంలో టీటీడీకి చెందిన పద్మావతీ నిలయం భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టరుకు, అతడికి బిల్లుల చెల్లింపుల విషయంలో మధ్యవర్తిత్వం నెరపిన ఆర్బిట్రేటర్‌కు టీటీడీ నుంచీ చేదు అనుభవం ఎదురైంది. టీటీడీ బిల్లులు చెల్లించకపోగా వారిపై పెట్టిన ఎదురు కేసులో వారిద్దరూ అరెస్టయ్యారు. అయితే వారిని రిమాండుకు తరలించేందుకు తిరుపతి 5వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు తిరస్కరించింది. వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి ప్రాఽధమికంగా అందిన సమాచారం, అలాగే కాంట్రాక్టరు కథనం మేరకు వివరాలిలా.....యాత్రికుల కోసం తిరుచానూరు సమీపంలో పద్మావతీ నిలయం పేరిట బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు 2014లో టీటీడీ  టెండర్లు పిలించింది. అంచనా వ్యయం సుమారు రూ. 75 కోట్లు. విశాఖకు చెందిన ఎం.నాగిరెడ్డి అండ్‌ కో సంస్థ టెండర్లు దక్కించుకుంది. 18 నెలల్లో నిర్మాణం పూర్తి కావాల్సి వుండగా టీటీడీ ఇంజనీరింగ్‌ ఽవిభాగం నుంచీ తగిన సహకారం అందకపోవడంతో అసాధారణ జాప్యం జరిగింది. 65 నెలలకు గానీ నిర్మాణం పూర్తి కాలేదు. 2012 నాటి ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం అంచనాలు రూపొందించినందున నిర్మాణం పూర్తయ్యేసరికి కాంట్రాక్టరుకు నిర్మాణ వ్యయం బాగా పెరిగింది. దీనిపై అంచనా వ్యయం పెంచాలని పలుమార్లు టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగాన్ని కోరినా స్పందించలేదు. దానికి తోడు 2019లో నిర్మాణం పూర్తయ్యాక కూడా బిల్లులు చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టరు వెంకట్రమణారెడ్డి గతేడాది సెప్టెంబరులో విశాఖకే చెందిన సోల్‌ ఆర్బిట్రేటర్‌ (మెంబర్‌, కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్బిట్రేషన్‌) ఎం.జగన్మోహనరావును ఆర్బిట్రేటర్‌గా నియమించుకున్నారు. తనకు టీటీడీ నుంచీ బిల్లుల చెల్లింపు జరిగేలా చూడాలని అభ్యర్థించారు. దీనిపై ఆర్బిట్రేటర్‌ నోటీసులు జారీ చేయగా టీటీడీ స్పందించలేదు. అయినా ఆర్బిట్రేటర్‌ ప్రతి సిట్టింగ్‌కు సంబంధించి జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు టీటీడీకి లేఖలు రాస్తూ, తమ మినిట్స్‌ తెలియపరుస్తూ వచ్చారు. కాంట్రాక్టరుకు అసలు కింద రూ. 120 కోట్లు, వడ్డీలు, తన ఛార్జీలు, ఇతరత్రా అంశాలతో కలిపి మొత్తం రూ. 227 కోట్లు చెల్లించాల్సి వుందని ఆర్బిట్రేటర్‌ గతేడాది డిసెంబరులో టీటీడీకి లేఖ రాశారు. దీనిపై టీటీడీ తిరుపతిలోని 4వ అదనపు జిల్లా కోర్టులో కేసు వేసింది. ఆర్బిట్రేటర్‌ నియామకమే చెల్లదని, ఆర్బిట్రేటర్‌ ఈ విషయంలో ముందుకు వెళ్ళకుండా నిరోధించేలా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే కోర్టు ఈ నెల 11వ తేదీన టీటీడీ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.అయితే కోర్టు నుంచీ రానున్న ఉత్తర్వుల గురించి ముందుగానే అప్రమత్తమైన టీటీడీ  గత నెల 25వ తేదీన తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌లో కాంట్రాక్టర్‌ వెంకట్రమణారెడ్డి, ఆర్బిట్రేటర్‌ జగన్మోహన్‌రావులపై క్రిమినల్‌ కేసు పెట్టాలని ఫిర్యాదు చేసింది. అగ్రిమెంట్‌ ప్రకారం రూ. 50 వేలకు పైబడిన బిల్లుల విషయంలో ఏవైనా వివాదాలుంటే సివిల్‌ కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సివుండగా దానికి విరుద్ధంగా ఆర్బిట్రేషన్‌కు వెళ్ళారని ఫిర్యాదులో పేర్కొంది. వీరిద్దరూ కుమ్మక్కై టీటీడీ నిధులు కాజేయాలని ప్రయత్నిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. దీని ఆధారంగా తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం తిరుచానూరు పోలీసులు విశాఖ చేరుకుని అక్కడి పోలీసుల సహకారంతో కాంట్రాక్టరును, ఆర్బిట్రేటర్‌ను అరెస్టు చేసి తిరుపతికి తరలించారు. బుధవారం సాయంత్రం వీరిని తిరుపతిలోని 5వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్‌ సింధూర రిమాండ్‌ విధించేందుకు తిరస్కరించారు.వారిని విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు. 


ఆర్బిట్రేటర్‌ పట్ల దురుసుగా వ్యవహరించిన పోలీసులు

 విశాఖపట్టణంలో ఆర్బిట్రేటర్‌ జగన్మోహన్‌రావును అరెస్టు చేసే సమయంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ కాంట్రాక్టరు వెంకట్రమణారెడ్డి ఆరోపించారు. బుధవారం రాత్రి ఆయన ఆంధ్రజ్యోతితో ఫోన్‌లో మాట్లాడారు. జగన్మోహన్‌రావు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆయన కుమారుడిపై చేయి చేసుకున్నారని, అంతేకాకుండా ఆర్బిట్రేటర్‌ను చొక్కా పట్టుకుని లాక్కెళ్ళి వాహనంలోకి ఎక్కించారని ఆరోపించారు. తిరుచానూరు పోలీసుల పరిధిలోకి ఈ కేసు రాదని ఆయన స్పష్టం చేశారు. టీటీడీతో అగ్రిమెంటు కుదుర్చుకున్నది దేవస్థానం పరిపాలనా భవనంలోనని, అయితే ఎక్కడో తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో కేసు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు. పద్మావతీ నిలయం భవన నిర్మాణం విషయంలో టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగం సహకరించలేదని, వారి తీరుతోనే పనులు చాలా ఆలస్యంగా జరిగి, అంచనా వ్యయం అమితంగా పెరిగిందని ఆరోపించారు. ఆర్బిట్రేటర్‌పై కేసు పెట్టి అరెస్టు చేయించడం ఇంతవరకూ దేశంలో ఎక్కడా జరిగివుండదని ఆయన అభిప్రాయపడ్డారు. టీటీడీ ఒత్తిడితోనే పోలీసులు దురుసుగా, అక్రమంగా వ్యవహరించారని ఆరోపించారు. టీటీడీ వ్యవహరించిన తీరు సక్రమంగా లేనందునే టీటీడీ అధికారులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ డిస్మిస్‌ అయిందని వివరించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.