Advertisement

పెరుగుతున్నపంట నష్టం

Nov 29 2020 @ 00:55AM
చినపాచిలలో తుఫాన్‌ గాలులకు నేలకొరిగిన వరి చేను

కన్నీరు పెడుతున్న రైతాంగం

వారం నుంచి కురుస్తున్న వర్షాలు

తడిసిన వరి పనల నుంచి మొలకలు

ఆరబెట్టుకోవడానికి అవకాశం ఇవ్వని వానలు

మరో మూడు రోజులు వానలు 

వాతావరణ శాఖ ప్రకటనతో

వరిపై ఆశలు వదులుకున్న రైతులు

ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న అన్నదాతలు

నేటి నుంచి పంట నష్టం అంచనాలు


వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరి పంట నష్టాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది వరి పంట పండిందని సంబరపడ్డ రైతన్నను నివర్‌ తుఫాన్‌ వర్షాలు ముంచేశాయి. గత ఆదివారం ప్రారంభమైన వర్షాలు ఇంకా కొనసాగుతుండడంతో అన్నదాతలు వరి పంటపై ఆశలు వదులుకుంటున్నారు. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన వారిని కుంగదీశాయి. 


బుచ్చెయ్యపేట/రావికమతం/మాడుగుల రూరల్‌, నవంబరు 28: రైతులు ఆరు గాలంగా శ్రమించి పండించిన వరి పంట నీటపాలైంది. కోసిన వరి చేలన్నీ ఇంకా నీటిముంపులోనే ఉండడంతో ఏ మడిలో చూసినా వరి పనలు మొలకొచ్చేయడంతో రైతులు భోరుమంటున్నారు. వర్షాలకు వరి పనలు నీట మునగడంతో కాలువలు చేసి, పనలు పొలం గట్లపై ఆరేసి పంటను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాలువల ద్వారా నీటిని పొలం నుంచి బయటకు పంపుతుంటే అదేరోజు కురిసిన వర్షపు నీటిలో నానిన వరి పంట మొలకలు వస్తున్నాయి. మరోవైపు గింజ కట్టే వరి నేలకొరిగి పొల్లు గింజలుగా మారే ప్రమాదం ఉండడంతో రైతులు వరిపై పూర్తిగా ఆశలు వదలుకుంటున్నారు. ఇప్పటికే తడిసిన వరి పనలపై ఉప్పు నీళ్లు చల్లినా తుఫాన్‌ వర్షాలకు బాగా నాని వరి మొలకలు వస్తున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు. పండిన పంట అంతా చేతికందే సమయంలో తుఫాన్‌ వర్షాలు కొంపముంచాయని రైతులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లిస్తేనే కాస్త ఊరట ఉంటుందని.. లేకుంటే అప్పుల్లో కూరుకుపోవడం ఖాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రావికమతం మండలంలో 2500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే కోసిన వెయ్యి ఎకరాల్లోను, కోతకు సిద్ధంగా ఉన్న మరో 1500 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. మండలంలో కొమిర, మత్స్యపురం, చినపాచిల, గుమ్మళ్లపాడు, రావికమతం, మట్టవానిపాలెం, గుడివాడ, తదితర గ్రామాల్లో వరి పంట పూర్తిగా పాడయ్యింది. 

 మాడుగుల మండలంలో 1300 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని రైతులు అంటున్నారు. మాడుగుల మండలంలోని గొటివాడ అగ్రహారం, వీరవిల్లి అగ్రహారం, వీరనారాయణం,  కోటపాడు, మాడుగుల, కేజేపురం, కోడూరు తదితర గ్రామాల్లో వర్షాలకు తడిచిన వరి పంటను నూర్పిడి యంత్రాలతో నూర్పు చేస్తున్నారు. తడిచిన పనలను నూర్పు చేస్తుండడంతో ఽనానిపోయిన  ధాన్యం గింజలు వస్తున్నాయి. అవీ కూడా ఎంతమేరకు పనికొస్తాయో? లేదో? చెప్పలేమని రైతులు నిట్టూరుస్తున్నారు. 

బుచ్చెయ్యపేట మండలంలో 2500 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. నివర్‌ తుఫాన్‌ వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను శనివారం అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు  శాస్త్రవేత్తలు ఆదిలక్ష్మి, కుమారి, ఆత్మ పీడీ  త్రినాథ్‌స్వామి పరిశీలించారు. మండలంలోని పొట్టిదొరపాలెం, కోమళ్లపూడి, గంటికొర్లాం, తదితర గ్రామాల్లో నీట మునిగిన వరి పనలు, నీటిలోనే ఉన్న వరి పంటను పరిశీలించారు. నీట మునిగిన వరి పనలపై 50 శాతం ఉప్పు ద్రావణం పిచ్చికారి చేయాలని సూచించారు.

నేటి నుంచి పంట నష్టాల గుర్తింపు

అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంట నష్టాలను ఆదివారం నుంచి వీఏఏలు గుర్తించనున్నట్టు బుచ్చెయ్యపేట వ్యవసాయాధికారి రామ్‌ప్రసాద్‌ తెలిపారు. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.