ధాన్యం రైతుల అరిగోస

Jun 11 2021 @ 23:24PM
తమ ధాన్యం బస్తాలను తరలించాలని దండం పెడుతూ వేడుకుంటున్న సిరిపురంలోని పేదరైతులు

 వర్షానికి తడిసి పంట 

 తరలించాలని అన్నదాతల విజ్ఞప్తి


వైరా, జూన్‌ 11: వైరా మండలంలోని ధాన్యం రైతుల హరిఘోషను పట్టించుకొనే నాథుడే కరువయ్యారు. ముఖ్యంగా సిరిపురం గ్రామంలోని దళిత పేద రైతులు ఆందోళన వర్ణనాతీతంగా ఉంది. గురువారం రాత్రి కురిసిన వర్షంతో పేద రైతులకు చెందిన ధాన్యం బస్తాల లాట్ల కిందకు వర్షపునీరు చేరటంతో రైతులు కన్నీళ్లపర్వంతమయ్యారు. సిరిపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేశారు. నెలరోజుల కిందట కాంటా వేసిన ధాన్యం బస్తాలను నేటికీ తరలించలేదు. దాంతో సన్న, చిన్నకారు రైతులుకాంటా వేసిన బస్తాలను రోడ్లపైనే లాట్లు వేసి పరదాపట్టాలు కప్పుకున్నారు. ఎన్నిరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ వర్షం కురిసిన ప్రతి సందర్భంలో నీళ్లు ధాన్యం బస్తాల అడుగుభాగంలోకి వెళ్లి తడిసిపోతున్నాయి.


గురువారం రాత్రి కూడా మళ్ళీ వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో పేదరైతులంతా రోడ్లుపైకి చేరుకొని బోరున విలపించారు. అధికారులారా మాకు న్యాయం చేయండని రెండు చేతులు జోడించి వేడుకున్నారు. సన్న, చిన్నకారు రైతులతోపాటు కౌలురైతులు కూడా కన్నీళ్లపర్వంతమయ్యారు. సిరిపురంతోపాటు వైరా వ్యవసాయ మార్కెట్‌యార్డులో అలాగే పూసలపాడు, గన్నవరం మరికొన్ని గ్రామాల్లో కూడా ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం బస్తాలు తరలించాలని సిరిపురం రైతులు వేడుకుంటున్నారు.


Follow Us on: