పంచాయతీ స్థలంలో పాగా

ABN , First Publish Date - 2021-10-26T05:33:41+05:30 IST

ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కొందరు అధికార పార్టీ నాయకులు కబ్జా చేసేస్తున్నారు.

పంచాయతీ స్థలంలో పాగా
గ్రామ పంచాయతీ ముందు ఆక్రమణలకు గురవుతున్న స్థలం ఇదే

దర్జాగా కబ్జా చేసిన వైసీపీ నాయకుడు


ఆదోని రూరల్‌, అక్టోబరు 25: ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కొందరు అధికార పార్టీ నాయకులు కబ్జా చేసేస్తున్నారు. అది పొరంబోకు స్థలమైనా, పంచాయతీ స్థలమైనా వారి అధీనంలోకి వెళ్లాల్సిందే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇస్వి గ్రామంలో పంచాయతీ స్థలాలు చాలామేరకు కబ్జా అయ్యాయి. తాజాగా పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న విలువైన స్థలాన్ని ఆక్రమించాడు గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి. పంచాయతీ స్థలంలో పునాదులు వేయడంతో ఏకంగా పెద్ద బంకుని అక్కడ తెచ్చి పెట్టేశాడు. ఆ స్థలాన్ని ఆక్రమిస్తున్న విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యాదర్శి, సిబ్బంది గత శనివారం అడ్డుకున్నారు. అయినా ఆ వ్యక్తి వినడం లేదు. తమ ప్రభుత్వంలో తమకే అడ్డు చెబుతారా..? అని అధికారుల మాటలను లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నాడు. గ్రామస్థులు సైతం అతని చర్యలను వ్యతిరేకిస్తున్నా పట్టించుకోవడం లేదు. తాను బంకు తీసేయాలంటే గ్రామంలోని పంచాయతీ స్థలాల్లో మిగిలినవారు ఏర్పాటు చేసుకున్న బంకులను కూడా తీసేయాలని వాదిస్తున్నాడు. 


వినడం లేదు..

పంచాయతీ స్థలంలో గ్రామానికి చెందిన శివారెడ్డి బంకు ఏర్పాటు చేయడానికి పునాదులు వేస్తున్నాడని సమాచారం వచ్చింది. అప్పటికే ఆ స్థలంలో బంకు తెచ్చి పెట్టాడు. వెంటనే తమ సచివాలయ సిబ్బందిని పంపి అడ్డుకున్నాం. అయినా వినడం లేదు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డుకుంటాం. 


- వేణుగోపాల్‌ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, ఇస్వి

Updated Date - 2021-10-26T05:33:41+05:30 IST