ప్రభుత్వ భూమిలో పాగా

ABN , First Publish Date - 2021-07-21T05:40:47+05:30 IST

కల్లూరు మండలంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి.

ప్రభుత్వ భూమిలో పాగా
వామసముద్రం సర్వే నెంబరు 86లో చదును చేసిన భూమి

  1. వామసముద్రంలో భూ ఆక్రమణలు
  2. 58 ఎకరాలలో తిష్ఠవేసిన నాయకులు


కల్లూరు, జూలై 20:
కల్లూరు మండలంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. తడకనపల్లె మజరా వామసముద్రం పరిధిలో సర్వే నెంబరు 86లో దాదాపు 338 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ భూ పంపిణీలో భాగంగా 130 ఎకరాలను పేదలకు డి-పట్టాలు ఇచ్చారు. ఇటీవల జగనన్న హౌసింగ్‌ కాలనీలకు అధికారులు 150 ఎకరాలు కేటా యించారని సమాచారం. మిగిలిన ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించారు. ప్రభుత్వ భూమిని కొందరు నాయకులు సాగు చేసుకుంటున్నారని స్థానికులు అంటున్నారు. నగర శివారులో భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో కొందరు బడాబాబులు వామసముద్రం భూములపై  కన్నేశారు. అధికారుల సహకారంతో వాటిని దక్కించుకు నేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొండ ప్రాంతాల్లో బండరాళ్లను తొలగించి భూములు సాగు చేస్తున్నారు.

అధికారులకు పట్టదా..?
సర్వే నెంబరు 86లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనా అధికారుల్లో చలనం కనిపించడం లేదు. గతంలో తడకనపల్లె వీఆర్వోలుగా పని చేసిన కొందరు తమ బంధువుల పేరిట ప్రభుత్వ భూములను రికార్డుల్లోకి ఎక్కించి సాగు చేసుకుంటున్నారని తెలిసింది. రెవెన్యూ సిబ్బందే పలువురిని ప్రోత్సహించి భూమిని సాగు చేయించినట్లు సమాచారం. మామూళ్లు పుచ్చుకుని వారి పేరిట పాసు పుస్తకాలు మంజూరు చేశారని స్థానికులు అంటున్నారు. సర్వే నెంబరు 86లో భూమి హక్కు పొందేందుకు కొందరు కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నారని సమాచారం. సర్వే నెంబరు 86లో దాదాపు 58 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు విశ్వసనీయ సమాచారం. అధికారుల అండదండలతో పలుకుబడి ఉన్న నాయకులు ఏకంగా 20 ఎకరాల మేర సాగు చేసుకంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ కారణంగా గ్రామంలో భూ వివాదాలు తలెత్తుతున్నాయి. అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని  ప్రజలు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం..
వామసముద్రం సర్వే నెంబరు 86లో భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం. ఇటీవల కొన్ని ఆక్రమణలు నా దృష్టికి వచ్చాయి. రెవెన్యూ సిబ్బంది ద్వారా వివరాలు సేకరించి పరిశీలిస్తాం. ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం.
      - టీవీ రమేష్‌బాబు, కల్లూరు తహసీల్దార్‌

Updated Date - 2021-07-21T05:40:47+05:30 IST