పైడిగాం.. దయనీయం!

ABN , First Publish Date - 2021-05-27T04:50:54+05:30 IST

-మహేంద్రతనయ నదిపై సుమారు ఆరు దశాబ్దాల కిందట నిర్మించిన పైడిగాం ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది. తితలీ తుపాను ప్రభావంతో ఈ ప్రాజెక్ట్‌ ఆనవాళ్లు కోల్పోయింది. ప్రధాన విభాగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో మూడేళ్లుగా ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోతోంది. ప్రాజెక్ట్‌ ప్రారంభ సమయంలో పదివేల ఎకరాలకు సాగునీరేందేది. ప్రస్తుతం ఐదువేల ఎకరాల ఆయకట్టును ఆదుకోవడం గగనంగా మారింది. ఆధునీకరించడం ద్వారా పూర్వవైభవం తేవచ్చునని అధికారులు చెబుతున్నా,

పైడిగాం.. దయనీయం!
పైడిగాం చానల్‌


తితలీతో కొట్టుకుపోయిన ప్రధాన చానల్‌

 ప్రాజెక్ట్‌కు పైసా విదల్చని ప్రభుత్వం

పదివేల ఎకరాల సాగు ప్రశ్నార్థకం

(సోంపేట రూరల్‌)

‘పైడిగాం ప్రాజెక్ట్‌ ఆధునికీకరణ పనులు చేయిస్తాం. రైతులు రెండు పంటలు వేసుకునేలా జలాశయాన్ని తీర్చిదిద్దుతాం. ఖరీఫ్‌, రబీ సీజన్లలో పుష్కలంగా సాగునీరందిస్తాం’ అంటూ ఏటా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇస్తున్న హామీ కార్యరూపం దాల్చడం లేదు. మరోవైపు ఎగువన ఒడిశా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంతో మహేంద్రతనయ నదిలో నీటి లభ్యత లేదు. వరద నీరే దిక్కవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్ట్‌ను లడ్డగుడ్డి వద్ద నిర్మిస్తే చీకటి గెడ్డ, ఘాటీ గెడ్డ, కళింగదళ్‌ రిజర్వాయర్‌ మిగులు నీరు చేరి ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుందని అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో మూడు మండలాల్లో పదివేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకమవుతోంది. 

-మహేంద్రతనయ నదిపై సుమారు ఆరు దశాబ్దాల కిందట నిర్మించిన పైడిగాం ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది. తితలీ తుపాను ప్రభావంతో ఈ ప్రాజెక్ట్‌ ఆనవాళ్లు కోల్పోయింది. ప్రధాన విభాగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో మూడేళ్లుగా ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోతోంది. ప్రాజెక్ట్‌ ప్రారంభ సమయంలో పదివేల ఎకరాలకు సాగునీరేందేది. ప్రస్తుతం ఐదువేల ఎకరాల ఆయకట్టును ఆదుకోవడం గగనంగా మారింది. ఆధునీకరించడం ద్వారా పూర్వవైభవం తేవచ్చునని అధికారులు చెబుతున్నా, ప్రభుత్వం పైసా విదల్చడం లేదు. దీంతో సోంపేట, కంచిలి, మందస మండలాల్లోని 34 గ్రామాల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. సోంపేట మండలం మాలగోవిందపురం పంచాయతీ బాతుపురం- కొత్త బాతుపురం గ్రామాల మధ్య 1963లో మహేంద్రతనయ నదిపై పైడిగాం ప్రాజెక్ట్‌ను నిర్మించారు. నదిలో 185 క్యూసెక్కుల నీటి లభ్యతతో పది వేల ఎకరాలకు నిరాటంకంగా సాగునీరు అందించేది. తరువాత ఎగువన ఉన్న ఒడిశాలోని పురియాసాయి వద్ద 1985లో ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. నదిలో 50 క్యూసెక్కులకు మించి నీటి లభ్యత ఉండడం లేదు. కేవలం వరద నీరు వచ్చినప్పుడు కొంత మొత్తం నిల్వచేసి ఖరీఫ్‌నకు అందిస్తూ వస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రాజెక్ట్‌ నిర్వహణను గాలికొదిలేశాయి. అరకొర నిధులే విదిల్చాయి. 1999లో టీడీపీ ప్రభుత్వం రూ.1.30 కోట్లు విడుదల చేసింది. 2014లో మరోసారి రూ.9.75 కోట్లు మంజూరు చేయడంతో ప్రాజెక్ట్‌ గోడలు, దిగువ భాగంలో కాంక్రీట్‌ పనులు, కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టారు. 2018లో తితలీ తుపానుతో ప్రాజెక్ట్‌ పూర్తిగా దెబ్బతింది. కాంక్రీట్‌ నిర్మాణాలు, చప్టా, గోడలు కొట్టుకుపోయాయి. కనీస నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. అటు తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏడాది కిందట ప్రాజెక్ట్‌ను పరిశీలించిన కలెక్టర్‌ నివాస్‌ చలించిపోయారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.20 లక్షలు మంజూరు చేశారు. ప్రాజెక్ట్‌ తీరును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేదు సరికదా కేటాయింపులు కూడా లేవు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కాలువ పరీవాహక గ్రామాల్లో పనులు చేపట్టాలని ఆదేశాలిచ్చినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ ఎక్కడా పనులు మాత్రం చేపట్టడం లేదు.


సాగునీరు అంతంతే..

సోంపేట. కంచిలి, మందస మండలాల పరిధిలో 34 పంచాయతీలకు ప్రాజెక్ట్‌ ద్వారా సాగునీరు అందుతోంది. సోంపేట మండలంలోని వూలగోవిందపురం, పైడిగాం, హంసమొర, సుంకిడి, విక్రంపురం, బుషాభద్ర, మాకన్నపురం, పొత్రఖండ, బేసిరామచంద్రపురం, కర్తలిపాలెం, పాలవలస, కొర్లాం, పలాసపురం, సోంపేట, జింకిభద్ర తదితర గ్రామాల్లో 3950 ఎకరాలకు, కంచిలి మండలంలోని శాసనాం, జె.నారాయణపురం, ఉప్పరపేట, చొట్రాయిపురం, గోకర్ణపురం, పోటిగుడ్డి, మధుపురం, బూరగాం తదితర గ్రామాల్లో 800 ఎకరాలకు, మందస మండలం పొత్తంగి పరిధిలో 250 ఎకరాలకు ప్రస్తుతం సాగునీరు అందుతోంది. 


దిగువ ప్రాంతంలో నిర్మిస్తే మేలు

ఇప్పుడున్న చోట కాకుంటే దిగువ ప్రాంతంలో ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపడితే అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బాతుపురం వద్ద ప్రాజెక్ట్‌ ఉంది. దీనిని మూడు కిలోమీటర్ల దిగువన ఉన్న లడ్డగుడ్డి వద్ద నిర్మిస్తే చీకటిగెడ్డ, ఘాటిగెడ్డ, కళింగదళ్‌ రిజర్వాయర్‌ మిగులు నీరు చేరుతుంది. మహేంద్రతనయ నది ద్వారా చేరే 50 క్యూసెక్కుల నీటితో కలిపి ఆయకట్టు పరిధిలో ఖరీఫ్‌, రబీకి అవసరమయ్యే నీరు అందించవచ్చు. తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్‌ ఆధునికీకరణ చేపట్టవచ్చని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా నిధులు కేటాయించకపోవడంతో ఈ ప్రాజెక్టుకు మోక్షం కలగడం లేదు. అధికారులు ఇప్పటికైనా ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. 


ప్రభుత్వం దృష్టిపెట్టాలి

పైడిగాం ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. తితలీ తుపానుతో జలాశయం దారుణంగా దెబ్బతింది. ప్రధాన ఛానెల్‌ కొట్టుకుపోయింది. మూడేళ్లుగా ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దిగువ ప్రాంతంలో ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపడితే బాగుంటుంది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలి. 

-బుద్దాన లోకనాథం, ఆయకట్టు రైతు, బేసిరామచంద్రపురం


ప్రతిపాదనలు పంపాం

పైడిగాం ప్రాజెక్ట్‌ స్థితిగతులను ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రతిపాదనలు తయారుచేసి ఉన్నతాధికారులకు నివేదించాం. దిగువ ప్రాంతంలో ప్రాజెక్ట్‌ నిర్మించడం ద్వారా పూర్వవైభవం సాధ్యం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం.

-ఎంఎస్‌ పాణిగ్రాహి, ఇరిగేషన్‌ ఏఈ, సోంపేట



Updated Date - 2021-05-27T04:50:54+05:30 IST