
బ్రహ్మానందం.. తెరమీద కనిపిస్తే ప్రేక్షకులకు కడుపు చెక్కలవ్వాల్సిందే. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రేక్షకులను హాస్య సాగరంలో ఓలలాడించిన హాస్య నట చక్రవర్తి ఆయన. అందరికీ ఆయనలోని హాస్య చతురుడే పరిచయం. కానీ, ఆయనో గొప్ప చిత్రకారుడని ఎంత మందికి తెలుసు? కుంచె చేతబడితే.. రవివర్మను తలపిస్తారని, బొమ్మ గీస్తే.. దానికి జీవం పోస్తారని తెలుసా! సమయం దొరికినప్పుడల్లా తనలోని చిత్రకళా తృష్ణను తీర్చుకుంటారు. నటుడు కాక ముందు గొప్ప చిత్రకారుడు కావాలని తలపోసిన ఆయన.. నటుడయ్యాక దాన్ని అభిరుచిగా మార్చుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను నవ్వించే పనిలో క్షణం తీరికలేకుండా గడిపిన ఈ హాస్యతపస్వికి.. లాక్డౌన్.. దేవుడిచ్చిన వరంలా మారింది. తనలోని చిత్రకారుడ్ని సంతృప్తి పరుచుకునేందుకు అద్భుత అవకాశం దొరికింది. ఆ సమయంలో.. ఎన్నో కళాఖండాలు ఆయన కుంచె నుంచి జాలువారాయి. తన బొమ్మలను తానే వివిధ ముఖ కవళికలతో చిత్రీకరించుకున్నారు.
ఎందరో కవులు, కళాకారులు, దేశ నాయకుల చిత్రాలను సజీవంగా ఆవిష్కరించారు. తన ఆరాద్య దైవాల ప్రతిరూపాలను అచ్చుగుద్దారు. ముఖ్యంగా రామాంజనేయులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న చిత్రమైతే.. నభూతో..! రామాంజనేయుల ముఖ కవళికల్లో ఆప్యాయత సజీవంగా కనిపిస్తుంటుంది ఆ చిత్రంలో. గొప్ప కళాకారులకు మాత్రమే సాధ్యమయ్యే ఇలాంటి చిత్రాలు గీయడం.. ఆయనలోని చిత్రకళాకారుడి స్థాయిని తెలియజేస్తుంది. వేంకటేశ్వరుడి చిత్రం.. మరో అద్భుతం. సాక్షాత్తూ.. ఆ తిరుమల వాసుడ్ని దర్శనం చేసుకున్న అనుభూతిని కలిగిస్తోంది ఈ చిత్రం. ఇన్ని చిత్రాలకు జీవం పోసేందుకు ఆయన వాడేది ఓ చిన్న పెన్సిల్ మాత్రమే!
అల్లు అర్జున్, రానాకు ‘బ్రహ్మానందం’..!
సినీ హీరోలు అల్లు అర్జున్, రానా దగ్గుబాటికి బ్రహ్మానందం నూతన సంవత్సర వేళ.. అనూహ్య బహుమతిని అందించారు. 45 రోజులు కష్టపడి తను గీసిన వేంకటేశ్వరస్వామి, రామాంజనేయుల బొమ్మలను ఫొటో ఫ్రేమ్ చేయించి ఈ ఇద్దరు హీరోలకు బహూకరించారు. దీంతో.. ‘బ్రహ్మానందం’ పొందిన బన్నీ, రానా.. ట్విట్టర్ వేదికగా ఈ హాస్యబ్రహ్మకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మేమెంతగానో అభిమానించే బ్రహ్మానందంగారు కొత్త ఏడాదిలో వెలకట్టలేని బహుమతిని ఇచ్చారు’’ అని అల్లు అర్జున్ చెప్పగా.. ‘‘నాకు అద్భుతమైన గిఫ్ట్ అందింది. తాతగారు బతికుంటే ఎంతో ఆనందించేవారు’’ అని రానా అన్నారు.
సినిమా డెస్క్