ఉదయ్‌పూర్‌ హత్య వెనుక పాక్‌ ఉగ్ర హస్తం

Published: Thu, 30 Jun 2022 03:12:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉదయ్‌పూర్‌  హత్య వెనుక పాక్‌ ఉగ్ర హస్తం

అక్కడి దావత్‌-ఎ-ఇస్లామీ సంస్థ ప్రోద్బలంతోనే హత్య

ఆ సంస్థతో హంతకులు గౌస్‌, రియాజ్‌కు సంబంధాలు

2014లో కరాచీకి గౌస్‌.. అక్కడే 45 రోజులు బస 

అతడి వద్ద పాక్‌ సంస్థకు చెందిన 8-10 నంబర్లు 

నూపుర్‌ వాఖ్యల తర్వాత ‘సంచలనానికి’ సంస్థ స్కెచ్‌ 

ప్రతిస్పందన తీవ్రంగా ఉండాలంటూ గౌస్‌కు ఫోన్‌ 

జూన్‌ 20నే చేయాలని.. వీడియో పంపాలని ఆదేశం

హంతకులకు అంతర్జాతీయ సంబంధాలు: గెహ్లోత్‌


జైపూర్‌, జూన్‌ 29: ఉదయ్‌పూర్‌ హత్య ఘటన పక్కా ‘పాక్‌ ఉగ్రవాద ప్రేరేపిత చర్య’ కావొచ్చంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనుమానాలే నిజమయ్యాయి. పదునైన కత్తితో శరీరం నుంచి తలను వేరు చేయడం ద్వారా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యాలాల్‌ (48)ను అత్యంత పాశవికంగా హత్యచేసిన నిందితులు మహమ్మద్‌ రియాజ్‌ అక్తారీ, గౌస్‌ మహమ్మద్‌కు పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాద సంస్థ ‘దావత్‌-ఎ-ఇస్లామీ’తో సంబంధాలున్నట్లు తేలింది. ఈ దారుణ హత్యోదంతం దిశగా ఆ ఇద్దరిని ఉసిగొల్పింది అక్కడి ఆ సంస్థ ప్రతినిధులేననీ స్పష్టమైంది. కరాచీ కేంద్రంగా ఉన్న కార్యాలయం నుంచి హంతకులకు ఫోన్లు వచ్చాయి. ‘నూపుర్‌ శర్మ వ్యాఖ్యలపై మేమిక్కడ నిరసన తెలిపాం.


మీ ప్రతిస్పందన మాత్రం ‘‘తీవ్రంగా’’ఉండాలి.. ఆ ఘటన తాలూకు వీడియోనూ మాకు పంపాలి అని వారికి ఆదేశాలొచ్చాయి!! గౌస్‌కు అయితే దావత్‌-ఎ-ఇస్లామీ సంస్థతో దగ్గరి సంబంధాలున్నట్లు నిర్ధారణ జరిగింది. అతడు 2014లో పాకిస్థాన్‌కు వెళ్లి కరాచీలోని ఆ సంస్థ కార్యాలయంలో 45 రోజులు ఉన్నాడని, దాని ప్రతినిధులతో రెండు మూడేళ్లుగా ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నాడని రాజస్థాన్‌ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకే హంతకులు ఈ ఘటనకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అటు.. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌, ఉదయ్‌పూర్‌ హంతకులకు ‘అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నాయి’ అని ప్రకటించడం విశేషం. మంగళవారం రియాజ్‌, గౌస్‌ కలిసి దుస్తులు కుట్టించుకునే నెపంతో షాపులోకి ప్రవేశించి దర్జీ కన్హయ్యాలాల్‌ను తలనరికి హత్యచేసిన సంగతి తెలిసిందే. మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ శర్మకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో కన్హయ్య పోస్టులు పెట్టడంతో ‘ఇస్లాంకు అవమానం జరిగింది’ అని, ‘ప్రతీకారం’గానే కన్హయ్యను హత్యచేసినట్లు వీడియోలో నిందితులు పేర్కొన్నారు. ఉదయ్‌పూర్‌ ఘటనపై సీఎం అశోక్‌ గెహ్లోత్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని జరిగింది. ఈ ఘటనను ‘ఉగ్రవాద చర్య’గా పరిగణిస్తూ.. ‘చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను నిరోధించే చట్టం (యూఏపీఏ) కేసును నమోదు చేసినట్లు, తదుపరి విచారణ ఎన్‌ఐఏ ఆధ్వర్యంలో జరుగుతుందని, గెహ్లోత్‌ పేర్కొన్నారు.  


ఏమిటీ ‘దావత్‌’ సంస్థ? 

దావత్‌-ఎ-ఇస్లామీ అనేది ఓ సున్నీ ముస్లింలకు చెందిన స్వచ్ఛంద సంస్థ. ప్రధానంగా మహమ్మద్‌ ప్రవక్త, షరియా బోధనలపై పనిచేస్తోంది.  తమ ‘మదానీ’ టీవీ చానల్‌లో మహమ్మద్‌ ప్రవక్త బోధనలను ఉర్దూ, బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. సంస్థ తరఫున పనిచేసే వ్యక్తులు తమ పేరు చివరన సంస్థ వ్యవస్థాపకుడైన ‘అటారీ’ పేరును జోడించుకుంటారు  ఉదయ్‌పూర్‌ ఘటన నిందితుల్లో ఒకడైన రియాజ్‌.. తన పేరు చివర ‘అటారీ’ అని చెప్పడం విశేషం.  

ఉదయ్‌పూర్‌  హత్య వెనుక పాక్‌ ఉగ్ర హస్తం

పాక్‌లోని 8-10 నంబర్ల నుంచి కాల్స్‌ 

నిందితుల్లో ఒకడైన గౌస్‌ మహమ్మద్‌ 2014లో పాకిస్థాన్‌లోని కరాచీకి, 2018-19లో గౌస్‌, అరబ్‌ దేశాలకు, కొన్నిసార్లు నేపాల్‌కూ వెళ్లొచ్చాడని రాష్ట్ర హోంమంత్రి యాదవ్‌ వివరించారు. గత 2-3 ఏళ్లలో గౌస్‌.. పాక్‌ చెందిన 8-10 నంబర్లకు ఫోన్లు చేస్తున్నాడని చెప్పారు. కాగా.. తమ తండ్రికి రోజూ బెదిరింపు ఫోన్లు వచ్చాయని, ఆ కాల్స్‌పై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని మృతుడి కుమారులు యష్‌, తరుణ్‌ చెప్పారు. ఫిర్యాదుపై పోలీసులు సక్రమంగా స్పందించి ఉంటే తమ తండ్రి బతికేవాడని వారు ఆరోపించారు. తండ్రి సంపాదనతోనే ఇల్లు గడిచేదని, ఇప్పుడు తమ గతి ఏమిటని పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. 


శాంతి భద్రతలు లోపించాయి: బీజేపీ 

న్యూఢిల్లీ/బెంగళూరు: రాజస్థాన్‌లో శాంతి భద్రతలు లోపించాయనడానికి కన్హయ్యలాల్‌ హత్యోదంతమే నిదర్శనం అని బీజేపీ విమర్శించింది. హత్య ఘటనపై ఏడు రోజుల ముందే వీడియో విడుదలైందని.. ఆ తర్వాత కూడా గెహ్లోత్‌ సర్కార్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గెహ్లోత్‌ను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌.. విమర్శించారు. కాగా హత్యకు హత్యతోనే సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కేఎస్‌ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివమొగ్గలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో కొందరు మతోన్మాదులు అమాయకుడైన టైలర్‌ తల నరికి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.


ప్రతిస్పందన తీవ్రంగా ఉండాలి 

గౌస్‌, రియాజే కాదు.. పదుల సంఖ్యలో రాజస్థాన్‌కు చెందిన మరికొందరికి పాక్‌లోని దావత్‌-ఎ-ఇస్లామీ సంస్థతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు రాజస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంచలన విషయాలను బయటపెట్టింది. మహమ్మద్‌ ప్రవక్తపై నూపుర్‌ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి పాక్‌లోని దావత్‌ సంస్థ.. ‘ఏదో ఒకటి చేయండి’... ఆ వీడియో మాకు పంపండి అంటూ గౌస్‌, రియాజ్‌లను రెచ్చగొట్టింది. గౌస్‌కు దావత్‌ సంస్థకు చెందిన సల్మాన్‌ భాయ్‌, అబ్బూ ఇబ్రహీం ఫోన్‌ చేసి.. నూపుర్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తాము పాక్‌లో నిరసన ర్యాలీ తీశామని.. మీరు మాత్రం ‘తీవ్ర ప్రతిస్పందన’ తెలియజేయాలని సూచించారు. ఇందుకు ప్రత్యేకంగా జూన్‌ 20వ తేదీనీ నిర్దేశించారు. దీనిపై రియాజ్‌, గౌస్‌  ఉదయ్‌పూర్‌లోని ముఖర్జీ చౌక్‌ వద్దగల అంజుమన్‌లో సిద్దీఖీ, జుల్కన్‌ సదర్‌ (మౌలానా), అష్వాఖ్‌ (న్యాయవాది), మహమ్మద్‌ (న్యాయవాది)తో కలిసి సమావేశమయ్యారు. కన్హయ్య హత్య ప్రణాళికకు ఇక్కడే బీజం పడింది. ఇందుకు గౌస్‌, రియాజ్‌ స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. 20నే హత్య చేయాలనుకున్నా వారికి సాధ్యపడలేదని తెలుస్తోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.