మోదీ అభినందనలపై స్పందించిన పాక్ నూతన పీఎం షెహబాజ్

ABN , First Publish Date - 2022-04-12T21:57:44+05:30 IST

భారత దేశం, పాకిస్థాన్ శాంతిని సాధించాలని, ఇరు దేశాల ప్రజల

మోదీ అభినందనలపై స్పందించిన పాక్ నూతన పీఎం షెహబాజ్

న్యూఢిల్లీ : భారత దేశం, పాకిస్థాన్ శాంతిని సాధించాలని, ఇరు దేశాల ప్రజల సాంఘిక, ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పాకిస్థాన్ నూతన ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మంగళవారం అన్నారు. తనను అభినందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తాము భారత దేశంతో శాంతి, సహకారాలను కోరుకుంటున్నట్లు తెలిపారు. 


ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం పాకిస్థాన్ పార్లమెంటులో గెలిచింది. అనంతరం ప్రతిపక్షాలు షెహబాజ్ షరీఫ్‌ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. నేషనల్ అసెంబ్లీలో జరిగిన ఎన్నికలో ఆయన ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. సోమవారం రాత్రి ఆయన పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 


ప్రధాని మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్‌ను అభినందించారు. ఉగ్రవాద రహిత ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను భారత దేశం కోరుకుంటోందన్నారు. శాంతి, సుస్థిరతలు నెలకొంటే మనం అభివృద్ధి సవాళ్లపై దృష్టి సారించవచ్చునని, సంక్షేమం, సౌభాగ్యాలతో ప్రజలు జీవించేలా చేయవచ్చునని పేర్కొన్నారు. 


ప్రధాన మంత్రిగా ఎన్నికైన అనంతరం షెహబాజ్ మాట్లాడుతూ, కశ్మీరు సమస్య పరిష్కారమవడం వల్ల ఇరు దేశాలు పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలపై దృష్టి సారించే అవకాశం వస్తుందన్నారు. మోదీ అభినందనల సందేశంపై షెహబాజ్ ఇచ్చిన ట్వీట్‌లో, తనను అభినందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారత దేశంతో శాంతియుత, సహకారాత్మక సంబంధాలను పాకిస్థాన్ కోరుకుంటోందన్నారు. జమ్మూ-కశ్మీరుతో సహా వివాదాలన్నీ శాంతియుతంగా పరిష్కారమవడం చాలా అవసరమని పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పోరాటంలో పాకిస్థాన్ చేసిన త్యాగాలు అందరికీ తెలుసునన్నారు. మనం శాంతిని సాధించి, ఇరు దేశాల ప్రజల సాంఘిక, ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. 


Updated Date - 2022-04-12T21:57:44+05:30 IST