పాక్ సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు... విచారణ వాయిదా..

ABN , First Publish Date - 2022-04-04T01:13:45+05:30 IST

ఇస్లామాబాద్: పాక్‌ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూర్ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంతో పాటు సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై

పాక్ సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు... విచారణ వాయిదా..

ఇస్లామాబాద్: పాక్‌ నేషనల్ అసెంబ్లీ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంతో పాటు సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ఈ పిటిషన్‌ను విచారిస్తోంది. పాక్ నేషనల్ అసెంబ్లీలో సోమవారం జరిగిన పరిణామాలన్నీ గమనించామని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణ సమయంలోనే రాజీనామా చేసిన పాక్ అటర్నీ జనరల్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మంగళవారం కోర్టు విచారణకు రావాలని కోరింది. ప్రస్తుతం దేశంలో శాంతి భద్రతల విషయం సైన్యం చూసుకోవాలని కోరింది. అన్ని రాజకీయ పక్షాలు రాజ్యాంగాన్ని అనుసరించాలని సూచించింది. నోటీసులు కూడా జారీ చేసింది.  


ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ప్రతిపక్షాలు ఈ ఉదయం అవిశ్వాస తీర్మానం పెట్టగా పాక్‌ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూర్ తిరస్కరించారు. అనంతరం  ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. సభను రద్దు చేయాలని తాము అధ్యక్షుడు ఆరిఫ్ అలీకి సిఫార్సు చేశామన్నారు. ప్రజలు ఎన్నికలకు సిద్ధం కావాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సిఫార్సు మేరకు అధ్యక్షుడు ఆరిఫ్ అలీ సభను రద్దు చేశారు. ఈ తతంగాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వం రాజ్యంగాన్ని ఉల్లంఘించిందని విమర్శించాయి.  


342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ పీటీఐకి 155 మంది సభ్యులున్నారు. పీఎంఎల్ క్యూ సహా ఇతరుల మద్దతుతో ఆయనకు మద్దతిస్తున్న వారి సంఖ్య 164కు చేరింది. వాస్తవానికి మ్యాజిక్ నెంబర్ 172. ప్రతిపక్ష పీఎంఎల్‌ఎన్‌కు 84, పీపీపీ 56, ఎంఎం‌ఏ‌కు 15 మంది, ఇతరులు 22 మంది ఉన్నారు. వీరందరి బలం 177. మ్యాజిక్ నెంబర్‌ను మించి ప్రతిపక్షాల వద్ద బలముంది.

Updated Date - 2022-04-04T01:13:45+05:30 IST