NIA crackdown : గ్యాంగ్‌స్టర్లు-పాక్ ఉగ్రవాదుల సంబంధాలపై షాకింగ్ నిజాలు

ABN , First Publish Date - 2022-09-13T17:33:16+05:30 IST

మన దేశంలోని గ్యాంగ్‌స్టర్లతో పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఉన్న సంబంధాలను

NIA crackdown : గ్యాంగ్‌స్టర్లు-పాక్ ఉగ్రవాదుల సంబంధాలపై షాకింగ్ నిజాలు

న్యూఢిల్లీ : మన దేశంలోని గ్యాంగ్‌స్టర్లతో పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఉన్న సంబంధాలను తెలుసుకుని దర్యా్ప్తు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీగఢ్, ఢిల్లీలలో 50 చోట్ల నిర్వహించిన దాడుల్లో అక్రమ ఆయుధాలు, నేరపూరిత దస్తావేజులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) స్వాధీనం చేసుకుంది. పంజాబ్, హర్యానాలలో రెండు కేసులను నమోదు చేసింది. 


జాతీయ మీడియా కథనాల ప్రకారం, గ్యాంగ్‌స్టర్-ఉగ్రవాదుల మధ్య సంబంధాల గుట్టును రట్టు చేసేందుకు ఎనిమిది నెలల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాటియాలా జైలు నుంచి ఖైదీలు పరారవడం, మొహాలీ పోలీస్ ఇంటెలిజెన్స్ వింగ్ ప్రధాన కార్యాలయంపై ఆర్‌పీజీ దాడి తర్వాత దీనిపై దృష్టి పెట్టారు. 


ఎన్ఐఏ (National Investigation Agency), స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో యమునా నగర్లోని గ్యాంగ్‌స్టర్ వీరేంద్ర ప్రతాప్ సింగ్ వురపు కాలా రానా ఇంటి నుంచి  ఆరు చట్టవిరుద్ధ ఆయుధాలు, 90 లైవ్ కార్‌ట్రిడ్జెస్, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముక్తసర్‌లోని గోల్డీ బ్రార్ ఇంటి నుంచి ఓ మొబైల్ సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో గోల్డీ బ్రార్ నిందితుడు. ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ జగ్గూ భగవాన్‌పూరియా ఇంటి నుంచి రెండు మొబైల్ ఫోన్ సెట్లు, కొన్ని దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇట్లు గురుదాస్‌పూర్‌లో ఉంది. 


ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి ఇంటి నుంచి ఓ మొబైల్ ఫోన్ సెట్, రెండు మొబైల్ సిమ్ కార్డులను, ఆయన ఇంట్లోని సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను కూడా  స్వాధీనం చేసుకున్నారు. 


గ్యాంగ్‌స్టర్-టెర్రర్ సంబంధాలపై పాక్ ఐఎస్ఐ దృష్టి

పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని పునరుజ్జీవింపజేయాలని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) తీవ్రంగా ప్రయత్నిస్తోందని పంజాబ్ ఉన్నత స్థాయి పోలీసు అధికారులు చెప్పారు. పాకిస్థాన్‌లోని ఖలిస్థాన్ ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు గత దశాబ్దంలో భారత దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని చెప్పారు. వీరంతా స్థానిక నిరుద్యోగ యువతను చిన్న చిన్న మొత్తాల్లో డబ్బులిచ్చి ప్రలోభపెడుతున్నారని, వారిలో ఉగ్రవాద భావాలు నాటుతున్నారని తెలిపారు. 


విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, భయానక టెర్రర్ నెట్‌వర్క్‌తో సంబంధాలున్న సుమారు 10 మంది గ్యాంగ్‌స్టర్లపై కొంత కాలం నుంచి దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఉగ్రవాదిగా మారిన గ్యాంగ్‌స్టర్ హర్వీందర్ సింగ్ రిండా ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నాడు. ఇతనికి మన దేశంలోని 1000 మందికిపైగా బాగా ప్రచారం పొందిన గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. 


గ్యాంగ్‌స్టర్-టెర్రరిస్ట్ సంబంధాలపై భారత సైన్యంలోని నిఘా విభాగం కూడా ప్రత్యేకంగా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిసింది. 


Updated Date - 2022-09-13T17:33:16+05:30 IST