బోటు షికారు ఇంకెప్పుడు?

ABN , First Publish Date - 2022-06-26T05:22:48+05:30 IST

బోటు షికారు ఇంకెప్పుడు?

బోటు షికారు ఇంకెప్పుడు?
పాకాలలో బోటింగ్‌ చేస్తున్న పర్యాటకులు (ఫైల్‌)

పాకాలతో నిలిచిన బోటింగ్‌ సేవలు 

పర్యాటక, అటవీశాఖల మధ్య సమన్వయ లోపం

తగ్గిపోతున్న పర్యాటకుల తాకిడి 

ప్రభుత్వ ఆదాయానికి గండి


ఖానాపురం, జూన్‌ 25: జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన పాకాల సరస్సులో బోటింగ్‌ సేవలు రెండేళ్లుగా నిలిచిపోయాయి. సరస్సులో సరదా గా షికారు చేద్దామని ఎక్కడెక్కడి నుంచో తరలివస్తున్న పర్యాటకులు.. తీరా ఇక్కడి పరిస్థితులు చూసి నిరాశతో ఉసూరుమంటున్నారు. 

పాకాల సరస్సు చుట్టూ అభయారణ్యం, చిలుకల గుట్ట చుట్టూ విస్తరించి ఉన్న పాకాల సరస్సు పర్యాటక పరంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందింది.  పాకాల సరస్సులో బోటు షికారు చేస్తూ చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి అందాలను, సరస్సు మధ్యలో ఉన్న చిలుకల గుట్ట అందాలను వీక్షిస్తూ సాగే విహారయాత్ర పర్యాటకులకు ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. పాకాల సరస్సు మండలంలోని అశోక్‌నగర్‌ శివారులో 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో ఉంది. సరస్సు చుట్టూ 839 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో అభయారణ్యం విస్తరించి ఉంది. 30 అడుగుల నీటి సామర్థ్యం గల పాకాల సరస్సు వర్షా కాలంలో మత్తడి పోసే సమయంలో సరస్సు జలకళను వీక్షించడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో సుదూర ప్రాంతాలను నుంచి వస్తుంటారు. ఏటా మత్తడితో పరవళ్లు తొక్కే పాకాల సరస్సు ఏడాది పొడువునా జల కళను సంతరించుకొని ఉంటుంది. పాకాలను సందర్శిం చిన పర్యాటకులు చిలుకల గుట్ట అందాలు, ఔషధ వనం, బటర్‌ఫ్లై గార్డెన్‌, కట్టపై ఉన్న కృత్రిమ అందాలు తిలకిస్తూ పులకించిపోతారు. అనంతరం సరస్సులో బోటు షికారు చేస్తూ కేరింతలు కొడతారు.

రెండేళ్లుగా నిలిచిన బోటు షికారు

పాకాలలో పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన బోటు షికారుతో వేసవి సెలవులు, ఆదివారాలు, పండుగ సెలవుల్లో పర్యాటకులు సందడి చేసేవారు. కానీ రెండు సంవత్సరాల క్రితం ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకోవడంతో బోటింగ్‌ నిలిచిపోయింది. దీంతో పర్యాటకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అధికారులకు ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు బోటు షికారు ప్రారంభం కాలేదు.

సమన్వయ లోపం

 అటవీశాఖ, టూరిజం శాఖల మధ్య సమన్వయ లోపంతో పాకాలలో బోటింగ్‌ నిలిచిపోయింది. బోటింగ్‌ ద్వారా వచ్చే ఆదాయంలో అటవీ శాఖకు పంచాలనే కొత్త నిబంధనను ఫారెస్ట్‌ అధికారులు విధించడంతో టూరిజం శాఖ బోటింగ్‌ సేవలను నిలిపివేసింది. బోటిం గ్‌ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాని ఫారెస్ట్‌ శాఖకు పంచితే నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో టూరిజం శాఖ అధికారులు బోటింగ్‌ను పునరుద్ధరించ డానికి ముందుకురావడంలేదని తెలుస్తోంది. కాగా బోటింగ్‌ ద్వారా పర్యాటకశాఖకు ఏడాదికి సుమారు రూ.6లక్షల ఆదాయం వస్తుందని సమాచారం. అయితే పాకాలలో బోటింగ్‌ సేవలు నిలిచిపోవడంతో పర్యాట కుల సంఖ్య తగ్గిపోయింది. ఇరు శాఖల అధికారులు చొరవ తీసుకొని పాకాలలో బోటింగ్‌ సేవలను పునఃప్రా రంభించాలని పర్యాటకులు కోరుతున్నారు. 

త్వరలోనే ప్రారంభిస్తాం

జిల్లా టూరిజం శాఖ అధికారి శివాజీ

పాకాలలో నిలిచిపోయిన బోటింగ్‌ సేవలను త్వరలోనే ప్రారంభిస్తాం. ఇటీవల ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో పాకాలలో బోటింగ్‌ పునఃరుద్ధరణపై చర్చించాం. సాధ్యమైనంత త్వరలో బోటింగ్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం.. 

Updated Date - 2022-06-26T05:22:48+05:30 IST