పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలెన్ని? లెటెస్ట్ రిపోర్ట్‌లో ఆందోళనకర అంశాలు

ABN , First Publish Date - 2021-09-12T01:17:50+05:30 IST

ఇది భారత దేశానికే కాదు మన చుట్టూ ఉన్న ఇతర దేశాలకు కూడా ఆందోళన కలిగించే పరిణామమే. పాకిస్తాన్ వద్ద ఇప్పటికే ఉన్న ప్రమాదకర అణ్వాయుధాలు కాకుండా కొత్తవి సిద్ధం అవుతున్నాయట. 2025 సంవత్సరానికల్లా పక్క దేశం వద్ద 200 పైచిలుకు న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉంటాయని అమెరికన్ నిఫుణులు అంచనా వేస్తున్నారు.

పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలెన్ని? లెటెస్ట్ రిపోర్ట్‌లో ఆందోళనకర అంశాలు

ఇది భారత దేశానికే కాదు మన చుట్టూ ఉన్న ఇతర దేశాలకు కూడా ఆందోళన కలిగించే పరిణామమే. పాకిస్తాన్ వద్ద ఇప్పటికే ఉన్న ప్రమాదకర అణ్వాయుధాలు కాకుండా కొత్తవి సిద్ధం అవుతున్నాయట. 2025 సంవత్సరానికల్లా పక్క దేశం వద్ద 200 పైచిలుకు న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉంటాయని అమెరికన్ నిఫుణులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఇప్పటికే ఉగ్రవాదుల ఫేవరెట్ కంట్రీ వద్ద ఎన్ని భయంకర ఆయుధాలున్నాయి? 165 వరకూ ఉండొచ్చని ‘ఫేడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్’ సంస్థ వెలువరించిన తాజా నివేదిక చెబుతోంది.

ఇండియాని ప్రధాన శత్రువుగా భావిస్తూ పాకిస్తాన్ ఎన్నో దశాబ్దాలుగా అణు కార్యక్రమం నడుపుతోంది. ఆ ఫలితంగా ఇప్పటికే 165 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఇస్లామాబాద్ అమ్ముల పొదిలో ఉన్నాయని ‘బులిటెన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్’ అంచనా వేస్తోంది. అధికారికంగా ఇంత వరకూ పాక్ తన అణ్వాయుధాల గురించి ప్రకటన చేయలేదు. కానీ, అమెరికన్ సైంటిస్టులు మాత్రం ఇప్పుడున్నవే కాక రాబోయే సంవత్సరాల్లో మరిన్ని పోగవుతాయని ప్రకటిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా పాకిస్తాన్ రహస్య చర్యలు చేపడుతోందట. 2025 నాటికి 200 అణ్వాయుధాలు సిద్ధంగా ఉండేలా ప్రయోగాలు జరుపుతున్నట్టు సమాచారం.

కేవలం అణ్వాయుధాలు, షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ పైనే కాక అణుధార్మిక పదార్థాలపై కూడా పాక్ దృష్టి పెట్టిందని లెటెస్ట్ రిపోర్ట్ చెబోతోంది. రాజధాని ఇస్లామాబాద్‌కు తూర్పున, ఉత్తరాన యురేనియం, ప్లూటోనియం శుద్ధి చేసే కర్మాగారాల్ని దాయాది దేశం నడుపుతోంది. దాదాపు 3,900 కేజీల యురేనియం, 400 కేజీల ప్లూటోనియం ఇప్పటికే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముందు ముందు మరింతగా అణ్వయుధాలు తయారు చేసేందుకు అవసరమైన యురేనియం, ప్లూటోనియం నిల్వల్ని పాకిస్తాన్ పెంచుకుంటున్నట్టు కూడా అమెరికన్ సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

పాక్ వద్ద అంతకంతకూ పెరుగుతోన్న అణ్వాయుధాలు భారత్‌కు మాత్రమే కాక ఇజ్రాయిల్ లాంటి సుదూర ఆసియా దేశాలకు కూడా ప్రమాదమే. ఇస్లామాబాద్ వద్ద వేల కిలో మీటర్ల దూరాన్ని ఛేదించే క్షిపణులు కూడా ఉన్నాయి. అవి ఇజ్రాయిల్‌ని చేరగలవని అనుమానాలు ఉన్నాయి. ఒక వైపు మిలటరీ, మరో వైపు ఉగ్రవాదులతో కిటకిటలాడే అరాచక పాకిస్తాన్‌లో ఇలా వందలకొద్ది అణ్వాయుధాలుండటం ప్రపంచానికి ఎంత మాత్రం మంచిది కాదు. కానీ, మన పక్క దేశాన్ని ఎవ్వరూ నియంత్రించే  స్థితి లేకపోవటమే అతి పెద్ద విషాదం...     

Updated Date - 2021-09-12T01:17:50+05:30 IST