Asia Cup 2022: ఆసియాకప్‌కు ముందు పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2022-08-21T02:17:33+05:30 IST

ఆసియాకప్‌కు ముందు పాకిస్థాన్‌ (Pakistan)కు ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో బాధపడుతున్న ఆ జట్టు

Asia Cup 2022: ఆసియాకప్‌కు ముందు పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ

ఇస్లామాబాద్: ఆసియాకప్‌కు ముందు పాకిస్థాన్‌ (Pakistan)కు ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో బాధపడుతున్న ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిది (Shaheen Shah Afridi) ఆసియాకప్‌కు దూరమయ్యాడు. గాలెలో శ్రీలంకతో జరిగిన తొలి సందర్భంగా ఈ లెఫ్టార్మర్ గాయపడ్డాడు. దీంతో అదే మైదానంలో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. అఫ్రిది గాయపడినప్పటికీ నెదర్లాండ్స్‌(Netherlands)తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు, యూఏఈలో జరగనున్న ఆసియా కప్‌(Asia Cup) కోసం సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు.


అయితే, పాక్ స్కిప్పర్ బాబర్ ఆజం తాజాగా అఫ్రిది విషయంలో స్పష్టతనిచ్చాడు. నెదర్లాండ్స్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండడని పేర్కొన్నాడు. ఆసియా కప్‌కు ముందు షహీన్ షాకు మరింత విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఆసియా కప్ ఈ నెల 27న ప్రారంభం కానుంది. షహీన్ గైర్హాజరీతో ఇప్పుడు పాక్ వద్ద మూడు ఆప్షన్లు ఉన్నాయి. షన్వాజ్ దహాని, మహ్మద్ వాసిమ్ జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్‌లలో ఎవరో ఒకరిని జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీరిలో నసీమ్ షా నెదర్లాండ్స్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 


ఆసియాకప్‌లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో టీమిండియాతో ఈ నెల 28న ఆడనుంది. 2000, 2012లలో ఆసియా కప్‌లను పాకిస్థాన్ సొంతం చేసుకుంది. అయితే, సూపర్ ఫోర్ రౌండ్‌లో ఇండియా, బంగ్లాదేశ్‌లతో ఓటమి పాలు కావడంతో గత టోర్నీలో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. పాకిస్థాన్ ప్రస్తుతం నెదర్లాండ్స్‌తో వన్డే సరీస్‌లో తలపడుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించిన పాక్.. 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో ఆదివారం (ఆగస్టు 21) రోటర్‌డ్యామ్‌లో జరుగుతుంది. 

Updated Date - 2022-08-21T02:17:33+05:30 IST