తక్కువ టీ తాగండి..డబ్బు ఆదా చేసుకోండి...ప్రజలకు Pakistan ప్రభుత్వం విజ్ఞప్తి

ABN , First Publish Date - 2022-06-16T13:44:58+05:30 IST

టీ తక్కువ తాగమని పాకిస్థాన్ దేశ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ చేసిన విజ్ఞప్తిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి....

తక్కువ టీ తాగండి..డబ్బు ఆదా చేసుకోండి...ప్రజలకు Pakistan ప్రభుత్వం విజ్ఞప్తి

కరాచీ(పాకిస్థాన్): టీ తక్కువ తాగమని పాకిస్థాన్ దేశ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ చేసిన విజ్ఞప్తిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘తక్కువ టీ తాగండి, డబ్బు ఆదా చేసుకోండి’’ అంటూ పాక్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ చేసిన విజ్ఞప్తి పాక్ ప్రజలను ఆశ్చర్యపరిచింది.ఒక పాకిస్థానీ రోజుకు సగటున కనీసం మూడు కప్పుల టీ తాగుతాడని అంచనా.220 మిలియన్ల జనాభా ఉన్న పాక్ దేశంలో ధనిక, పేదలకు అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం టీ.ప్రపంచంలోని టాప్ టీ దిగుమతిదారులలో పాకిస్థాన్ ఒకటి. తేయాకు దిగుమతుల కోసం పాకిస్థాన్ ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ హార్డ్ కరెన్సీ నిల్వల నుంచి దాదాపు 600 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది.


పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన తర్వాత ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించిన ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్... అనారోగ్యంతో ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తామని ప్రకటించారు.6 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని పునరుద్ధరించే ప్రయత్నంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి నిర్దేశించిన షరతులను అందుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ‘‘పాక్ ప్రజలు టీ రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తగ్గించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎందుకంటే మేం దిగుమతి చేసుకున్న టీ కోసం డబ్బు వెచ్చించాల్సి వస్తోంది’’అని ఇక్బాల్ విలేకరుల సమావేశంలో కోరారు.


దీంతో కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో మంత్రి ఇక్బాల్‌ రాజీనామా చేయాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.‘‘నిన్న అహ్సాన్ ఇక్బాల్ మమ్మల్ని తక్కువ టీ తాగమని అడిగారు, రేపు మంత్రి తక్కువ తినండి అని చెప్పవచ్చు. ఇది పరిష్కారమా?’’ అని ఇస్లామాబాద్ శివార్లలో రోడ్డు పక్కన టీ స్టాల్ యజమాని అయిన దిల్ షేర్ ప్రశ్నించారు.ప్రభుత్వం ఇప్పటివరకు ఇంధనం, సహజ వాయువు, విద్యుత్ ధరలను 45శాతం  పెంచింది, తద్వారా ఆహార ధరలు విపరీతంగా పెరిగాయి.పాకిస్తాన్‌లో గంటల తరబడి కరెంటు కోతలు కూడా షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేశాయి.


Updated Date - 2022-06-16T13:44:58+05:30 IST