చైనాతో మా సంబంధాలపై జరిపిన ప్రత్యక్ష దాడి ఇది : పాక్

ABN , First Publish Date - 2022-04-27T01:28:48+05:30 IST

కరాచీ యూనివర్శిటీలో జరిగిన బాంబు పేలుడులో నలుగురు చనిపోయిన ఘటనను పాక్ ప్రభుత్వం తీవ్రంగా తీవ్రంగా ..

చైనాతో మా సంబంధాలపై జరిపిన ప్రత్యక్ష దాడి ఇది : పాక్

ఇస్లామాబాద్: కరాచీ యూనివర్శిటీలో జరిగిన బాంబు పేలుడులో నలుగురు చనిపోయిన ఘటనను పాక్ ప్రభుత్వం తీవ్రంగా తీవ్రంగా ఖడించింది. ఇది ఉగ్రదాడేనని, చైనా-పాక్ సంబంధాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా పేర్కొంది. మృతుల్లో ముగ్గురు చైనీయులు కూడా ఉండటంపై విచారం వ్యక్తం చేసింది. ఉగ్రదాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయని పాక్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.


''ఈ ఉగ్రదాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నారు. కన్ఫ్యూసియస్ ఇన్‌స్టిట్యూట్‌లో పని చేస్తున్న ముగ్గురు చైనీయులు సహా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున, పాక్ ప్రజలు తరఫున సంతాపం తెలియజేస్తున్నాం. క్షతగాత్రులకు స్థానిక అధికారులు అవసరమైన సాయం అందిస్తున్నారు'' అని ఆ ప్రకటన పేర్కొంది. పాకిస్తాన్, చైనా సంబంధాలపై ఇది నేరుగా జరిపిన దాడని తెలిపింది. ''ఇదొక పిరికిచర్య. పాక్, చైనా మధ్యనున్న మిత్రత్వం, సహకార సంబంధాలపై జరిగిన ప్రత్యక్ష దాడి. మాది ఉక్కు బంధం. చైనా జాతీయులు, ప్రాజెక్టుల భద్రతకు పాకిస్థాన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది'' అని ప్రభుత్వం తెలిపింది.


కాగా, కరాచీ యూనివర్సిటీలో జరిపిన దాడి తమ పనే అంటూ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దళ సభ్యురాలు తనను తాను పేల్చివేసుకున్న ఘటనలో ముగ్గురు చైనీయులు, వారి స్థానిక డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి మొత్తం సీసీటీవీలో రికార్డయింది.

Updated Date - 2022-04-27T01:28:48+05:30 IST