పాక్ భద్రతా విధానంలో హిందుత్వంపై విమర్శలు

ABN , First Publish Date - 2022-01-14T21:22:02+05:30 IST

పాకిస్థాన్ మొట్టమొదటి జాతీయ భద్రతా విధానాన్ని ఆ దేశ

పాక్ భద్రతా విధానంలో హిందుత్వంపై విమర్శలు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మొట్టమొదటి జాతీయ భద్రతా విధానాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం విడుదల చేశారు. దీనిలో కూడా యథావిధిగానే భారత దేశంపై అక్కసు వెళ్ళగక్కారు. తప్పుడు సమాచారం, హిందుత్వం, రాజకీయ ప్రయోజనాల కోసం దూకుడుగా వ్యవహరించడం వంటివి భారత దేశం నుంచి పాకిస్థాన్‌కు ఎదురవుతున్న సమస్యలని పేర్కొన్నారు. 


పాకిస్థాన్ మీడియా శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, ఆ దేశ తొలి జాతీయ భద్రతా విధానాన్ని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం ఆవిష్కరించారు. దీనిని గత నెలలో పాకిస్థాన్ కేబినెట్, నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఆమోదించాయి. ప్రజల ఆర్థికాభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఈ విధానాన్ని రూపొందించారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రజల అభివృద్ధి, ఆర్థిక భద్రత, ఆర్థికంగా దేశం నిలదొక్కుకోవడం లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. పాకిస్థాన్ ఆవిర్భవించినప్పటి నుంచి కేవలం సైన్యంపై మాత్రమే దృష్టి సారించారని ఆరోపించారు. 


మొట్టమొదటిసారి జాతీయ భద్రతా విభాగం ఏకాభిప్రాయంతో ఓ దస్తావేజును రూపొందించిందన్నారు. ఇది జాతీయ భద్రతను సరైన విధంగా నిర్వచిస్తోందని చెప్పారు. ఈ జాతీయ విధానం 2022 నుంచి 2026 వరకు అమలవుతుందన్నారు. 


భారత దేశం నుంచి ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావిస్తూ, ఉద్దేశపూర్వకంగా జరిగే తప్పుడు ప్రచారం, రాజకీయ ప్రయోజనాల కోసం దూకుడుగా వ్యవహరించడం, హిందేుత్వం వంటి సమస్యలు భారత్ నుంచి ఎదురవుతున్నాయని ఈ విధాన పత్రం పేర్కొంది. 


Updated Date - 2022-01-14T21:22:02+05:30 IST