ICC Women's World Cup: రాణించిన పూజా, రాణా, స్మృతి మంధాన.. పాక్ టార్గెట్ ఎంతంటే..!

ABN , First Publish Date - 2022-03-06T15:37:28+05:30 IST

మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది.

ICC Women's World Cup: రాణించిన పూజా, రాణా, స్మృతి మంధాన.. పాక్ టార్గెట్ ఎంతంటే..!

బే ఓవల్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. దాయాది జట్టుకు 245 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత బ్యాటర్లలో పూజా వస్త్రాకర్(67), స్నేహరాణా(53), స్మృతి మంధాన (52), దీప్తి శర్మ (40)రాణించారు. పాక్ బౌలర్లు ప్రారంభంలో భారత బ్యాటర్లను కట్టడి చేసిన చివరల్లో మాత్రం చేతులేత్తేశారు. దాంతో భారత్‌కు పోరాడే స్కోర్ దక్కింది. ఇక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే టీమిండియా తడబడింది. జట్టు స్కోర్‌ 4 పరుగుల వద్ద ఓపెనర్ షెఫాలి వర్మ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగింది. దాంతో వన్‌డౌన్‌గా వచ్చిన దీప్తి శర్మతో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన నెమ్మదిగా ఆడారు. ఆ తర్వాత కాస్త వేగం పెంచారు. 


ఈ క్రమంలో జట్టు స్కోర్‌ 96 పరుగుల వద్ద దీప్తి శర్మ (40; 57 బంతుల్లో 2x4, 1x6) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరారు. దీంతో ఈ ద్వయం 92 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత హాఫ్ సెంచరీతో కుదురుకున్నట్లు కనిపించిన స్మృతి మంధాన (52; 75 బంతుల్లో 3x4,1x6) కూడా మరో రెండు పరుగులకే మూడో వికెట్‌గా వెనుదిరిగింది. కాసేపటికే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (5), రీచా ఘోష్‌(1) సైతం వెనుదిరిగారు. దీంతో మిథాలిసేన 16 పరుగుల స్వల్ప వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం రిచా(01), కెప్టెన్ మిథాలి(09) కూడా వెంటవెంటనే వికెట్లు పారేసుకున్నారు. దాంతో టీమిండియా 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడిపోయింది. 


ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పూజా వస్త్రాకర్‌ బ్యాట్ ఝలిపించింది. స్నేహరాణాతో కలిసి అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో వస్త్రాకర్, స్నేహరాణా అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. అయితే, 8 బౌండరీల సహాయంతో 67 పరుగులు చేసిన వస్త్రాకర్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ మొదటి బంతికి ఔటైంది. దీంతో ఈ జోడి 122 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివరకు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. పాక్ ముందు 245 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్ బౌలర్లలో నీదా దార్, నష్రా సంధు చెరో రెండు వికెట్లు.. దియానా బైగ్, అమీన్, ఫాతీమా సనా తలో వికెట్ పడగొట్టారు.  

Updated Date - 2022-03-06T15:37:28+05:30 IST