అత్యాచారానికి పాల్పడితే కెమికల్ క్యాస్ట్రేషన్.. ఆమోదం తెలిపిన ఇమ్రాన్ ఖాన్

ABN , First Publish Date - 2020-11-25T06:49:55+05:30 IST

అత్యాచారానికి పాల్పడిన వారికి కెమికల్ క్యాస్ట్రేషన్(డ్రగ్స్ ద్వారా వృషణాలు తొలగించడం) శిక్ష విధించేలా చట్టంలో మార్పులు

అత్యాచారానికి పాల్పడితే కెమికల్ క్యాస్ట్రేషన్.. ఆమోదం తెలిపిన ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: అత్యాచారానికి పాల్పడిన వారికి కెమికల్ క్యాస్ట్రేషన్(డ్రగ్స్ ద్వారా వృషణాలు తొలగించడం) శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేసిన ముసాయిదాకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదం తెలిపినట్టు పాక్ మీడియా తెలిపింది. మంగళవారం ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో ఫెడరల్ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న న్యాయమంత్రిత్వ శాఖ అత్యాచార నిరోధక ఆర్డినెన్స్‌ ముసాయిదాను ఇమ్రాన్ ఖాన్‌కు సమర్పించగా.. చట్టంలో మార్పులకు ఆయన ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పోలీసింగ్‌లో మహిళల పాత్రను పెంచేలా ఇదే ముసాయిదాలో మార్పులు చేసినట్టు కూడా రిపోర్టులు చెబుతున్నాయి. 


కొత్త చట్టం వెంటనే అమల్లోకి రావాలని, ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించాలని ఇమ్రాన్ ఖాన్ అధికారులతో అన్నట్టు సమాచారం. అంతేకాకుండా అత్యాచారానికి గురైన వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని, ప్రభుత్వం వారి వివరాలను గోప్యంగా ఉంచుతుందని ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్టు పాక్ మీడియా వివరించింది. ఇదిలా ఉంటే.. ఈ చట్టాన్ని త్వరలోనే పార్లమెంట్‌లో పెట్టనున్నట్టు పాకిస్థాన్ టెహ్రీక్ ఇ ఇన్సాఫ్ సెనెటర్ ఫైజల్ జావేద్ ఖాన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాగా.. ఇటీవల పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. త్వరలో ప్రభుత్వం ముడు అంచెల చట్టాన్ని ప్రవేశపెడుతుందని తెలిపారు. ఈ చట్టంలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారి పేర్ల నమోదు చేయడం, అత్యాచారానికి పాల్పడిన, పిల్లలను వేధించిన వారికి కఠోరశిక్ష విధించడం, సమర్థవంతమైన పోలిసింగ్ అంశాలను కూడా చేర్చినట్టు పేర్కొన్నారు.

Updated Date - 2020-11-25T06:49:55+05:30 IST