Pakistan Sikh girl: ఎంగేజ్‌మెంట్ అయి పెళ్లి చేసుకోవాల్సిన సిక్కు అమ్మాయి.. ముస్లిం భర్త వద్ద కనిపించడంతో కలకలం: చివరికి కథ ఇలా ముగిసింది!

ABN , First Publish Date - 2022-08-24T00:54:10+05:30 IST

నిశ్చితార్థం జరిగి పెళ్లి కావాల్సిన ఓ సిక్కు యువతి ఇంటి నుంచి వెళ్లిపోయి తన భర్తగా చెబుతున్న ఉపాధ్యాయుడైన

Pakistan Sikh girl: ఎంగేజ్‌మెంట్ అయి పెళ్లి చేసుకోవాల్సిన సిక్కు అమ్మాయి.. ముస్లిం భర్త వద్ద కనిపించడంతో కలకలం: చివరికి కథ ఇలా ముగిసింది!

అమృత్‌సర్: నిశ్చితార్థం జరిగి పెళ్లి కావాల్సిన ఓ సిక్కు యువతి ఇంటి నుంచి వెళ్లిపోయి తన భర్తగా చెబుతున్న ఉపాధ్యాయుడైన ఓ ముస్లిం వ్యక్తి వద్ద కనిపించింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు షెల్టర్‌ హోంకు పంపగా ఆమె భర్తగా చెబుతున్న వ్యక్తిని జైలుకు పంపారు. పాకిస్థాన్‌ (Pakistan)లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమె పేరు దీనా కౌర్ (Deena Kaur). మునీష్ కుమార్(Munish Kumar) అనే యువకుడితో ఆరేడేళ్ల క్రితం ఆమెకు వివాహం నిశ్చితార్థమైంది. త్వరలో వివాహం కావాల్సి ఉంది. అంతలోనే ఆమె తన భర్తగా చెబుతున్న హెజ్బుల్లా (Hesbullah) వద్ద కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 


ఖైబర్ పంక్తుంఖ్వా ప్రావిన్స్ బునేర్ జిల్లాలోని పీర్ బాబా పట్టణానికి చెందిన అజయ్ సోరన్ సింగ్ స్థానిక యూత్ లీడర్. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్షాఫ్ బునేర్ జిల్లా అధ్యక్షుడు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. దీనా కౌర్‌ను పోలీసులు స్వాత్ జిల్లా మినోగ్రా నగరంలోని  దార్ ఉల్ అమన్ (షెల్టర్ హోం)కు పంపినట్టు చెప్పారు. హెజ్బుల్లాను జైలుకు తరలించినట్టు చెప్పారు. అయితే, కౌర్‌తో మాట్లాడేందుకు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు అనుమతించలేదు. 


ఆమె తల్లిదండ్రులు గురుచంద్రన్ లాల్ గాంధీ-ఆశాకౌర్‌లు మాత్రం తమ కుమార్తె దీనా కౌర్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బలవంతంగా మతం మార్చి హెజ్బుల్లాతో వివాహం జరిపించారని ఆరోపిస్తున్నారు. దీనాను బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకున్నారన్న వార్తలతో బునేర్‌తోపాటు సమీప జిల్లాల్లో నిరసనలు మొదలయ్యాయి. హెజ్బుల్లాపై చర్యలు తీసుకోవాలంటూ దీనా కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కౌర్‌ను గుర్తించి షెల్టర్ హోమ్‌కు తరలించారు. హెజ్బుల్లాను జైలుకు పంపారు.


పాకిస్థాన్‌లోని మైనారిటీల జాతీయ కమిషన్ సభ్యుడు డాక్టర్ జైపాల్ చబారియా మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనా కౌర్‌ను బలవంతంగా మతమార్పిడి చేశారన్న విషయాన్నికొట్టిపారేయలేమన్నారు. ఇస్లాం, లేదంటే ఇతర మతాల్లోకి మారే విషయంలో మైనారిటీలు తమ కుటుంబ సభ్యులను పట్టించుకోవడం లేదన్నారు. అయితే, మత మార్పిడి అనేది మేజిస్ట్రేట్ ముందు జరగాలని డిమాండ్ చేశారు. అలాగే,  మతం మార్చుకోవాలనుకునే వారిని మత మార్పిడికి ముందు తమ తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. ఎస్‌జీపీసీ అధ్యక్షుడు హర్జీందర్ సింగ్ ధామి మాట్లాడుతూ.. దీనా కౌర్ మతమార్పిడి వెనక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-24T00:54:10+05:30 IST