భారతీయ దౌత్యవేత్తను పిలిచి నిరసన తెలిపిన పాకిస్థాన్

ABN , First Publish Date - 2021-07-30T22:39:00+05:30 IST

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో ఎన్నికలపై భారత్ చేసిన

భారతీయ దౌత్యవేత్తను పిలిచి నిరసన తెలిపిన పాకిస్థాన్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో ఎన్నికలపై భారత్ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ ఖండించింది. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ దౌత్యవేత్తను పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. జమ్మూ-కశ్మీరు వివాదంపై తన వైఖరిని పునరుద్ఘాటించింది. ఈ వివరాలను పాకిస్థాన్ ఫారిన్ ఆఫీస్ శుక్రవారం వెల్లడించింది. 


భారత దేశం నిరసన తెలపడాన్ని పాకిస్థాన్ పూర్తిగా తిరస్కరిస్తోందని తెలియజేయడానికి భారత దేశ దౌత్యవేత్తను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పిలిపించినట్లు తెలిపింది. జమ్మూ-కశ్మీరు వివాదంపై స్పష్టమైన, నిలకడగల వైఖరిని తెలియజేసినట్లు వివరించింది. 


పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో జూలై 25న జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహరీక్ ఇన్సాఫ్ పార్టీ గెలిచింది. ఈ ఎన్నికలను భారత దేశం గురువారం పూర్తిగా తిరస్కరించింది.  అక్రమ ఆక్రమణకు ముసుగు వేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం ఇటువంటి పై పై మెరుగులు దిద్దుతోందని దుయ్యబట్టింది. దీనిపై గట్టిగా నిరసన తెలిపినట్లు పేర్కొంది. 


భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఆన్‌లైన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ భారత భూభాగాలపై పాకిస్థాన్‌కు అధికార పరిధి లేదని పేర్కొన్నారు. అక్రమ ఆక్రమణలో ఉన్న భూభాగాల నుంచి పాకిస్థాన్ వైదొలగాలని డిమాండ్ చేశారు. 


పాకిస్థాన్ చట్టవిరుద్ధ ఆక్రమణలో ఉన్న భారతీయ భూభాగాల్లో జరిగాయంటున్న ఎన్నికలు కేవలం తన చట్టవిరుద్ధ ఆక్రమణను దాచిపెట్టడానికి జరిగిన కాస్మటిక్ ఎక్సర్‌సైజ్ మాత్రమేనని తెలిపారు. ఈ భూభాగాల్లో పాకిస్థాన్ చేసిన మార్పులను మరుగుపరచడానికే ఈ ఎన్నికలను నిర్వహించిందన్నారు. జమ్మూ-కశ్మీరు గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో భారత్‌లో అంతర్భాగమేనని చెప్పారు. 




Updated Date - 2021-07-30T22:39:00+05:30 IST