ఎయిర్ ట్రావెలర్స్‌కి పాకిస్థాన్ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-10-01T23:53:41+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సినేషన్ చేయించుకోనివారు విమాన ప్రయాణాలు

ఎయిర్ ట్రావెలర్స్‌కి పాకిస్థాన్ హెచ్చరిక

ఇస్లామాబాద్ : కోవిడ్-19 వ్యాక్సినేషన్ చేయించుకోనివారు విమాన ప్రయాణాలు చేయరాదని పాకిస్థాన్ పౌర విమానయాన సంస్థ శుక్రవారం తెలిపింది. వ్యాక్సినేషన్‌పై గట్టిగా దృష్టిపెట్టడంతోపాటు భవిష్యత్తులో కఠినమైన అష్టదిగ్బంధనాలను నివారించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. పూర్తిగా టీకాలు వేయించుకున్నవారిని మాత్రమే విమాన ప్రయాణాలకు అనుమతిస్తామని పేర్కొంది. 


నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (ఎన్‌సీఓసీ) మార్గదర్శకాల మేరకు పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ శుక్రవారం ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసుగలవారు పూర్తిగా కోవిడ్-19 టీకా డోసులు తీసుకుంటేనే విమాన ప్రయాణాలకు అనుమతిస్తామని తెలిపింది. పాకిస్థాన్ లోపల, పాకిస్థాన్ నుంచి, లేదా, ఇతర దేశాల నుంచి పాకిస్థాన్‌కు ప్రయాణం చేయాలనుకునేవారు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించాలని పేర్కొంది. అక్టోబరు 1 నుంచి ఈ నిబంధనలు అమలవుతాయని తెలిపింది. 


పాకిస్థాన్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వర్ ఖాన్ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, పాకిస్థాన్‌లో దేశీయ విమాన ప్రయాణాలకు 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసుగలవారు పూర్తిగా కోవిడ్-19 టీకా డోసులు తీసుకుంటేనే అనుమతిస్తామని తెలిపారు. 


18 సంవత్సరాల కన్నా తక్కువ వయసుగల బాలలను వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకపోయినా విమాన ప్రయాణాలకు అనుమతిస్తారు. 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్కులు పాకిస్థాన్‌కు వెళ్ళాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకపోయినా అక్టోబరు 31 వరకు అనుమతిస్తారు.


Updated Date - 2021-10-01T23:53:41+05:30 IST