Pakistani actor Resham: పాక్ నటి మంచి మనసు.. సోషల్ మీడియా గరంగరం!

ABN , First Publish Date - 2022-09-17T02:42:08+05:30 IST

మనం చేసే పని మంచిదే కావచ్చు. కానీ, ఒక్కోసారి అందులోనూ తప్పులు దొర్లుతుంటాయి. మనకు అది తప్పు అని అనిపించకపోవచ్చు

Pakistani actor Resham: పాక్ నటి మంచి మనసు.. సోషల్ మీడియా గరంగరం!

ఇస్లామాబాద్: మనం చేసే పని మంచిదే కావచ్చు. కానీ, ఒక్కోసారి అందులోనూ తప్పులు దొర్లుతుంటాయి. మనకు అది తప్పు అని అనిపించకపోవచ్చు.. గమనించిన వారు దానిని పట్టుకోవచ్చు. కాబట్టి చేసే పని మంచిదే అయినా అది మనసుతో చేయాలి. పర్యవసానాలు ఆలోచించాలి. పాకిస్థాన్ నటి రేషమ్ తాను మంచి పనే చేస్తున్నానని అనుకుని చిక్కుల్లో పడ్డారు. 


ఓ నదిలోని చేపలు, ఇతర జలచరాలకు ఆహారం వేసిన ఆమె మంచి మనుసును మెచ్చుకోకుండా ఉండలేం. కానీ, చివర్లో ఆమె చేసిన పనే విమర్శలకు కారణమైంది.  ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ నెల 11న ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో బ్రిడ్జిపై కారు ఆపి కింద పారుతున్న నదిలో ఉన్న చేపలకు ఆహారంగా కొన్ని మాంసం ముక్కలు, బ్రెడ్ ముక్కలు వేశారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఆహారం వేయడం పూర్తయిన తర్వాత వాటిని తీసుకొచ్చిన ప్లాస్టిక్‌ను కూడా అందులోనే పడేశారు. పాకిస్థాన్‌లో ఇటీవల సంభవించిన వరదలకు తీవ్రంగా నష్టపోయిన చర్‌సడ్డాలో సాయం అందించేందుకు వెళ్తూ ఆమె ఈ పని చేశారు. బ్రిడ్జిపై కారు ఆపి కిందనున్న జింది నదిలోని చేపలకు ఆహారం వేశారు.


ఆమె ఈ వీడియోను పోస్టు చేసిన వెంటనే వైరల్ అయింది. నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం మొదలుపెట్టారు. నీటిలో బ్రెడ్ వేయడం ఏంటంటూ మండిపడ్డారు. బ్రెడ్ నీటిలో పడగానే కరిగిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, చివర్లో ప్లాస్టిక్ కవర్లను నదిలోకి విసిరేయడంపైనా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపలకు ఆహారం అందించి మంచి పనిచేస్తూనే వాటికి హాని తలపెట్టారంటూ మరికొందరు కామెంట్ చేశారు. 


పాకిస్థాన్ సామాజిక కార్యకర్త అస్మా ఆజమ్ ఈ వీడియోపై స్పందించారు. ఆమె అంతంగా కాన్ఫిడెంట్‌గా నదిలోకి ప్లాస్టిక్ విసిరారంటే పర్యావరణ కాలుష్యంపైనా, అదే చేసే హానిపైనా ఆమెకు అవగాహన లేకపోయి ఉండొచ్చన్నారు. ఈ భూమిపై మన వైఖరి అంతేనని, మనం తెలుసుకోలేమని, కనీసం అందుకు పశ్చాత్తాపం కూడా పడమని రేషమ్‌ను ఉద్దేశించి అస్మా ట్వీట్ చేశారు. 


సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించిన నటి రేషమ్ ‘డైలీ పాకిస్థాన్’తో మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ను తాను పొరపాటున నదిలోకి విసిరేశానని పేర్కొన్నారు. మహిళలపై హింస సర్వసాధారణమైపోయిందన్న రేషమ్.. ఒక్క ప్లాస్టిక్ ముక్కతో వారి కళ్లు మూసుకుపోయాయని విరుచుకుపడ్డారు. వారు మూర్ఖుల స్వర్గంలో నివసిస్తున్నారని మండిపడ్డారు. తాను సద్కాష్ (దాతృత్వం) మాత్రమే చేశానని రేషమ్ చెప్పుకొచ్చారు. 



Updated Date - 2022-09-17T02:42:08+05:30 IST