మునుగోడులో పక్కాలోకల్‌

ABN , First Publish Date - 2022-10-02T05:44:28+05:30 IST

దుబ్బాక, హుజూరాబాద్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమితో అధికార టీఆర్‌ఎస్‌ మునుగోడులో ఆ లోపాలకు తావివ్వొద్దని నిర్ణయించింది. మునుగోడు ఉపఎన్నికలో ఓటరు కేంద్రంగానే సైలెంట్‌గా ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

మునుగోడులో పక్కాలోకల్‌
మునుగోడు మండలం పలివెలలో టీఆర్‌ఎ్‌సకు ఓటు వేయాలని రైతులను కోరుతున్న రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఇతర జిల్లాలమంత్రులు,ఎమ్మెల్యేలు చుట్టపు చూపే 

సీపీఎం, సీపీఐలతో సమన్వయం 

గ్రామ, మండలస్థాయిలో ఉమ్మడి కమిటీలు 

మోటర్లకు మీటర్లు, రైతుబంధుపై విస్తృత ప్రచారం 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ): దుబ్బాక, హుజూరాబాద్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమితో అధికార టీఆర్‌ఎస్‌ మునుగోడులో ఆ లోపాలకు తావివ్వొద్దని నిర్ణయించింది. మునుగోడు ఉపఎన్నికలో ఓటరు కేంద్రంగానే సైలెంట్‌గా ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు మునుగోడు ఉపఎన్నిక బాధ్యతలు పూర్తిగా ఇవ్వాలని, ప్రతీ ఎంపీటీసీ పరిధిలో ఒక కీలకనేతను బాధ్యుడిని చేయాలని నిర్ణయించారు. అయితే తాజాగా ఈ నిర్ణయంలోనూ స్వల్ప మార్పులు చేసినట్లు తెలిసింది. 


చేరికలు, పెద్ద నాయకుల అవసరం అనుకున్నప్పుడే మంత్రులస్థాయినేతలు రావాలి. మిగిలిన సమయమంతా మంత్రి జగదీ్‌షరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావుల పర్యవేక్షణలో ముందుకెళ్లాలని నిర్ణయించారు. సీపీఎం, సీపీఐ నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రచార బరిలోకి దిగేందుకు ఆయా పార్టీల నేతలతో గ్రామ, మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రచారంలో మూడు పార్టీల నేతలు కలిసే వెళ్లాలని నిర్ణయించారు. నియోజకవర్గంలోని రైతులు బీజేపీ అంటేనే భయపడేలా కార్యాచరణ రూపొందించారు. బీజేపీకి ఓటు వేస్తే మోటరుకు మీటరు తప్పదంటూ  ప్రచారానికి రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. 


చేరికల అంశం మంత్రి జగదీ్‌షరెడ్డికి 

చేరికల అంశాన్ని మంత్రి జగదీ్‌షరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పార్టీ శ్రేణులు, సానుభూతిపరులతో ఆత్మీయ సమ్మేళనాలు, దళితులు, గిరిజనులు, చేనేత కార్మికులతో ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్నాయి. గౌడ సామాజికవర్గ ఓటర్లను ఆకర్షించేందుకు సర్వాయి పాపన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి విగ్రహాల ఏర్పాటుకు కమిటీలు ఏర్పాటు చేశారు. రజక సామాజికవర్గాన్ని అకర్షించేందుకు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. చేనేత సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో స్థానికంగా ఆయా సామాజికవర్గాల్లో పట్టు న్న నేతల కే బాధ్యతలు అప్పగించి స్థానికంగా మకాం వేసేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే సామాజికవర్గాలవారీగా ఆకర్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని షెడ్యూల్‌ ఖరారు చేశారు. 


కమ్యూనిస్టులతో కలిసి.. 

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీని అడ్డుకునేందుకు టీఆర్‌ఎ్‌సకు మద్దతిస్తున్నట్లు సీపీఐ, సీపీఎం నేతలు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో చర్చలు పూర్తయ్యాయి. అయితే స్థానికంగా బలమున్న ఆరెండు పార్టీలతో అధికార పార్టీ నేతలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ ఖరారుచేశారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని మంత్రి జగదీ్‌షరెడ్డి క్యాంపు కార్యాలయంలో సీపీఎం నేతలతో మంత్రి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చర్చలు జరిపారు. సీపీఎం, సీపీఐ, టీఆర్‌ఎస్‌ మూడు పార్టీలకు చెందిన నేతలతో గ్రామ, మండలస్థాయిలో కమిటీలు వేయాలని, ఈ కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీలోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలని నిర్ణయించారు. 


సెమీ ఫైనల్‌గా ‘మునుగోడు’

సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికను అధికార టీఆర్‌ఎస్‌ సెమీఫైనల్‌గా భావిస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వరుస ఓటమిలను మరపించాలంటే మునుగోడును ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని నిర్ణయానికి సీఎం కేసీఆర్‌ వచ్చారు. గత ఎన్నికల్లో చేసిన హడావిడి, విచ్చలవిడి పథకాలు, నేతల కొనుగోలు, లెక్కకు మించి పదవుల పందేరం, ఓటుకు భారీగా రేటు నిర్ణయించడం వంటి అన్ని అంశాలు గెలుపును ఇవ్వలేకపోయాయి. ఆ అనుభవంతో మునుగోడులో మౌనంగా ఓటరు కేంద్రంగా ప్రచారంసాగాలని నిర్ణయించారు. ఇప్పటికే సామాజిక వర్గాలవారీగా ఓటర్ల విభజనచేసి ప్రచారం చేస్తున్నారు. ప్రతీరోజు ఎక్కడికక్కడ స్థానికనేతలతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 


మోటర్లకు మీటర్లపై విస్తృత ప్రచారం

ప్రస్తుతం 24గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చే స్తోంది. ఈ సౌకర్యం ఇలాగే ఉండాలంటే టీఆర్‌ఎ్‌స కే ఓటు వేయాలి, బీజేపీకి ఓటు వేస్తే ఉచిత కరెం టు నిలిచిపోతుంది. మోటర్లకు మీటర్లు పెట్టడం ఖా యమని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో మోటర్లకు మీటర్లు బిగించే కార్యక్రమం వేగవంతంగా సాగుతుందని వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఒక పెద్ద రైతు కావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్టుబడి సాయం కింద రైతుబంధు, ప్రమాదంలో రైతు చనిపోతే రైతుబీమా వంటివి అందుతున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. మునుగోడు పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం, సుమారు 45వేల కుటుంబాలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడ్డాయి. ఈ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు మండల, గ్రామ రైతు సమన్వయ సమితి నాయకులు, సభ్యులు ఆరుగురిని ఒక టీంగా ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్‌ బొమ్మతో ఉన్న ఒక కరపత్రాన్ని ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీలోపు నియోజకవర్గంలోని రైతు కుటుంబాలను కలిసే కార్యక్రమానికి మునుగోడు మండలంలోని పలివెల గ్రామంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి శనివారం శ్రీకారం చుట్టారు. 

Updated Date - 2022-10-02T05:44:28+05:30 IST